Loading...
మనసులో ముచ్చట్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మనసులో ముచ్చట్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, నవంబర్ 2017, బుధవారం

ఉత్పలములు

అప్పుడప్పుడూ వ్రాసుకున్న పద్యాలలో కొన్నిఉత్పలమాలలు -

ముగ్గురమ్మలు-

వీణను చేతఁ బూని యలివేణిగ బ్రోచిన వాణి రూపమై
పాణిని శూలమున్నిలిపి భక్తుల గాచిన గౌరి రూపమై
రాణిలు తీరుగా ధనపు రాసుల నిచ్చిన లక్ష్మి రూపమై
రాణిగ నిల్చి, యో జనని , రాజిలు భక్తిని నిల్పు నా మదిన్.

ప్రవచనకర్త -

వేదిక పైన నిల్చి సభ విస్మయమంద వచించు శక్తితో
సాదరభావనన్ పరులు సంతసమందగ నుండు భక్తితో
సోదరులంచు నెల్లరకు సూక్తుల నెప్పుడు నేర్పు యుక్తితో
తా దరి జేరు వారలకు ధర్మపు మూర్తిగ నిల్చె నీతడే.

రైతు -

బీటలు వారెనే పుడమి బీదతనంబున రైతులేడ్వగా
మాటలు కాదు సేద్యమును మానక జేయుట నేటి రోజునన్
నాటిన పైరు వచ్చునని నమ్మకమన్నది లేకపోయెనే
చేటగు కాలమే జనుల చింతల బెంచుచునుండెనే హలా!

కవి-

ఎవ్వరు నేర్పిరో మరుల నిట్టుల నద్భుత రీతులందులన్
మువ్వల సవ్వడో యనగ మ్రోవగ జేయుచు జెల్గెనీతడే!
పువ్వుల తావిలో కలము ముంచుచు వ్రాసెనొ! బొండు మల్లెలన్
రువ్వుచు, నిల్పె నిజ్జగము రోయక నుండగ భావుకత్వమున్.

పెళ్ళిలో ఆశీర్వాదము -
యుక్తవయస్కులందరకు యోరిమిఁ దప్పక మున్నె జోడుగా
భక్తినిఁ బంచయజ్ఞములఁ బాలన జేయుమటంచు, వారలన్
ముక్తినిఁ జేర యోగ్యులను ముందుగ జేయు మహోత్సవమ్మిదే!
వ్యక్తముఁ జేయవచ్చితి, వివాహపు తంతు శుభాశయమ్ములన్.
   -----లక్ష్మీదేవి.                           


3, అక్టోబర్ 2015, శనివారం

చిత్రమైనదీ పత్రము!మొక్కకు పుట్టీ, చెట్టుగ పెంచిన చిత్రమీ పత్రము!

రాలిన వేళల చాచిన చేతుల మిత్రమీ ధాత్రియు!

చక్కటి అందము చెట్టుకు నిచ్చిన రీతినే

నేలకు పంచిన నేర్పును చూడుము మిత్రమా!

30, జనవరి 2015, శుక్రవారం

సైనికబలం

      విశాలమైన భారత సరిహద్దులను సర్వదా, సర్వథా కనిపెట్టి యుండి కాపాడేందుకు ఒకప్పటి భారత ప్రధాని శ్రీ లాల్ బహద్దూర్ శాస్త్రి గారు ఏర్పాటు చేసిన సరిహద్దు భద్రతా దళం సేవల్ని ఎన్ని నోళ్ళ కొనియాడినా చాలదు.
 
       మన సరిహద్దులను సైనికులు భద్రంగా కాపాడడం వల్లనే సరిహద్దుల మధ్యలో ఉన్న భారతంలో ప్రజలందరూ ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. బహిశ్శత్రువులనుంచి వారు కాపాడుతున్నా, అంతశ్శత్రువులైన రకరకాల విప్లవవాదులు, తీవ్రవాదులు, అరాచకవాదుల వల్ల, అరాచకశక్తుల వల్ల జరిగే ప్రమాదములనుంచి మనల్ని మనం కాపాడుకోలేక పోతున్నాం.
       
          మన సరిహద్దులు విభిన్న ప్రకృతులు గలవి.
           
                 ఒక ప్రక్క రాజస్థాన్ ఎడారుల్లో విశాలమైన నిర్జనభూములు, కంచెలు , ఒంటెల మీద ప్రయాణాలు , ఇసుకతుఫాన్ల మధ్యలో విపరీత పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్న కొలది ఆయుధ సామాగ్రి, ఆహార సామాగ్రి తో సర్దుకుంటూ అనుక్షణం అప్రమత్తంగా కాపలా కాస్తూ, మధ్యమధ్యలో ప్రక్క దేశం బాధ్యతా రహితంగా కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ యుద్ధంలేని సమయాల్లో కూడా ప్రాణఘాతకపు పనులకు పాల్పడుతూ ఉంటే కర్తవ్యదీక్ష నేనాడూ కల్లో కూడా మరువకుండా  పనిచేస్తూ ఉంటారు మన సైనికులు.

