Loading...

7, జూన్ 2021, సోమవారం

అడకత్తెర

 

అడకత్తెర
కన్నడ మూలము : కె ఎస్ నరసింహస్వామి
తెలుగు అనువాదము: లక్ష్మీదేవి.
*****
చలికాలం వస్తే ‘ఎంత చలి?’ అంటారు;
వచ్చిందా వేసవి, ‘పాడు ఎండలం’టారు;
వాన పడెనా, ‘విడువదు శని!’ అనుచు నింద;
వీరు మెచ్చునది లేదిచట, తెలిసిందా!
 
చిగురు పసిడి నడుమ పువ్వు కోరెదరు;
పువ్వుల కాలమున పండ్లఁ బొగడెదరు;
‘పండేది? పీల పిందె’ అనుచునొక నింద;
వీరు మెచ్చునది లేదిచట, తెలిసిందా!
 
నిలుచున్న-నడిగేరుః ‘ఏల నిలిచేవు?’
పడుకున్న గొణిగేరుః ‘చింతలే లేవు.’
పరుగిడిన వీపు వెనుక వీరి నింద;
వీరు మెచ్చునది లేదిచట, తెలిసిందా?
 
చదువు తఱి యడిగేరుః వ్రాయి మరలనుచు;
రాతలను వెదకేరు: ఒప్పు తప్పనుచు;
వీరి ముచ్చటలేమొ!వీరిదే నింద;
వీరు మెచ్చునది లేదిచట, తెలిసిందా!
***
వందేళ్ళ ముందు జన్మించిన ప్రసిద్ధ కన్నడ రచయిత కె ఎస్ నరసింహస్వామి వ్రాసిన కవిత 'ఇక్కళ' . ఇక్కళ అంటే పట్టకారు. పట్టకారు మధ్యలో ఇరుక్కున్నట్టే ఈ లోకుల మధ్యన. ఏమి చేసినా తప్పు పట్టేందుకు సిద్ధంగా ఉంటారన్నది సారాంశము. ఇక్కడ మధ్యలో ఇరుక్కున్న సందర్భానికి అడకత్తెర అన్న వాడుక తెలుగులో ఉంది కాబట్టి అదే పేరు పెట్టాను.

 

2 వ్యాఖ్యలు: