Loading...

15, జూన్ 2022, బుధవారం

ప్రాయోపవేశాలు

 

పలు సందర్భాల్లో కావ్యాల్లో ప్రాయోపవేశాలు లేదా తత్సంబంధమైన ఆలోచనలు కనిపిస్తాయి. చాలా గుణగణాలు గలిగిన, స్థితప్రజ్ఞులైన నాయికానాయకులు, ఇతర ప్రముఖ పాత్రలు కూడా మినహాయింపు కాదు. ఆ యా శోక,దుఃఖభరితమైన సందర్భాలలో లేదా ఇక జీవించి ఉండాల్సిన అవసరం లేదు అని నిశ్చయించుకొని చేసిన ఆలోచనలు, పనులవి. అలా ఎందుకు చేశారని లేదా వ్రాశారని విమర్శలు లేవు కూడా.
కానీ మధ్యకాలాలలో ఆత్మహత్య మహాపాపమనే వాదన ఎలా ప్రబలింది? చట్టపరంగా కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినవారికి శిక్షలు ఎందుకు ఉన్నాయి? ఈ చట్టాలైతే విదేశీ అనుకరణలై ఉండొచ్చు. కానీ జనాలు కూడా నమ్ముతున్నారు ఇది పాపమని. అదెలా? అంత దుర్భరమైన పరిస్థితిలో జీవించి ఉండి ఆత్మను, శరీరాన్ని వేదనకు గురి చేయడం మాత్రం మహాపాపం ఎందుకవదు?
చచ్చి సాధించేదేమీ లేదు, బ్రతికుండి సాధించాలి అని నాకు తెలుసు. నేను నమ్మి గౌరవించి, ఆచరించే సిద్ధాంతం అదే. కాకపోతే మొదటి పేరాలో ఉన్నది అందరికీ తెలిసిందే. అది చూస్తున్నప్పుడు, రెండో పేరాలో వ్రాసిందంతా ఇదొక ఆధునిక మూఢనమ్మకమా అని ఆలోచన కలిగినందువల్లనే.
ప్రశ్న - ప్రాయోపవేశాలను తప్పుగా చూడనపుడు ఆత్మహత్యలను ఎందుకు చూస్తాము అని.
ఇవి ప్రాయోపవేశాలప్పుడు వర్తించవు అని చెప్పడానికి లేదు. కానీ అవి విమర్శకు కూడా గురైనట్టు లేదు.
గమనిక - వీటిలో నేను యతులు సమాధికావడాన్ని చేర్చడం లేదు. శోక,దుఃఖ,భయాది ఆవేశాలకు లోనై చేసిన ప్రాయోపవేశాల గురించి మాత్రమే చెప్తున్నాను.
సీత అపహరణమైనాక ఒకటి రెండు సార్లు అనుకుంటుంది. హనుమంతుడు అన్వేషణలో విఫలమైనప్పుడు అనుకుంటాడు. దుర్యోధనుడు ఓటమి నిశ్చయమైనప్పుడు అనుకుంటాడు. అంబ అనుకుంటుంది. వేదవతి, సతీదేవి చేస్తారు. భరతుడు కూడా నేమో. రాముడు, లక్ష్మణుడు చేసేది అవతారం చాలించాలని కాబట్టి అది ఉద్వేగంతో కూడినది కాదు. పైవన్నీ ఉద్వేగాలకు లోనై అనుకున్నవే. ఇంకా ఇతర ఉదాహరణలు కూడా ఉండొచ్చు. అదేపనిగా చూడలేదు. చదివినట్టు గుర్తు.
ప్రాయోపవేశాలు లేదా తత్సంబంధమైన ఆలోచనలు రెండూ నా ప్రశ్నలో భాగమే.
వ్యాఖ్యాతలెవరూ సమర్థించలేదు. కాకపోతే వ్యతిరేకత&ఖండన చూపి విమర్శించలేదు అంతేకాక సాధారణ జనంలో వ్యతిరేకత&ఖండన లేదు.
ఖండించాలనడం నా ఉద్దేశ్యం కాదు. అందుకే పేర్లను వద్దని పోస్ట్ లో చెప్పలేదు. తర్వాత చేర్చా. ప్రాణిమాత్రులకు అనేక స్వభావాలుంటాయి. అరుస్తున్న కుక్కను చూసి భయపడేవాళ్ళుంటారు, ఎదుర్కొనే వాళ్ళుంటారు, పట్టించుకోకుండా సాగిపోయేవాళ్ళుంటారు. తమకు దుర్భరమనిపించిన జీవితాన్ని చూసి కూడా ఇలా రకరకాలుగా రియాక్ట్ అయ్యే వాళ్ళుంటారు. నా ఉద్దేశ్యంలో ఆత్మహత్య పిరికితనమే. కాకపోతే పిరికివాళ్ళు కూడా ఉంటారు. మనం ఆపగలిగితే ఆపొచ్చు. లేనప్పుడు హేళన చేయడమో, అరెస్ట్ చేయడమో అనవసరం.
పూర్వులు ఆ పని చేయలేదు. అంటే పురాణాలను వ్యాఖ్యానం చేసినవారు ఖండన, హేళన, శిక్ష ఉండాలనలేదు. చేయలేదు. వ్యక్తిగతమైన అనేక స్వేచ్చాయుత నిర్ణయాలకు, సమాజాన్ని ఎదిరించి నిలిచే ప్రవర్తనకు పూర్వ రచనలలో ఎన్నో ఉదాహరణలు. ఇప్పుడున్నన్ని పిచ్చి కట్టుబాట్లు, భ్రమలు అప్పుడు లేవు. మధ్యలో వచ్చాయేమో. వారే నాగరికులు నన్నడిగితే. ఇప్పుడున్నవారే ఆటవికులు.
సమస్యలను పురాణాల్లో వెదకలేదు. అప్పుడు సమస్యగానే భావించలేదు. మరి ఇప్పుడు ఎందుకిలా జడ్జ్ చేస్తున్నాం అని. నేను కూడా ఆ జడ్జ్ చేసే గుంపులోని దాన్నే.
భరించలేని స్థితిలో ప్రస్తుతం చాలా మటుకు అది నేరంగా చూస్తున్నారు. అందుకే వెనక్కి చూశా.
వేరే మతాల గురించి అవగాహన లేదు కాబట్టి మాట్లాడను.
అంగీకారం పెరుగుతుందో లేదో తెలీదు. మెర్సీ కిల్లింగ్ పక్షం వహించి  కూడా కొన్ని చర్చలూ, కొన్ని కోర్టు కేసులూ ఉన్నాయి.
yes, justifiable in some cases.
అన్నిటికీ ఒకే చూపు, ఒకే తీర్పు కాకుండా పరిస్థితిని బట్టి పోయే మనఃస్థితి అయినా ఉంటే మంచిది.
కానీ ఇది చాలా complicated. ఆ స్థితికి ఫలానా ఇతరులు తీసుకొచ్చారనే వాదనలున్న కేసులూ ఉంటాయి.
యోగుల సజీవసమాధులు, మహాప్రస్థానాలు ఈ ప్రశ్నలో అంటే ఈ సందేహంలో లేవు.
ఆధ్యాత్మికకోణం లేని వైయక్తిక ఉద్వేగాలకు లోనైన ప్రాయోపవేశాలను మాత్రమే ప్రస్తావించాను.
 