       ఇంకోప్రక్క ఈశాన్య రాష్ట్రాల్లో చీకటిలో, చిట్టడవుల్లో, చినుకుల నిరంతర రాపిడిలో , మెల్లగా జారిపోయి దూరిపోయే దురాలోచనాపరులైన ఆగంతకులతో తెముల్చుకోడంలో మునిగి తేలుతున్న సైనికులకు అనుక్షణం దోమల స్వైరవిహారంతో ఎడతెగని ఇబ్బందులు. ముఖానికి కూడా దోమతెర వంటిది పూర్తిగా మూయబడినట్టి వస్త్రధారణతో కర్తవ్యదీక్షా పరాయణులై ఆరుగంటల మాపటి  పొద్దుకే అర్థరాత్రి కూడా మనం చూడని చిమ్మ చీకటి, వాహనపు ఫ్లడ్ లైట్ పడినంత మేరా తప్ప చుట్టూ కన్నులు పొడుచుకొని చూసినా కానరాని కారుచీకట్లు. రాత్రీ పగలూ కాపలా కాస్తూ ప్రక్కదేశంలో కలిసిపోయినట్టున్న సరిహద్దు రేఖల పైని గ్రామాల్లో నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తూ ఉంటారు మన సైనికులు.
     ఇంకోప్రక్క వేల కిలోమీటర్ల ఎత్తులో చలికొండల్లో తాగే నీళ్ళు కూడా గడ్డ కట్టుకొని పోయే మంచుప్రదేశాల్లో, బలమైన ప్రక్కదేశం పైకి నవ్వుతూ, కాళ్ళక్రింద గోతులు, సొరంగాలు తవ్వుతూంటే అనుక్షణం మళ్ళీ అప్రమత్తంగా ఉంటూ, ఎటువంటి అలసత్వం లేకుండా అంతర్జాతీయ శాంతి సూత్రాలకూ, స్వంతదేశపు నీతిసూక్తులకూ ఎప్పుడూ ఎటువంటి ద్రోహమూ చేయకుండా, ఉన్నట్టుండి మోసపూరిత శత్రుదేశాల తూటాలకు బలిఅవుతున్న తోటి సైనికులను చూస్తూ కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా నిలిచి కాపాడుతుంటారు మనల్ని మన సైనికులు.
    ఇంకోప్రక్క నీళ్ళల్లో గాలుల్లో కూడా మనపై దాడులు జరగకుండా అనుక్షణం జాగ్రత్త గా దేశాన్ని రక్షిస్తున్నవారి
సేవలూ ఏనాటికీ మనం మరువలేనివి. మరువరానివి. ఏమాత్రమూ మిగతా ఉద్యోగాలతో పోల్చరానివి.
ఆ త్యాగధనులకూ , వారి కుటుంబాలకు ఇవే నా నమోవాకాలు.
       తొంభైశాతం మంది సైనికులు చేసిన సేవలను ఏనాడూ తలచక పోయినా, వారిలో కొద్దిమంది చేసే అఘాయిత్యాలకు బలి అయిన వారి పై సానుభూతి చూపుతూ వీరసైనికులను వేలెత్తి చూపడం సరికాదు. అదీ చేయాల్సిందే ఇదీ చేయాల్సిందే. తప్పునెత్తి చూపేవారు, వారు చేసే సేవలనూ గుర్తించాలన్నది అత్యాశకాదు.
      ప్రభుత్వం కూడా వారి వేతనాలు, కనీస అవసరాలు , చలిలో ఎండలో వారికి కావలసిన ఆత్మరక్షణ పరికరాలు, ఆహారసామాగ్రి , ఆయుధ సామాగ్రి ఏ ఆలస్యం లేకుండా పంపించాలని మనందరం కోరుకోవాలని నా అభిప్రాయం.

24, సెప్టెంబర్ 2014, బుధవారం

మనవిజయం --ఘనవిజయం

               ఈరోజు ప్రపంచంలో ఎవరూ ఇంతవరకూ సాధించని ఘనత సాధించిన మన భారతీయశాస్త్రవేత్తలందరికీ అభినందనలు వేల కోట్లుగా మన వందకోట్లమందీ ఇయ్యాల్సిన రోజు.

           స్వపరిజ్ఞానంతో ఎన్నో ఘనమైన విజయాలు సాధించిన మన శాస్త్రవేత్తల బృందం పదినెల్ల క్రిందట శ్రీహరికోటలో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ కోట్ల మైళ్ళ దూరం ప్రయాణించి  అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. నిరంతరం పర్యవేక్షిస్తూ దిశానిర్దేశం చేసిన మన శాస్త్రవేత్తలు, వారికి జ్ఞానాన్ని పంచిన వారి పెద్దలు, వారి జ్ఞానాన్ని పంచుకోబోయే వారి శిష్యులు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, అభినందనలు.

       మొదటి ప్రయత్నంలోనే సఫల ప్రయోగం జరిపిన భారతదేశం ఇతోధికంగా పొరుగుదేశాలకు తన జ్ఞానసంపదద్వారా లభించిన ఫలాల్ని పంచుకోవాలనుకోవడం దేశ గౌరవ చరిత్రకే గర్వకారణం.

   పొరుగు వారికి తోడ్పడే గుణమే కానీ కయ్యానికి కాలుదువ్వే అలవాటు ఎన్నడూ లేని సత్ప్రవర్తన మన చరిత్రది. మన వర్తమానం కూడా అదే అనుసరించాలంటే యువతరం జ్ఞాన పరిశోధనలో, కార్యసాధనలోనూ, పని నైపుణ్యంలోనూ దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలువగలిగే రోజు తొందర్లోనే రావాలని , వస్తుందని ఆశిస్తూ.....


                  జయ సైన్యం ! జయ వ్యవసాయం ! జయ విజ్ఞానం !

1, డిసెంబర్ 2012, శనివారం

దైవం పేరుతో....

  సృష్టికి మూలమని నమ్మి దైవాన్ని ఆరాధించడం కాకుండా దైవభక్తి కూడా ఒక ఫ్యాషన్ గానో, సక్సెస్ ఫార్ములా గానో పెట్టుకోవడం కొత్త వింతగా తయారయింది. మన చలన చిత్రాల్లో నాయిక/నాయకుడు దైవభక్తులయి (తర్వాత క్రిమినల్స్ కావటం కూడా మర్చిపోరులెండి.)ఉండడం మిగతా వారు దానిని అతిగా భావిస్తూ సరదా పేరిట వ్యాఖ్యలు చేస్తూ ఉండడం మామూలుగా కనిపిస్తున్నాయి.
                      దైవం పేరుతో సెంటిమెంట్ ఉన్నవాళ్ళని, లేని వాళ్ళని కూడా కాష్ చేసుకోవడమే ఉద్దేశ్యంగా ఉన్నట్టుంది.
               ఇక సినిమాలను మించిపోతూ, ఈ మధ్య వ్యాపారప్రకటనల్లో కూడా మంత్రాలను కూడా నోటికొచ్చినట్టు పలుకుతూ, మారుస్తూ వాడేస్తున్నారు. దీనికంతా వ్యాపారదృక్పథం ఉన్నవాళ్ళే కాదు లేని వాళ్ళే ఎక్కువ సహాయం చేస్తున్నారు. వేదమంత్రాలను , అర్చనలను అన్నిటిని గురువు వద్ద శిష్యులు నేర్చుకోవడం ఉండేది. పూజ చేసేటప్పుడు శుద్ధులై మాత్రమే పలికేవారు.

ఏదైనా తప్పు పలికినా క్షమించమని దైవాన్ని అడిగేందుకే ఒక శ్లోకం ఉన్నది.

యదక్షర పదభ్రష్టం మాత్రా హీనం తు యద్భవేత్|
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు తే||


అంత నిష్ఠగా ఉచ్చరించడం పోయి నిర్లక్ష్యం ఎక్కువయింది.

ఇప్పుడన్నింటిని సీడిలు, ఇంటర్నెట్లలో ఉంచడం వల్ల ఎక్కడబడితే అక్కడ ఎప్పుడుబడితే అప్పుడు అన్ని మంత్రాలూ వినిపిస్తాయి. కళ్ళకు ఱెప్పలిచ్చినట్టు చెవులకు కూడా ఏదైనా ఉంటే బాగుండేదనిపిస్తుంది. మనం మాట్లాడే తెలుగే మనకు సరిగ్గా రానప్పుడు మంత్రాలను శ్లోకాలను పాడే దుస్సాహసం చేయడం ఎందుకు? అపస్వరం అంటే కూడా తెలియకుండా, గురువు నేర్పకుండా పాడేస్తుంటే వినలేకపోతున్నాము.

4, డిసెంబర్ 2011, ఆదివారం

కంచి కామాక్షి ఎదుట గోపూజ
                             కంచి కామాక్షి అమ్మవారిని దర్శించేందుకు కంచికి వెళ్ళాం. అక్కడ తెలిసింది ప్రతి ఉదయం ముందు గోపూజ జరిగినతర్వాతే నిత్యపూజలు జరుగుతాయని. ఎంతో సంతోషం కలిగింది. గోపూజ చూడటం కోసం మరు నాడు తెల్లవారుజామున అయిదు  గంటలకల్లా గుడిలో ఉన్నాము. ప్రతిరోజు అయిదు  గంటలకు గోపూజ జరుగుతుందని, కాపలా వాళ్ళు చెప్పటంతో ఆ సమయానికల్లా అక్కడున్నాము.

                                          ఆవరణలో కూర్చుని వేచియున్నాము. మేమే అనుకుంటే సుమారుగా ఒక యాభై మందిదాకా వచ్చారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అంతా ఉన్నారు. నేను లలితా సహస్రనామాలు చదువుకుంటూ కూర్చున్నాను.  పూజారిగారు అప్పుడే వచ్చారు. లోపలికెళ్ళి అమ్మవారి వద్ద దీపం వెలిగించే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక (ఒక పదినిముషాలలో) అందర్నీ పిలిచారు.

                                          కామాక్షీదేవి గర్భాలయం ముందు ఉన్న ప్రదేశంలో క్యూ కోసం పెట్టిన ఇనుప రాడ్లను తొలగించి ఉంచారు. అక్కడే ఎదురుగా ఉన్న ఎత్తైన మండపంలో మేమంతా నించుని చూస్తూఉన్నాము. గోమాత, దూడతో సహా గోపాలకుడు వచ్చాడు.

                                              సరిగ్గా గర్భాలయం ఎదురుగా, అమ్మవారి ఎదురుగా గోమాత పృష్ఠభాగం ఉండేలా నించోబెట్టారు. పూజారిగారు గోమాత తోకకు , ప్రక్కలకు, ముఖానికి పసుపు , గంధం రాసి కుంకుమ అలంకరించారు. పువ్వులు జల్లారు.

                             అమ్మవారికి, గోమాతకు హారతి ఇచ్చారు. అరటి పళ్ళు గోపాలకునికి ఇవ్వగా అతను గోమాతకు తినిపించాడు. క్రితం రోజే మేము అరటి పళ్ళు కొని సిద్ధం గా ఉంచుకున్నాము. మా చేతిలో నుంచి కూడా పూజారిగారు పళ్ళు అందుకొని గోపాలకునికి ఇచ్చారు. మా జన్మ ధన్యమైనట్టుగా మేము భావించి సంతోషించాము.

                                         ఇంతవరకూ ఇంత వివరంగా గోపూజ, అదీ గుళ్ళో, అదీ క్షేత్రంలో చూడలేదు. మా గృహప్రవేశానికి గోపూజ చేశాం కానీ, అప్పుడు హడావిడిలో ఏం చేశామో, ఎలా చేశామో తెలీదు. కానీ ఇప్పుడు గురువుగారి ప్రవచనాల్లో గోమాత ప్రాముఖ్యత, ప్రశస్తి తెలిశాక గోపూజ తిలకించటం మహదానందంగా ఉన్నది.

                                 గోపూజ జరుగుతున్నప్పుడు దూడకు ఒక గిన్నెలో ఏదో పెట్టారు. అది తింటూ ఉన్నది. ఈ పూజ ముగించి పూజారి గారు గోమాతకు ప్రణిపాతం(సాష్టాంగ నమస్కారం) చేశారు. తర్వాత గోపాలకుడు గోమాతను, దూడను తీసికెళ్ళి పోయాడు.

                   తర్వాత అమ్మవారి అభిషేకం కన్నులపండుగగా జరిగింది. అలా ఎదురుగా నుంచుని అభిషేకం చూస్తూ, లలితాష్టోత్తరం చదువుకోవటం నా మహద్భాగ్యం.

27, నవంబర్ 2011, ఆదివారం

భూమమ్మ

భూమమ్మ
కంప చెట్లు =ముళ్ళ చెట్లు కంచె గా కూడా వీటిని వాడతారు.

రాళ్ళ కొండలు మా ఉరి వైపు ఇవే ఉంటాయి.


కొందరు మిత్రులు పచ్చటి చెట్లతో ఉన్న కొండలనే చూసి ఉంటారు. మా రాళ్ళ కొండలనూ చూడండి.

వర్షం లేక ముఖం వేలాడేసిన పంట 

కొన్ని చోట్ల పచ్చగా కూడా ఉందండోయ్!

చిన్న నదిఉన్నది రెండు రోజులే అయినా బాగుండింది. పక్క ఉరికి దైవదర్శనానికి వెళ్ళినపుడు నదిలో కార్తీక స్నానము, రైల్లో వెళ్తున్నపుడు రామకృష్ణ సంఘం వాళ్ళతో కలిసి భజన చేయటం, ప్రతీ సారికన్నా ఎక్కువ బంధువులను కలవడం అన్నీ సంతోషాన్నిచ్చాయి.

27, సెప్టెంబర్ 2011, మంగళవారం

శరన్నవరాత్రులు

           దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు ఏ పేరుతో పిలిచినా దేవీ పార్వతి ని కొలిచే శుభదినాలివి. అమ్మవారు పార్వతీ, సరస్వతీ, లక్ష్మీ రూపాలతో మనలను అనుగ్రహించమని వేడినవారికి వేడని వారికి అందరికీ శుభాలను ప్రసాదించి, ధైర్యాన్ని, తద్వారా విజయాన్ని, జ్ఞానాన్ని తద్వారా ముక్తిని, సంపత్తును తద్వారా పరోపకారం చేయగల శక్తిని ప్రసాదిస్తూ ఉండే కరుణాస్వరూపమైన అమ్మవారిని స్మరిద్దాం.

         ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకూ అమ్మవారిని వివిధ ఆలయాల్లో వివిధరూపాలుగా అలంకరింపచేసి, మనకు దర్శన భాగ్యం కలిగిస్తారు గుళ్ళో అర్చకులు. వారికి ముందుగా అభివందనాలు.

            భీకరస్వరూపస్వభావాలు గలిగిన రాక్షసులను వివిధ రకాలుగా అంతమొందించిన అమ్మవారి మహిషాసుర మర్దినీ రూపం, ఆ స్తోత్రం అందరినీ ప్రభావితం చేస్తాయి.

              కనకదుర్గ, కాళీ, మహిషాసుర మర్దిని రూపాల్లో దేవిని పూజించటం చాలా చోట్ల కనిపించినా కొన్ని చోట్ల విజయదశమి సందర్భంగా పిల్లలకు మొదటిసారి పాఠశాలా ప్రవేశం చేయించటం మంచిదని విజయదశమి రోజు చేస్తుంటారు.

         చదువుకుంటున్న పిల్లలకు శలవులు అయిపోయి విజయదశమి రోజు తప్పని సరిగా చదవాలని బళ్ళు తెరవటం కూడా జరుగుతుంటుంది.

            మరికొన్ని చోట్ల శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం చేసుకోవటానికి అనుకూలం కాకపోతే కూడా నవరాత్రుల్లో ఒక రోజు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు.

            ఏరూపంలో కొలిచినా సృష్టికి మూలకారకమయిన శక్తి స్వరూపం ఒక్కటేనని మనందరికీ తెలుసు.
చిట్టిగౌను వేసినా, పట్టులంగా ,రవిక వేసినా, పైట వేసినా, చీరకట్టినా కన్నకూతురి మీద ఒకే ప్రేమే ఎలాగో అలాగన్నమాట.

            ఆ దేవి సకల జనులకూ శాంతి సౌభాగ్యాలను కల్గించాలని కోరుతూ ఈ వేళ తల్లిని ప్రార్థిద్దాం.

5, సెప్టెంబర్ 2011, సోమవారం

నేర్చుకోవాల్సి ఉంది.

                               అక్షరానికి ప్రపంచాన్ని జయించే శక్తి ఉంటుందా? అక్షరం - క్షరం కానిది, నేర్చుకున్నాక ఎప్పటికీ పోనిది అక్షరం- అలాంటి అక్షరాన్ని తొలిసారి పరిచయం చేసేది గురువు. నా విషయంలో మా అమ్మ బడికి చేర్చకముందే నాకు అక్షరాలు నేర్పిన తొలి గురువు.

                         ఆ మాటకొస్తే అక్షరాలే కాదు, ఏ విషయాన్నైనా, పనినయినా, గుణమయినా ఏదైనా నేర్పే వారంతా మనకు గురువులే. అలా చూస్తే ఎంతమంది గురువులో మనకు ఉంటారనేది సత్యము. ప్రపంచంలో మనకు ఎదురుపడే ప్రతి ఒక్కరి వల్లా మనం ఎంతో కొంత నేర్చుకుంటాం. మననించీ ఎంతో మంది ఎన్నో విషయాలు నేర్చుకుంటాం.


ఎన్ని నేర్చుకున్నా కొన్ని విలువైనవి ఉంటాయి.
అవి మనమంతా తప్పకుండా నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి.

  • పసిపాప ల నుంచి ఏ కల్మషమూ లేని అందమైన నవ్వులు.
  • అతి చిన్న జీవితమైనా, కాళ్ళక్రిందో , రాళ్ళక్రిందో పడి నలగి పోయే మరణమైనా సువాసనలు వెదజల్లుతూ, ఎవరి మనసునైనా ఉల్లాసంగా మార్చే రంగురంగుల పువ్వులు
  • స్వేచ్ఛ అంటే ఏమిటో అనుక్షణం నిరూపిస్తూ కూడా బాధ్యత తెలిసి పిల్లలను పెంచి, వాళ్ళు తమను చూడలేదని నిందించే అలవాటు ఆశ కూడా లేని రివ్వున ఎగిరే గువ్వలు
  • ఎన్ని అడ్డంకులెదురైనా, అడ్డుకట్టలు కట్టినా చివరంటా అలుగకుండా,ఆగకుండా ప్రవహించే నదీలలామలు.
  • బడబాగ్నులను దాచుకున్నా అతి ప్రశాంతంగా,        ప్రపంచాన్ని ముంచేసేంత జలమున్నా గంభీరంగా ఉన్నచోటనే ఉండే సముద్రుడు.                                                                                                                                                                                                                                                    వీళ్ళతో మనం నేర్చుకోవాల్సి ఉంది. ఈ గుణాలు ఉంటే జీవితం ఎంతో శోభిస్తుంది. చుట్టూ ఉన్న ఎవరికీ ఏ కష్టం కలిగించకుండా అందరూ ప్రేమనే పంచుకోగలరు.

21, జనవరి 2011, శుక్రవారం

మరచిపోవట్లేదూ!

ఆఁ .... మనం కాపాడ్డమేమిటి, మనం వదిలేస్తేనే పోతుందా ఏమిటి తెలుగు? ఇవన్నీ పిచ్చి మాటలు అనేవాళ్ళని చూస్తూ ఉంటాం. నేను చిన్నతనం లో మాత్రం తెలుగు చదివాను. అంటే నేనుచెప్పేది తెలుగు పాఠాలు చదువుకున్నది. పెద్ద తరగతులకొచ్చేసరికి తెలుగు ఉండటం లేదు. ఆంధ్రప్రదేశం లో ఉన్నవాళ్ళకే అదీనూ. లేకపోతే అదీ ఉండదు. ఇప్పటి చిన్న పిల్లలకు ఇంట్లో తెలుగు మాట్లాడే వారే ఉండరు. వాళ్ళల్లో వాళ్ళు తెలుగు మాట్లాడినా, పిల్లలతో మాత్రం ఆంగ్లమే . ఇంకా ఫ్రెంచ్, జర్మన్ మొదలైనవి అన్ని స్థాయిల్లోనూ లభ్యంగా ఉంటాయి.

తెలుగునిలా వదిలేయటం వల్ల మన సభ్యమైన అలవాట్లను కొన్నింటిని మనం వదిలేస్తున్నాం. ముఖ్యంగా ఆడవాళ్లని, చిన్న పాపలని సైతం అమ్మా అని సంబోధించి మాట్లాడటం ఉండేది. ఇప్పుడు ఎవరినీ ఎవరూ అమ్మా అనటం లేదు. అమ్మా అనిపించుకోవటానికి మా ఆడవాళ్ళలోనే చాలామందికి ఇష్టం ఉండదు. అసలు పేరు చివర చేర్చి అమ్మ అనేవారు. అంటే కమలమ్మ, విమలమ్మ లాగా. ఎంత హుందాగా ఉంటుంది.

ప్చ్....ఏంటో, అక్కా, ఆంటీ అనాలి. పనివాళ్ళు గానీ, పాలవాళ్ళుగానీ . ఇక సహోద్యోగులు, బయట అద్దెకారు వాళ్ళు ఎవరైనా సరే మేడమ్ అనాలి. అమ్మా అని అలవాటు చేయటంలో ఒక చిన్న విషయం ఉంది. మన భారతీయ సంస్కృతి లో భార్యని తప్ప మిగతా వాళ్ళనంతా అమ్మలుగా చూడాలి. ఇది ఒక రకంగా మనసులో స్థిరపడుతుంది. అందరూ అలా ఉంటారా అని అడక్కండి. కొందరైనా తమని తాము మంచిమార్గంలో మలచుకోవటానికి ఉపయోగపడుతుందిది. ప్రతి విషయానికి ఒక మితి అనేది ఉంటుంది. చపలచిత్తాన్ని దారిలో పెట్టుకుంటే వారికే మంచిది.

పెద్దబాలశిక్షలో ఎన్ని విషయాలుంటాయి. మనం ఎలా నడుచుకోవాలో తెలిపేవవి. మంచివన్నీ వదిలేశాం. మేం చదువుకున్నపుడే లేదు. నేను ఓ నాలుగేళ్ళ క్రితం కొని చదివి ఆశ్చర్యపోయాను. ఇంత విజ్ఞానాన్ని, క్రమశిక్షణనీ ఇచ్చే పుస్తకాన్నా వదిలేశారు? అని. మన పెద్దవాళ్ళు రాసిన గ్రంథాల్లో ఎన్నో విషయాలు సంఘ జీవనానికి మనిషి అలవర్చుకోవటానికి కావలసినవన్నీ ఉంటాయి. అన్నీ వదిలేశాం. కాలం పాడైపోయింది అనుకోవటానికి ఎవరు కారణం? మనం కదూ!
ఎన్ని భాషలు నేర్చుకున్నా మన భాష వదిలేయటం చాలా తప్పు. మా వాడికి తెలుగు బాగా వచ్చు. దేనికి ? మాట్లాడటానికి. అంతే. చదవటం వచ్చు. (నేనే నేర్పించాను.) కానీ ఇష్టపడి చదవటం ఎలా నేర్పించను? ఎలా? ఎలా?

