Loading...
పండుగ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పండుగ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, ఏప్రిల్ 2016, శుక్రవారం

సద్వ్యాపారముల్ నేర్పుమా!

క్క పుత్రకామేష్టిని యోగమబ్బె,
రెండు చేతుల ప్రాప్తించె దండి ఫలము.
మువ్వురు సతులకొసగగ మురిపెముగను,
ల్వురదొ సుతులు జనించినారు కనుఁడు.


పంచచామరము

కులీనుడైన రాజు నిండుకుండ తీరు మానుచున్, 
లే భళీ యటంచు ముద్దు పాపలన్ ముదమ్మునన్
విలాసరీతి నుయ్యెలన్ వివేక గీతి పాడి వా
లెల్లరన్ పరుండజేయు రాజసమ్ము చూడుమా!Jaya Sri Rama!

శార్దూలవిక్రీడితము
వీరాగ్రేసర! ధాత్రికన్యకతమున్ వేవేల క్రూరాత్ములన్, 
ధీరోదాత్తతతోడఁ గూల్చితి, భళా! దేవా! భువిన్ క్రూరతన్
స్వైమ్మాడెడు ధూర్తమానవులకున్ ద్భావముల్, కూర్మితో
వైమ్మెల్ల హరింపజేయగల సద్వ్యాపారముల్ నేర్పుమా!

6, మార్చి 2016, ఆదివారం

శివ! శివ!
!

శివ! శివ! నీదు పాదములఁ జేరుదు నీదు కటాక్షమున్నచో, 
భవమును దాటిపోనగును పాపము, పుణ్యము, చావుపుట్టుకల్, 
రవ పరిమాణమేని మిగులంగల జాలవు దేవరా! హరా! 
కవనము వ్రాసి నిన్నుఁ గన కౌశలమైన నొసంగనెంచుమా!24, సెప్టెంబర్ 2014, బుధవారం

మనవిజయం --ఘనవిజయం

               ఈరోజు ప్రపంచంలో ఎవరూ ఇంతవరకూ సాధించని ఘనత సాధించిన మన భారతీయశాస్త్రవేత్తలందరికీ అభినందనలు వేల కోట్లుగా మన వందకోట్లమందీ ఇయ్యాల్సిన రోజు.

           స్వపరిజ్ఞానంతో ఎన్నో ఘనమైన విజయాలు సాధించిన మన శాస్త్రవేత్తల బృందం పదినెల్ల క్రిందట శ్రీహరికోటలో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ కోట్ల మైళ్ళ దూరం ప్రయాణించి  అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. నిరంతరం పర్యవేక్షిస్తూ దిశానిర్దేశం చేసిన మన శాస్త్రవేత్తలు, వారికి జ్ఞానాన్ని పంచిన వారి పెద్దలు, వారి జ్ఞానాన్ని పంచుకోబోయే వారి శిష్యులు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, అభినందనలు.

       మొదటి ప్రయత్నంలోనే సఫల ప్రయోగం జరిపిన భారతదేశం ఇతోధికంగా పొరుగుదేశాలకు తన జ్ఞానసంపదద్వారా లభించిన ఫలాల్ని పంచుకోవాలనుకోవడం దేశ గౌరవ చరిత్రకే గర్వకారణం.

   పొరుగు వారికి తోడ్పడే గుణమే కానీ కయ్యానికి కాలుదువ్వే అలవాటు ఎన్నడూ లేని సత్ప్రవర్తన మన చరిత్రది. మన వర్తమానం కూడా అదే అనుసరించాలంటే యువతరం జ్ఞాన పరిశోధనలో, కార్యసాధనలోనూ, పని నైపుణ్యంలోనూ దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలువగలిగే రోజు తొందర్లోనే రావాలని , వస్తుందని ఆశిస్తూ.....


                  జయ సైన్యం ! జయ వ్యవసాయం ! జయ విజ్ఞానం !

29, జూన్ 2014, ఆదివారం

నీలమాధవా!