నావరకూ నేను చెప్పుకున్న సమాధానమేమంటే -
నాటి రచనల ద్వారా మనకు పరిచయమైన సమాజాల్లో సమాజం వ్యక్తి కన్నా ఎక్కువ ప్రాముఖ్యత గలిగినది. ఇప్పటికీ అలాగే ఉన్నా, ఆలోచనల, అభిప్రాయాల వరకూ వ్యక్తి స్వేచ్ఛ , వ్యక్తి ప్రాముఖ్యత సమాజం కన్నా ఎక్కువ అనే కారణం వల్లనూ,
అప్పటికన్నా ఇప్పుడు పెరిగిన సమాచార సౌలభ్యం, ఆయుధ సౌకర్యం, సమాజం/ఎదుటివ్యక్తులతో కలిసి మెలగగల ఒద్దిక నశించడం వంటి వాటివల్లనూ
ఇప్పుడు ఈ రకమైన ధోరణి మరింత ప్రమాదకారి కాగలదు. కాబట్టి నేటి ఈ పరిస్థితిలో పాపమని, నేరమని వ్యక్తులు అంగీకరించడమే మంచిది.
 
 
  
 
 

21, మే 2022, శనివారం

బొమ్మ

May be an illustration of outdoors

ఇదీ కథ!

 

May be an image of text

30, ఏప్రిల్ 2022, శనివారం

భజే!

రచన - రఘునాథాచార్య
 
౧)  మహానీలమేఘాతిభావ్యం సుహాసమ్ 
శివబ్రహ్మాదిదేవాదిభిఃసంస్తుతం చ
రమామందిరం దేవనందాపదాహమ్
భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్॥
 
౨)
రసం వేద వేదాంతవేద్య దురాపమ్ 
సుగమ్యం తదీయాదిభిర్దానవఘ్నమ్
చలత్కుండలం సోమవంశప్రదీపమ్ 
భజేరాధికావల్లభం కృష్ణచంద్రమ్॥

 

౩)యశోదాదిసంలాలితం పూర్ణకామమ్
దృశోరంజనం ప్రాకృతస్థస్వరూపమ్
దినాంతే సమాయాంతమేకాంతభక్తై 
భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్॥ 
 
౪)కృపాదృష్టి సంపాతసిక్తస్వకుంజమ్   
తదంతస్థితస్వీయసమ్యగ్దశాదమ్ 
పునస్తత్ర తైస్సత్కృతైకాంతలీలమ్
భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్॥
 
౫) గృహే గోపికాభిర్ధృతే చౌర్యకాలే 
తదక్ష్ణోశ్చ నిక్షిప్య దుగ్ధం చలంతమ్
తదా తద్వియోగాది సంపత్తికామమ్
భజే రాధికా వల్లభం కృష్ణచంద్రమ్॥
  
౬)చలత్కౌస్తుభవ్యాప్త వక్షఃప్రదేశమ్
మహావైజయంతీలసత్పాదయుగ్మమ్
సుకస్తూరికాదీప్తఫాలప్రదేశమ్
భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్॥ 
 
౭)గవాందోహనే దృష్టరాధాముఖాబ్జమ్
తదానీం చ తన్మేలనవ్యగ్రచిత్ర 
సముత్పన్నతన్మానసైకాంతభావమ్
భజే రాధికావల్లభం కృష్ణచంద్రమ్॥ 

 

౮)అతః కృష్ణచంద్రాష్టకం ప్రేమయుక్తః 
పఠేత్కృష్ణసాన్నిధ్యమాప్నోతి నిత్యమ్
కలౌ యః స సంసారదుఃఖాతిరిక్తమ్
ప్రయాత్యేవ విష్ణోః పదం నిర్భయం తత్॥

ఇతి రఘునాథాచార్య విరచితం

 

2, ఏప్రిల్ 2022, శనివారం

నిజమే?!

 

వైద్యులే చెప్పాలి..

18, మార్చి 2022, శుక్రవారం

చీకాకు

 ప్రతి డిపార్ట్ మెంట్ కీ ఈ ఫోటోల గోల ఏంటి? టైమ్ కు వస్తున్నారా? కార్యాలయంలో ఉంటున్నారా అని చూడడానికి బోలెడు టెక్నాలజీ వచ్చింది కదా! అవన్నీ అప్డేట్ చేయడానికి డబ్బులు లేవేమో ఖర్మ! ఇలా ఫోటోలు, పేర్ల ఐడెంటిటీతో సహా సబ్మిట్ చేయడం సెక్యూరిటీ త్రెట్ కాదా! రోజు రోజుకీ పాలసీ మేకర్స్ ఆలోచనాస్థాయి మరింత చికాకు కలిగిస్తోంది. వీటివల్ల గొప్పగా ఏదైనా సాధించారా అని చూస్తే సున్నాయే.

#పాపండాక్టర్లు.

1, మార్చి 2022, మంగళవారం

అదీ కథ!