కొన్ని పుస్తకాలైనా చదివితే కదా ఇష్టం పుట్టేది. ఎంతో నచ్చజెప్తే కానీ ఉత్తరం చదివేంత ఇష్టం కూడా రాదు. ఇంకేం చెప్పను? చదివే అలవాటు లేదా అంటే ఉంది.( ఆంగ్లంలో) .చలనచిత్రాలు మనవి చూస్తే ఏమిటి,ఆంగ్లం వి చూస్తే ఏమిటి? అన్నీ ఒకే రకం. కళాశాలలంటే చూపించేది అల్లరి, అధ్యాపకులని అవమానించటం. ప్రేమంటే త్యాగం లేదా మోసం. అదీ అమ్మాయి-అబ్బాయి. మిగతా సంబంధాలన్నీ అక్కర్లేదన్నట్టు చూపించటం. బాధ్యతలు అనేమాటే ఎక్కడా ఉండదు. చ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక బాధ్యతలేవీ ఉండవు. ఇక ధారావాహికల గురించి ఏమీ తలచుకోకుండా ఉంటే మంచిది.

ఏ పోటీ కార్యక్రమాల్లో కానీ సభాసంగతం కాని విషయాలు లేకుండా ఉండవు. మంచి విషయాలు అనేవి ఎక్కడ నుంచి నేర్చుకోవాలి ? నిజమైన నాగరికులం ఎప్పుడు అవుతాము? మన తెలుగుని వదిలేయకుండా ఉండాలి. మన పుస్తకాలని, మన మాటలని, మన సామెతలని, మన చదువునీ మనం వదిలేయకుండా ఉండాలి. అదే దీనికి పరిష్కా రం. దీన్ని ఎలా అమలు పరచాలని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.
వేరే ఏదైనా ప్రత్యామ్నాయం ఉందేమో మీరూ చెప్పండి.


మనమే కాదు, మన భాషలన్నిటికీ ఈ సమస్య ఉంది. తమిళ, కన్నడ వాళ్ళ బాధ కూడా ఇదే. కాకపోతే ఒక మణిపురి అమ్మాయి నాతో పాటు ఇవ్వాళ జనబండి లో (బస్సు) వచ్చింది. ముఖం చూస్తేనే ఈశాన్య భారతం అని తెలిసిపోతుంది కదా!

మణిపురి అని, ఉద్యోగరీత్యా వచ్చానని చెప్పింది. (హిందీ లో మాట్లాడుకున్నాము). ఆ అమ్మాయికి హిందీ సరిగ్గా అర్థం కాలేదు. (నా హిందీ నేమో!) సరే పోనీ సరదాగా మణిపురిలో మాట్లాడడాన్ని ఏమంటారు అని అడిగాను. వొహయ్ బా అంది.


మణిపురిలో పుస్తకాలు చదువుతారా అని అడిగాను. చదవనంది. కవిత్వం ఉంటుందే అన్నాను. ఉంటుంది.అంది. రచయిత పేరేదైనా చెప్పమన్నా. ఊహూఁ... పోనీ మణిపురిలో నృత్యాన్ని ఏమంటారుఅంటే తెలీలేదు కాబోలు చాలాసేపు ఆలోచించింది. చివరకి తెలీదు అనేసింది. నేను వదల్లేదు. అమ్మనేమంటారు అన్నా. పూమాయి అంది. హమ్మయ్య .
ఏదో ఒకటి చెప్పింది కదా , సంతోషం. చివరికి దిగేటపుడు దయచేసి మణిపురి ని మరవొద్దు. అన్నా. అర్థమయ్యిందో లేదో కానీ, వెళ్ళొస్తా నని తలాడించి వెళ్ళిపోయింది.

11, సెప్టెంబర్ 2009, శుక్రవారం

సర్వ ప్రాణి సమభావం

కొంతమంది చిలుకలను, కుందేళ్ళను, కుక్కలను పెంచుతుంటారు. అంతెందుకు, పంట, పాడి కోసం ఇంట్లో పశువులను పెంచే వేల కుటుంబాల్లో మాదీ ఒకటిగా ఉండింది.

వాటిలాగే సాలీళ్ళు, బొద్దింకలు, ఎలుకలు, బల్లులు, అందులు, పురుగులు, పాములు అవీ ప్రాణులేగా! కానీవాటిని చూస్తే భయం, ఓ విధమైన ఏవగింపు అనే భావం నుంచి తప్పించుకోలేకపోతున్నాను. సర్వధర్మ సమభావం లాగే సర్వప్రాణి కోటి పట్ల సమభావం పెంచుకోవాలనేది చాలా ఉన్నతమైన ఆలోచన. ఎన్నో మంచి పుస్తకాల్లో వాటి గురించి చదువుతుంటాము. కానీ ఆచరణలో పెట్టటానికి కష్టపడే నా లాంటి వాళ్ళెంతమందో!

మా అబ్బాయికి కూడా వాడితరం వాళ్ళందరి లాగే స్పైడర్ మాన్, హారీ పోటర్ అంటే ఎంతో ఇష్టం. వాడికి ఆ పుస్తకాలు, సీడిలు నేనే వెదికి కొని బహుమతిగా ఇస్తాను. కానీ నేను చదవలేను, చూడలేను.

ప్రపంచంలో అన్నీ అందమైన సీతాకోకచిలుకలు, పూలు,చెట్లూ మాత్రమే ఉండవు. అవి వున్నట్లే ఇవీ ఉంటాయి. అలా అయిష్టం చూపకూడదని అన్నాడు వాడు. చెంప ఛెళ్ళుమన్నట్టయింది. ఎన్నోసందర్భాల్లో ఎన్నో మంచివిషయాలు నేను ఆచరిస్తూ వాడికి నేర్పాను. కానీ ఈ విషయంలో ఇంత గొప్ప విషయంలో వాడు నాకు నేర్పగలుగుతున్నాడు. కానీ నేను నేర్చుకోగలనా? ఎప్పటికయినా?