లోకాధిదైవతం దేవేశపూజితం జగన్నాథ నాయకం సదాఽహం స్మరామి!

ఈ వేళ పురుషోత్తమపురమైనటువంటి పూరీ పట్టణమునందు విరాజితమైన శ్రీ జగన్నాథుని రథయాత్రా మహోత్సవం ప్రారంభమైనది.

జగన్నాథుని నీలమాధవుడని కూడా పిలుస్తారు. గర్భగుడిలో ప్రధాన విగ్రహాలు దారు శిల్పాలు. అంటే చెక్కవిగ్రహాలు. ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి కొత్త చెక్కతో విగ్రహాలు తయారు చేస్తారు. అప్పటివరకూ ఉన్న పాత విగ్రహాలలో నుంచి ఒక దివ్యపదార్థం తీసి కొత్త విగ్రహాలలో పెట్టి తయారు చేస్తారు. అలా అది కొన్ని వందల ఏళ్ళ నుంచి వస్తూ ఉన్న ఆచారం. మతదురహంకారులైన కొందరు సుల్తానులు పాలించేటప్పుడు అన్ని గుళ్ళను ధ్వంసం చేసినట్లుగానే పురాతనమైన ఈ గుడి మీదా దండయాత్ర చేసేందుకు వచ్చారని, అప్పుడు అసలు విగ్రహాలు కొన్నేళ్ళపాటు ఎక్కడో దాచేసి, అదే రూపంతో వేరే విగ్రహాలు అప్పగించగా, వాటిని ఆ మూర్ఖులు బహిరంగంగా వ్రేలాడదీసి భస్మము చేసి సముద్రంలో పడవేశారని చెపుతారు.

జగన్నాథుని గుడి చాలా విశాలమైన పెద్ద గుడి. అంతేకాదు రథయాత్ర ప్రపంచంలోనే పెద్దరథయాత్ర అని చెప్తారు. లక్షలమంది పాల్గొంటారు. సాధారణంగా హిందువులని మాత్రమే దర్శనానికి అనుమతించినా, సర్వులకూ దర్శనం ప్రసాదించటానికి స్వామి గుడి బయటకు వస్తారు. మానవాళికే కాక తాను సృజించిన విశ్వం లోని ప్రతి జీవికీ దర్శనభాగ్యం కలిగించి మోక్షాన్ని ప్రసాదించే అవకాశం ఇవ్వటానికే స్వామి రథయాత్ర అని చెపుతారు. జగత్తుకే నాథుడు కదా మరి.

ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ నాడు ప్రారంభమయ్యే ఈ రథయాత్ర కు అవసరమైన రథాలను అంటే ౩ రథాలను (చక్రాలను, ఇరుసులను కూడా)వరసగా జగన్నాథునికి, బలభద్రునికి, సుభద్రకు ప్రతి సారి కొత్తగా తయారు చేస్తారు. రథయాత్ర పూర్తయ్యాక ఆ చెక్కను విక్రయిస్తారు. కొన్న జనాలు వాటిని తమ ఇంటికి సింహద్వారాలుగా బిగించుకొని శుభం జరుగుతుందని సంతోషంగా ఉంటారు.

పూరీ సముద్రతీరం చాలా అందమైనది. శుభ్రంగా ఉంటుంది కూడా. ప్రపంచవ్యాప్తం గా ఎంతోమంది పూరీని దైవదర్శనం కోసం, పురసందర్శనం కోసం కూడా వస్తారు.
(ఇది పాత పోస్టే.)

13, జనవరి 2014, సోమవారం

కనకాంబ గారికి ప్రణతులు.

కాంచనపల్లి కనకాంబ గారు రచించిన "అమృతసారము" లో కొన్ని అమూల్యమైన సంగతులను సులభమైన రీతిలో తేలికైన మాటలలో వివరించినారు. భక్తి తత్త్వమును తెలిసినప్పటికీ నిత్యజీవితములో పాటించుటకు మానవులు పడుపాట్లను

దుష్టకర్మంబు క్రిందికిఁ ద్రోయుచుండ
భక్తి నెగఁబ్రాఁకుచుండి అన్న చిన్న పోలికతో చమత్కారంగా చెప్తారు.

తనువు మఱచి తిరుగుత్రాగుఁబోతునకును
దెలివి గలిగి మెలఁగు దీనునకును
గలుగు భేదమరయఁగలవెట్లొ నిత్యంబు
ముక్తవరునకు భవరక్తునకటు

నని చెప్పి భవబంధములలో చిక్కినవానికి ముక్తి దక్కిన వానికి గల భేదములను సునాయాసంగా వివరించినారు.ఒరులకన్నన్ నేనే మతిమంతుఁడనని మతిహీనుడు భావించునని, పరుల దోషమరయుఁ పాపాత్ముడు- తన పాపముల గణించు పుణ్యుడని,భోజన శయనాదులలో క్రమము విడువని జీవుడు శ్రీరాముని భజించుటలో అలసత్వము చూపునని, సరియైన తరుణములో లక్ష్యపెట్టక మరణంబున నేడ్చునని విలువైన హెచ్చరికలను చేస్తున్నారు.
మరి మనకది సాధ్యమా అని అడుగువారికి సమాధానంగా

కాంచునంతమేరఁ గాలు సాగించిన
దోఁచుచుండు నవలఁ ద్రోవవదియ
ఉన్నచోటనుండి యూహించుచుండినఁ
గోరుదానినెవఁడు చేరఁగలడు
అని భుజంతట్టి ధైర్యం చెపుతారు.

ఇంకా కొన్ని నచ్చిన పద్యాలు
యశమునకో! లోకము దమ
వశముం బొనరించుకొనెడు వాంఛనొ పాపో
పశమనమునకో! కాకీ
పశువుల కుపకార బుద్ధి ప్రభవించునొకో!

పరులబోధ జేయు పనికి బూనెడి వాడు
అనుభవంబు లేని యధముడందు
రదియు గల్గు కొలది యంతర్ముఖుండౌ

తనదుఃఖము పరదుఃఖము
గని యసహనమున విబుధుడు కను సత్పధమున్
తన లేమి పరుల కలిమియు
గనియసహనమున కుకవిగను నాస్తికతన్ ( ఆలోచనల్లో పాజిటివ్, నెగెటివ్ ఎట్ల వస్తాయో చూడండి)

అందరికీ అన్నీ వివరించి చెప్పగలమా, అవతలి వారికీ ఆ పరిణతి రావాలన్నదీ తెలుసుకోవాల. చూడండి-
పెండ్లి యేమిటన్న పిల్లకు బ్రీతిగా
బల్కు బల్కనగునె ప్రసవబాధ
యెప్పుడెంతవఱకుఁ జెప్పగానొప్పునో
తప్పకంతవఱకుఁ జెప్పవలయు

చతురులూ విసిరినారు చూడండి
సుద్దులు సెప్పఁగ వినఁగాఁ
బద్దెములల్లంగ మోహపాశము విడునా?
యద్ధిర! గురుసన్నిధిలో
దిద్దుకొనంజెల్లుఁగాక దీనార్తిహరా!

రూపభేదములెంచక సర్వకారకమైన ఆ పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ
పరమార్థంబది జీవకోటికొసగన్ వాగ్దేవియై ప్రీతియై
హరియై శంకరుడై, గణేశ్వరుడునై యాదిత్యుడై యంబయై
పరుడై దేశికుడె పరాత్పరుడునై ప్రత్యేకరూపంబులన్
ధరియింపంగల నీదు శక్తి దలతున్ ధర్మార్థకామంబులన్
బరినర్జించిన భక్తపాళికి గదాప్రాప్తించు దద్యోగమో
కరుణాసాగర రామచంద్ర నృపతీ కైవల్యదాత్రకృతీ!

పండిత పామర స్త్రీపురుషవయో భేదములేక అందరూ పాశ్చాత్యవిద్య విజ్ఞాన తత్త్వాదులే గొప్పవని భ్రాంతి లో పడిన ఈ శతాబ్దిలోని ముప్పయ్యవ దశకంలో భారతీయాత్మతత్త్వమును దర్శించి ప్రదర్శించిన కనకాంబ గారికి ప్రణతులు.

10, ఏప్రిల్ 2013, బుధవారం

కోయిల్లారా! మంగళం పలుకరే!

కొమ్మంచులపై పాడే కోయిల్లారా!
కొంచెము మీరలు మంగళం పలుకరే!

కుంచెల నిండుగ ధాన్యము పంచగ
వంచనలేని మంచిని పెంచగ
అంచుల పంచెలు, చీరలు పెంచగ

కొమ్మంచులపై పాడే కోయిల్లారా!
కొంచెము మీరలు మంగళం పలుకరే!

చంచలమౌమనసును వంచగ
మించక పెద్దల, బోధల నెంచుచు
సంచిత పాపపు కర్మల త్రుంచగ

కొమ్మంచులపై పాడే కోయిల్లారా!
కొంచెము మీరలు మంగళం పలుకరే!

పంచన చేరిన దీనుల ముంచుచు
సంచులు నింపెడు బుద్ధులు తెంచగ
నెంచి మరింక పలుకరే మేలెంచి...

కొమ్మంచులపై పాడే కోయిల్లారా!
కొంచెము మీరలు మంగళం పలుకరే!

14, జనవరి 2013, సోమవారం

కనిపించు దైవమా! కరములు జోడించి........

సందెపొద్దుల్లో పసుపు ఎఱుపు రంగులు కలబోసిన ముద్దబంతి సూరీడు
జగతిని నిశిలో విడిచి పోతున్నా,
అరుణ కిరణాల ఎఱ్ఱంచు తెల్లటి వస్త్రాల్లో ముస్తాబై తొలిసంజె వెలుగులతో
ధరణిని అభిషేకిస్తూ వచ్చేస్తాడు కదా!
పండక్కి వచ్చిన కొత్త బావగారిని తొంగి చూసే మరదళ్ళై కొత్త మొక్కలు
ప్రభాకరుని ప్రభాతసమయంలో చూసేందుకు అలవోకగా వంగి చూస్తుంటాయికదా!
జీవరాశిని బ్రతికించేది, పోషించేదే కాక కొండొకచో జన్మలకు కూడా కారణ భూతుడై, ప్రత్యక్షనారాయణుడై
అలరారే దినకరుని తలచుకునే ప్రత్యేక మైన రోజులే సంక్రాంతి, రథసప్తమి.
శ్రీరాముని యుద్ధంలో విజయం కలగాలంటే ఆదిత్యుని పూజించమని అగస్త్యమహాముని యుద్ధరంగంలో ఆదిత్యహృదయం ఉపదేశిస్తాడు. రాముడు ఋషి ఆజ్ఞ పాటిస్తాడు.
కళ్ళెత్తి సూటిగా చూడగా రాని అద్భుత తేజోమయుడై, పరమాత్మ దర్శనము తనకన్నా కోటిరెట్లు ఎక్కువని జాగ్రత్తని చెపుతున్నట్లుగా భాస్కరుడు వెలుగుతుంటాడు.
మనకు ఇక్కడ వీడ్కోలు ఇచ్చినా, విశ్వంలో నిరంతరాయంగా వెలుగుతూ, ధాత్రిలో ఎక్కడో ఇంకోమూల జీవరాశికి బ్రతుకునిస్తూ ఉంటాడు.
చంద్రునికి, అనేక రత్నమాణిక్యాలకు తన ప్రభలను పంచుతూ, కమలముల వంటి అనేక పువ్వులకు జీవమిస్తూ ఎన్నటికీ తరిగిపోని కాంతుల రేడు.
తనచుట్టూ తిరిగే అన్ని గ్రహాలకు, ఉపగ్రహాలకు అధిపుడై, రారాజై పరిపాలిస్తూ ఉంటాడు.
శాశ్వతత్వానికి ప్రతీకగా సూర్యచంద్రులున్నంత వరకూ అని ఉదహరించురీతిగా గగనవిభుడై ఉంటాడు.
జలచక్రాన్ని నిరంతరాయంగా చలింపజేస్తూ ధాత్రిని అనేక ఔషధాలకు, ఆహారపుపంటలకు జనయిత్రిగా నిలిపేవాడీతడు.
అటువంటి సూర్యునికి శతకోటి ప్రణామములు.


కనిపించు దైవమా! కరములు జోడించి  వందనముల జేతు పాహియనుచు.
జగముల బాలించు సామర్థ్యమున్న నీ నామంబు తలతునే నన్ను గనుము.
వేల యుగంబుల వేడి తగ్గక నుండు  పేర్మియు నీదయ్య , పెరుగు నెపుడు.
నిను నమ్ము వారికి నిను గొల్చువారికి  కలుగు కష్టములెల్ల తొలుగ గలవు.


నీవు లేని భువిని నిమ్మళముగ నుండ
సాధ్యమగునె, మాకు జలజ మిత్ర.!
దేవదేవ నీవు దీవనంబొసగుచు
మమ్ము గాచినయెడ మాకు సుఖము.

12, జనవరి 2013, శనివారం

మిత్రులారా!


19, ఫిబ్రవరి 2012, ఆదివారం

పదాలతో సదాశివుని పదార్చనదేవరా! నను గావుమయ్య సతీమనోహర!శంకరా!
దీవనల్ గొన కాచియుంటిమి తృప్తిమాకది నిచ్చు, మా
భావనా జగమంత నిండిన వాడివై కనిపించరా!
నీవె నాకిక దిక్కు,నేరమునెంచకో పరమేశ్వరా!        (మత్తకోకిల)


నటనలొప్పెడి నాట్యశాస్త్రమునందునొజ్జవు నీశ్వరా!
జటలధారివి సుందరమ్మున సాటిగా మరి లేరురా!
భటులపై కరుణారసమ్ము నపారసంద్రము పోలురా!
జటిలమైన భవాబ్ధి పారణ సాగ నీదయ నిమ్మురా!         (తరలము)


మహేశ్వరుండవై, శుభమ్ముమాకు చేయబూనుమా!
సహాయమున్ దయాళువై ప్రసాదమిమ్ము,కోరితిన్
మహానుభావులెందరో హిమాంశుధారునెప్పుడున్
మహామహుండుగా నివాళి మానకుండజేతురే!          (పంచచామరము)


గౌరీనాథుని మనమున
నారాధింపగ నవిద్య నజ్ఞానములున్
చేరక నిర్మలమగునట,
ఆరాటమ్ములు తొలగునటంచును చెపుమా!               (కందము)


నినుగని పొంగిపోవగ ననేకములైన మనోవికారముల్
ననువిడిపోవు నిక్కముగ, నాకములన్నియు నన్నుచేరునే!
మనమిక వెండికొండయగు, మాటయె మంత్రము కాకయుండునా
వినుమొక మాఱు నాదు మొఱ, వేడితి నీకడ నాదిదేవరా!                        


 (చంపకమాల)


ఇంటికి నీవె దైవమయి యెప్పుడు బ్రోచుచు నుండువానివే!
కంటికి రెప్పవై మముల కాచెడు జంగమవీవు దేవరా!
మంటను కంటిలో గలిగి మన్మథ మాయను గెల్చువానిగా
బంటుల తోడునీడవయి భక్తిని పెంచుము రక్తి వీడగన్.                                


 (ఉత్పలమాల)


మాయామర్మమెఱుంగమయ్యనభవా! మమ్మేల రావేలనో
కాయమ్మందున లావు తగ్గెనిక నాకై జాలి చూపించవో! 
న్యాయమ్మీ భువి లేదులేదు, నరులన్యాయంబునే నమ్మిరే!
చేయూతమ్మిడి,భక్తిభావములనే చిత్తమ్ములో నింపుమా!                        