 


28, ఫిబ్రవరి 2022, సోమవారం

కల్లోలము

 కల్లోలమ్ముల మున్గెనే జగతి, దుష్కర్మమ్ము సామాన్యమై,

యుల్లాసమ్ములు మాయమై చెడుకిదే యోకమ్ముగా మారెనే,

పల్లెల్ పట్నములెల్లెడల్ భయములున్ వ్యాపించె విస్తారమై,

యల్లల్లాడెను జీవజంతువులు యే యంతమ్ము ఎట్లుండునో!


--లక్ష్మీదేవి.

శార్దూలము.

11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

ఏమో మరి!

 వైద్యుల (అల్లోపతీయే) దగ్గరకు ఏ జ్వరానికో, కడుపునొప్పి కో ఇలా చిన్నవాటికి దేనికి వెళ్ళినా రక్తం అదే హిమోగ్లోబిన్  తగినంత ఉందా లేదాని కనీసం కళ్ళు, గోళ్ళు, నాలుక పరీక్ష చేసేవారు. అవి కొద్దిగా ఎఱుపురంగులో ఉంటే ఫర్వాలేదు, ఉందని నిర్ధారించేవారు, స్టెతస్కోపుతో గుండెగతి, నాడి అదే పల్స్ పరీక్షించాకే మిగతా వివరాలు వినేవారు. కాలక్రమంలో అన్నీ మానేశారు. రక్తపరీక్షకు పంపడమే. కోవిడ్ లో ఉంటేనే పల్స్, హార్ట్ బీట్ చూడాలనడం ఇప్పుడొచ్చింది. 

ఇవన్నీ ఎందుకు వదిలేశారో! అది అల్లోపతికి కూడా ముఖ్యమే కదా! 


पाणिपादतले रक्ते नेत्रान्तौ च नखास्तथा।

तालु-जिह्वा-अधरोष्ठं च सप्तरक्तः सुखी भवेत्॥

-- महाभाग्यलक्षणानि।

పాణిపాదతలే రక్తే నేత్రాంతౌ చ నఖాస్తథా।

తాలు-జిహ్వా-అధరోష్ఠం చ సప్తరక్తః సుఖీభవేత్॥

--మహాభాగ్యలక్షణాలు.

అని ప్రాచీనోక్తి.


అరచేతులు, అరికాళ్ళు, కంటి చివరలు, గోళ్ళు, దవడ, నాలుక, క్రింది పెదవి ఈ ఏడింట ఎఱుపురంగు ఉన్నవాళ్ళు సుఖపడతారు. ఏడు కాకున్నా మూడు చూసేవారు.


ఆరోగ్యమే కదా మహాభాగ్యం.

1, ఫిబ్రవరి 2022, మంగళవారం

తమములు

 చీకట్లు క్రమముగా అలముకుంటున్న వేళను శ్రీహర్షుడు తన 'రత్నావళి' రూపకంలో ఎంత సహజసుందరంగా వర్ణించాడో , అంతే అందంగా మరిన్ని హంగులు చేర్చి అంత భావాన్నీ సహజసుందరంగా చంపకమాలలో మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి రత్నావళి తెలుగు అనువాదంలో కూర్చిన విధానం చదవడం ఆనందంగా అనిపించింది. 😊😊


తొలి తొలి తూర్పుఁ గొండదెసఁ దోఁచి, క్రమంబుగ నున్న యన్ని ది

క్కుల యెడ నేచి, చెట్టులును గుట్టలు పట్టణముల్ సమస్త భూ

స్థలులను నాఁచి, బిట్టుబలితంబయి యెల్లెడ నెల్లవారి చూ

పుల నరికట్టి వైచెఁ దమముల్ హర కంఠ రుచి ప్రదీప్తముల్.


తొలిగా తూర్పు వైపు మొదలై, క్రమంగా అన్ని దిక్కులకూ పాకి, చెట్లు గుట్టలు, పట్టణాలు మొదలైన భూస్థలాలన్నీ ఆక్రమించి,  అన్నిచోట్లా అందరి చూపులను మందగింపజేస్తూ హరుని కంఠపు నీలాలై చీకట్లు బలీయమౌతున్నాయి.