మన పెద్దలు, గురువులు, మునులు , దేవుడు కూడా చెప్పిన సత్యమది. ఎంతో సాధారణంగా చెప్పేశాడు.
మరి నేనెందుకిలా ఉన్నాను?

౧. భగవంతుడు కూడా దుష్ట సంహారం చేయవలసి వచ్చినపుడు, తెలిసి తప్పు చేసే మూర్ఖులకు గుణపాఠం చెప్పాల్సినపుడు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అనే అవతారాల్లో జంతు రూపానికి ప్రాధాన్యత నిచ్చాడు.

౨. కంచిలో బంగారు బల్లిని స్పర్శిస్తే గానీ కంచి యాత్ర పూర్తి గాదు.

౩. రాజస్థాన్ లోని ఒక దేవాలయంలో ఎలుకలకి ఉన్న ప్రాముఖ్యత గురించి విన్నాను.

౪.ఇక క్రమం తప్పకుండా నాగుల చవితి చేసి వెండి పాము కు పాలు పోసి పూజిస్తాము. (ఊళ్ళో ఉన్నప్పుడు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి వచ్చేవాళ్ళము.)

ఇక ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళు ఈవిల్ పవర్స్ ని ఎదుర్కోవడానికి సాలీడు, కోడిపుంజు (స్పైడర్ మాన్, మల్లన్న) రూపాల్తో హీరోలు వచ్చినట్టు కథలు రాసి ప్రజాదరణ పొందుతున్నారు.

మరి నేనెందుకిలా ఉన్నాను?

మనుషుల్లో నచ్చినవారిని, నచ్చనివారిని ఒకేరకంగా చూడాలనే భావాలు అలవర్చుకోగలిగినపుడు సర్వప్రాణిసమభావం మాత్రం రావటం లేదేం?

ప్రతి ఒక్క ప్రాణీ పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేవే అని తెలుసు.
మనిషే ప్రతి ప్ర్రాణి వల్ల ఏదోవిధంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రయోజనం పొందుతున్నాడు అని తెలుసు.
మనిషి వల్ల పర్యావరణానికి గానీ ఏ ఇతర ప్రాణికి గానీ కష్టం, నష్టం తప్ప ఉపయోగం లేదనీ తెలుసు.
మనం వాటికేమీ చెయ్యక్ఖర్లేదు. కనీసం ఈ అయిష్టం మాత్రం పోగొట్టుకుంటే చాలు.

అన్ని ప్రాణుల్లోనూ ఉండేది ఆత్మ. ఆత్మకు ఎటువంటి వివక్ష లేదంటారు. అన్ని ప్రాణుల్లోనూ మనలో ఉండే ఆత్మ ఉంటుందంటారు. మనుషులే కాకుండా మిగిలిన జంతువులు, పక్షులు, క్రిమికీటకాదులు అన్నింటినీ ఒకేరకంగా చూడగలగడం నిజంగా గొప్ప విషయం.

3, జూన్ 2009, బుధవారం

భగవద్గీత

భగవద్గీత ప్రపంచంలోని అన్ని వ్యక్తిత్వ వికాస గ్రంధాల్లోకీ గొప్పదని నాకూ అనిపిస్తుంది. ఈ విషయం యండమూరి గారు చెప్పగా విన్నట్లు గుర్తు. మా చిన్నప్పుడు మా తాతగారు ఇంటి బయట అరుగు మీద కూర్చుని ప్రతిరోజూ శ్రావ్యంగా గీతా గానం చేసేవారు. వెళ్తూ వస్తూ వుంటున్నప్పుడు అందులోని శబ్ద సౌందర్యం నన్ను ఎంతో ఆకర్షించేది.

సర్వాలంకార శోభితమైనట్టి నవ వధువు/వరుడిని చూసినప్పుడు కలిగే నేత్రానందం, ఈ సంస్కృత సబ్ద సౌందర్యంలో ఉందనీ, అది చక్కగా గీతలో కర్ణానందం చేస్తుందని ఒప్పుకోని వాళ్ళెవరు చెప్పండి?

నేను ఆరవ తరగతి చదివేప్పుడనుకుంటా మా వూళ్ళో విశ్వహిందూ పరిషద్ వాళ్ళు భగవద్గీతా పఠనం పోటీలు పెట్టారు 18 శ్లోకాల్ని ఎన్నిక చేసి ఇచ్చారు. అందులో నేను మొదటి బహుమతి గెల్చుకున్నాను. అంగ్ల-తెలుగు చిన్న నిఘంటువు నొకదాన్ని నాకు బహుమతిగా ఇచ్చారు. అది ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది.

తర్వాత వాళ్ళు మరిన్ని శ్లోకాల్ని ఎన్నిక చేసిచ్చి మళ్ళీ వచ్చి పోటీ పెడతామన్నారు కానీ రానేలేదు. కాకపోతే అందుకు నేను మా తాతగారి దగ్గర నేర్చుకున్న ఒక శ్లోకం నాకెంతగానో నచ్చి ఇప్ప్పటికీ గుర్తుండిపోయింది. తలుచుకున్నప్పుడు నేనేం చేస్తున్నా మొత్తం శ్లోకం అలా పెదాలమీద దొర్లిపోతుంది.

మత్కర్మకృన్మత్పరమో మద్భక్త స్సంగవర్జిత:
నిర్వైర స్సర్వభూతేషు యస్సమా మేతి పాండవ!

తాత్పర్యం ఇలా ఉంది.
ఓ అర్జునా! ఎవడు కేవలం నా కొరకే సకల కర్తవ్య కర్మల జేయుచున్నాడో, మత్పరాయణుడో, ఆసక్తిరహితుడో సకల ప్రాణులయందు వైర భావము లేక యుండునో, అట్టి అనన్య భక్తులైన వారు నన్నే పొందుచున్నారు.

ఈ శ్లోకము భగద్గీత లోని 11 వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగములోని చివరిది.
ఇలాంటి శ్లోకాల్ని వినిపించటానికో వీటి గొప్పదనం తెలపటానికో ఇప్పటి తాతయ్యలకు అవకాశము లేదు. ఎందుకంటారా? కొంతమంది వృద్ధాశ్రమాల్లో వదలి వేయబడి వుంటారు. మరికొందరికి స్వయంగా ఆసక్తి ఉండక ఏ టి వి సీరియల్స్ చూడ్డమో, సినిమాలు చూడ్డమో చేస్తుంటారు.

ఇంకొంతమందికి ఇయర్ ఫోన్లు, సెల్ ఫోన్లు చెవులకు తగిలించుకుని ఏమాత్రం పలకరించినా కసురుకునే పిల్లల్ని చూస్తే భయం.

ఫలితాన్ని ఆశించకుండా పనిలో పూర్తి సామర్థ్యాన్ని చూపించమని సలహా ఇచ్చే,
పోరాటం అంటూ దిగాక తన పర భేదం వద్దని బోధించే,
మొదలెట్టిన ఏ పనినైనా ముగించకుండా వదలొద్దనే ,
ఇంకా ఎన్నెన్నో చెప్పే గీత కన్నా ఎక్కువగా వ్యక్తిత్వ వికాస గ్రంధాలు కానీ, కోచింగ్ సెంటర్లు గానీ ఏం చెపుతారబ్బా?

22, జనవరి 2009, గురువారం

వ్రతమూ-మనమూ

మససులో మాట సుజాత గారు రాసిన వ్రతము గురించి టపా చదివాక వ్యాఖ్య రాయబోతే అదే పెద్ద టపా అయింది. అందుకే నా బ్లాగులోనే రాస్తున్నాను.

చాలామంది వ్రతాల అనుభవాలు ఇలాగే ఉంటున్నప్పుడు మనం కొత్తగా ఒక ప్రయోగం చేద్దామనిపిస్తుంది. ఏంటంటే పూజ అంతా అయ్యాక కథలు మనం తలా ఒక కథ చెప్తే ఏం? ఎలాగు అన్ని కథలు మనకు తెలిసినవే కదా! పిల్లలకు తెలిస్తే వాళ్లు చెపితే ఇంకా బాగుంటుంది కదా!

మనమూ వ్యావహారిక భాషలో చెప్పడం వల్ల అందరికి చక్కగా అర్థం కూడా అవుతుంది. ఏమంటారు? ఎందుకంటే రుద్రాభిషేకాలు, మిగిలిన పూజల కన్నా ఈ సత్యనారాయణ వ్రతం ఎంతో సులభంగా చేసుకోగలిగేది. ఎంతో గొప్పదైన ఈ వ్రతము చేసుకున్నప్పుడు మనస్సు కూడా ఎంతో ప్రశాంతంగా అవుతుంది. ఇలాంటి గోప్పవ్రతమును ఇలాంటి చిన్న కారణాలవల్ల మనమూ ఆసక్తి ని కోల్పోకూడదని నా ప్రయత్నం.

ఒకవేళ పిల్లలు కథ పూర్తి గా చెప్పలేని పక్షంలో కథ మనం చెబుతూ వాళ్ళని చిన్న చిన్న ప్రశ్నలు వేయవచ్చును.
లేదా కథలో పాత్రల పేర్లు అడుగుతూ కథని కొంచెం ఆసక్తి కరంగా చేయవచ్చును. ఎప్పుడైనా అందరు కలిసి చేసినప్పుడే ఎ పనైనా విసుగు రాకుండా ఉంటుంది.

ఇంకో విషయం ఏమిటంటే మనముఎవరింటికైనా వెళితే వాళ్లు ఆహారపానీయాలు అందించి సంతోషిస్తారు. మనము వద్దంటే ఎంతో బాధ పడతారు. మనము కూడా వాళ్ళను బాధపెట్టకూడదని కొంచెం ఆలస్యమవుతుందని తెలిసినా వేచివుండి వారి ఆతిథ్యము తీసుకుని మరీ వస్తాము.( బహుశా ఈ పరిస్థితి ఏదో ఒకరోజు అందరికి ఎదురయ్యే ). అలాగే

మనము దేవుని ముంగిటిలో కెళ్ళి ప్రసాదం ఆలస్యమవుతుందనుకుంటే ఎట్లా?
ఏదో నాకు తోచింది రాశాను తప్పులుంటే విజ్ఞులు దిద్దగలరని ఆశిస్తాను.

4, జనవరి 2009, ఆదివారం

మొదటి టపా గురించి

మా ఇంటి దైవం మాళవీమల్లేశ్వరులు అందుకేమాళవీ స్తుతి ఇంటిభాష కన్నడలోరాసింది అలాగేటపాగాజత చేశాను.కన్నడలో దేవుని పాటలు మాత్రమే ప్రయత్నిస్తుంటాను. తెలుగులో అన్నీ రాసేస్తుంటాను(సొంత డబ్బా) హి..హి..హి.. చదివే వాళ్ళ ఖర్మ ఏమో కానీ రాసినప్పుడు నాకు కలిగే తృప్తి ఉంది చూశారూ, అది సాటి లేనిది. త్వరలో నా పెన్సిల్ స్కెచెస్ కూడా అతికించబొతున్నాను. కాచుకోండి!!