సులువుగా అర్థమయ్యే సరళమైన తెలుగు. అంత్యానుప్రాస, అనుప్రాస,క్రమాలంకారాలతో స్వభావోక్తిలో చక్కటి ధారతో తమములు ఎల్లెడ వ్యాపించే విధానాన్ని విహంగ వీక్షణం చేయించారు.

ఇందులో ఉన్న మరో విశేషమేమంటే ఇందులో కొన్ని పదాలు మాత్రం మారిస్తే  చీకట్ల వ్యాప్తి బదులు వెలుగుల వ్యాప్తిని వర్ణించవచ్చు.


శ్రీహర్షుని సంస్కృతమూల శ్లోకం. శిఖరిణీ వృత్తం


पुरः पूर्वामेव स्थगयति ततोऽन्यामपि दिशं

क्रमात्क्रामन्नद्रिद्रुमपुरविभागांस्तिरयति।

उपेतः पीनत्वं तदनु भुवनस्येक्षणफलं

तमः संघातोऽयं हरति हरकण्ठद्युतिहरः॥ 


श्रीहर्ष कृत रत्नावली तृतीयोऽङ्कः


పురః పూర్వామేవ స్థగయతి తతోఽన్యామపి దిశం

క్రమాత్క్రామన్నద్రిద్రుమపురవిభాగాంస్తిరయతి।

ఉపేతః పీనత్వం తదను భువనస్యెక్షణఫలం

తమః సంఘాతోఽయం హరతి హరకంఠద్యుతిహరః॥


శ్రీ హర్ష విరచిత రత్నావళీ తృతీయాంకము.


కానీ వీటి కథావస్తువు, కథాగమనం అంతగా ఆకట్టుకోదు. రసాభాస ఎక్కువ.

13, డిసెంబర్ 2021, సోమవారం

పోతన సందేహం

 బాల్యములో పోతన తన తల్లిదండ్రులతో నాటకం గురించి సందేహాలనడుగుతుంటే వాళ్ళు సమాధానం చెప్పడం, అందులోని తాత్వికతను లౌకికముగా కానదగిన విషయసమాచారంతో నిరూపించి చెప్పడం సుప్రసిద్ధ కవి వానమామలై వరదాచార్య విరచిత 'పోతన చరిత్రము' కావ్యములో ఒకానొక (కల్పితమైన ?) చక్కటి సన్నివేశము.

-

వచ్చుచుఁ బోవుచుండె నటవర్గము లోనికదేల యన్నచోఁ 
జచ్చుచుఁ బుట్టుచుండె జనసంఘము భూస్థలినేలయంచు వా
రెచ్చట కేఁగుచుండిరన నెవ్వడు వారికి వేసమిచ్చుచు
న్బుచ్చునొ యట్టి సూత్రధరు పొంతకుఁ బోదురటంచుఁ బల్కినన్.


"వస్తూ పోతూ ఉన్నారేం ఈ నటులు లోపలికి?"

"చస్తూ పుడుతూ జనులు భూమిలో ఉండడం లేదూ అలాగే."

"ఎక్కడికి వెళ్తున్నారలా?" "ఎవడు వారికీ వేషం కట్టి

పంపాడో ఆ సూత్రధారి దగ్గరకే"


ఏఁగిన వీరిఁగాంచి యతఁడేమని పల్కునటన్న వారి వే షాగతులంబొనర్చి యెటులాడుఁడు పాడుఁడటంచుఁ దెల్పెనో
యాగతి యాడిపాడిన నహా! యని వారల మెచ్చు నిచ్చు మే
ల్భోగములట్లు జేయమిని పొండని దండనఁ జేయువాఁడనన్.


" అలా వెళ్ళిన వారిని చూసి అతడేమంటాడు?"

" వారి వేషాలను ఎలా ఆడిపాడమని చెప్పాడో అలా 

చేస్తే ఆహా అని మెచ్చి మరిన్ని మంచి భోగాలనిచ్చి చేయనివారిని

పొండని దండన చేస్తాడు"

-

ఇలా సాగుతుంది.

అందమైన పద్యాలు, చక్కటి ధార, సన్నివేశకల్పన, సహజవర్ణన.

--

పరిచయం చేసిన సన్మిత్రుల పట్ల కృతజ్ఞురాలను.