 (శార్దూలము)


నరుడా పొద్దున కొట్టబోయినను బాణాలిచ్చి దీవించవే! (దీవించలేదా అని భావము)
కరువా ముద్దకు నన్నపూర్ణ మగడా! గైకొంటి యెంగిళ్ళనున్,
వరముల్ కోరుచు నిన్ను వేడగనె పాపాలెంచబోవందురే!
గురువే నీవని నమ్మియుంటినిను; నే కోరంగ లేదందువా! (లేదనవు అని భావము)  


 (మత్తేభము)

(ఆష్టమూర్తితత్వమైన ఆదిదేవునికి అష్టపదార్చన.


చివరి ఐదు శ ష స హ(నిషిద్ధాక్షరిలో) లేకుండా శివపూజ
శంకరాభరణం బ్లాగులో నా సమాధానాలు.)

---లక్ష్మీదేవి


18, జనవరి 2012, బుధవారం

సూర్యుని వర్ణన _ రంగుల జానపదం(వీడియో లంకె)

సూర్య దేవుని అనునిత్యం స్మరించి కృతజ్ఞతలు చెప్పుకోవటంఅదీ సూర్యస్తుతికి ఉత్కృష్టమైన ఈ ఉత్తరాయణ ఆరంభంలో.... సర్వ జీవరాశి కి ప్రథమ కర్తవ్యము. సూర్య దేవుని తెల్లని కిరణములో నుంచి అన్ని రంగులు ఉద్భవించినాయంటారు. అలాంటి సూర్యుడు ఆకాశంలో పొద్దున్నుంచీ సాయంత్రం వరకు ఎన్ని రంగులు చూపిస్తాడో , ఎన్నెన్ని పువ్వులతో వర్ణించారో ఈ పాటలో చూడండి. ఇన్ని రంగుల పూలు ఈ లోకంలో పూస్తున్నాయంటే కారణం ఆ పొద్దు పొడుపు వాడే కదూ!
శ్రీ సాయి పదము వారు పంపించిన మెయిల్ లో వచ్చింది. వారికి , పాడిన లక్ష్మి గారికి ధన్యవాదాలు.

"ఉదయ భానునితో మేలుకొలుపు గా ప్రారంభమైన వర్ణన అస్తమాన బాలునివరకూ  -
ఒక్కొక్క స్థితి లో స్వామి వర్ణాన్ని చెప్పడానికి వాడిన ఉపమానాలు
అద్భుతం.   మాఘ మాసమంతా ఆ సూర్యదేవుని స్తుతి స్తోత్ర మాలికలో  ఇది కూడ
పఠించి సర్వ శుభాలు పొందెదరు  గాక." ఈ జానపదానికి వీడియో క్రింది లింకులో
చూడండి.
http://www.youtube.com/watch?v=4hWpHpwHU3U

శ్రీ సూర్యనారాయణ స్వామి - మేలుకొలుపు పాట

శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ || 2 ||

పొడుస్తూ భానుడూ పొన్న పువ్వు ఛాయ
పొన్నపువ్వు మీద పొగడపువ్వు ఛాయ ||శ్రీ సూర్య ||

ఉదయిస్తూ భానుడు ఉల్లిపువ్వు ఛాయ
ఉల్లిపువ్వుమీద ఉగ్రంపు పొడిఛాయ ||శ్రీ సూర్య ||

గడియెక్కి భానుడు కంబపువ్వు ఛాయ
కంబపువ్వు మీద కాకారీ పూఛాయ||శ్రీ సూర్య||

జామెక్కి భానుడు జాజిపువ్వు ఛాయ
జాజిపువ్వుమీద సంపంగీ పూఛాయ||శ్రీ సూర్య||

మధ్యాహ్న భానుడు మల్లెపువ్వు ఛాయ
మల్లెపువ్వుమీద మంకెన్న పూఛాయ||శ్రీ సూర్య||

మూడుఝాముల భానుడు ములగపువ్వు ఛాయ
ములగపువ్వుమీద ముత్యంపు పొడిఛాయ||శ్రీ సూర్య||

అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయ
ఆవపువ్వుమీద అద్దంపు పొడిఛాయ||శ్రీ సూర్య||

వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయ
వంగపువ్వుమీద వజ్రంపు పొడిఛాయ||శ్రీ సూర్య||

గుంకుతూ భానుడు గుమ్మడిపూఛాయ
గుమ్మడిపువ్వుమీద కుంకంపు పొడిఛాయ||శ్రీ సూర్య||
27, అక్టోబర్ 2011, గురువారం

కార్తీకం
                                                                    ఈరోజు కార్తీక శుద్ధ పాడ్యమి. ఈ రోజు తో కార్తీక మాసం మొదలవుతుంది. ఈశ్వర, నారాయణ రూపాల్లో ఏ రూపాన్ని ఆరాధించే వారయినా ఈ మాసం మరింత భక్తి శ్రద్ధలతో నామ జపం చేసుకునే ఆచారం ఉంది. కార్తీక మాసంలో ప్రతిరోజూ సంధ్యాసమయంలో ఇంటి ముందు మట్టి ప్రమిదలతో కడుప్మాను (గడప) ముందు రెండువైపులా రెండు దీపాలు పెట్టే ఆచారము ఉంది.

                                                                       దీపావళి అమావాస్యకు ముందు రోజు నరకచతుర్దశిరోజు తో మొదలుపెట్టి, నరకచతుర్దశి, దీపావళి రోజుల్లో వరుసగా అనేక దీపాలు పెట్టినా తర్వాత రెండు దీపాలు మాత్రం పెడుతూ వస్తాం నెలంతా. ఈ నెల దీపదానం , కంబళీదానం ప్రశస్తమైనది అని చెపుతారు. త్వరగా చీకటి పడే రోజులు కాబట్టి దీపాల అవసరం, చలి మొదలయ్యే రోజులు కాబట్టి కంబళీ అవసరం గుర్తించిన పెద్ద వారు ఆ రోజుల్లో  ఏర్పరచిన ఆచారాలివి
                                         
                                              నిరంతరం అందరి గురించీ ఆలోచించి పరస్పర సహాయ సహకారాలతో సమాజం జీవించాలని మన పూర్వీకులు ఇలాంటి నియమాలను పెట్టారు. కార్తీక మాసంలో చన్నీళ్ళ స్నానమే చెయ్యాలంటారు. అదెందుకో తెలీదు కానీ, రోజూ చన్నీళ్ళ స్నానాలు చేస్తున్నా కార్తీకం వచ్చేసరికి నీళ్ళు మరీ చల్లబడి వేణ్ణీళ్ళు కావాలనిపించటం వింతగా ఉంటుంది.

                   
                                                                                ఇక కార్తీక మాసం లో శుద్ధద్వాదశినాడు క్షీరాబ్ధి/చిలుకద్వాదశి అని సర్వరోగనివారిణి, సకలశుభదాయిని అయిన తులసి మాత పూజ జరుపటం విశేషం. తలంటి నీళ్ళు పోసుకొని వంట చేసి తులసికి నైవేద్యం చేయటం, సాయంకాలం నలుగురిని పిలిచి తాంబూలాలు ఇచ్చుకోవటం ముఖ్యం. నా చిన్నతనం లో తెల్లవారేసరికి తులసి దగ్గర అమ్మ వెలిగించే దీపం (నూటఎనిమిదేమో మరి) నాకింకా కళ్ళలోనే ఉంది. మా ఇంట్లో నాలుగడుగల ఎత్తు బృందావనం హుందాగా నిలబడి ఉండేది. అందులో తులశమ్మ, ముందుభాగములో ఇద్దరు కూర్చునేంత  అరుగు లా ఉండేది. సాయంకాలం అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకోవటం, మా చిన్న చిన్నాన్న మూడో కూతురికి ళ శ్రద్ధగా పలికించటం మనసులో అప్పుడప్పుడూ మెదలుతూ ఉంటాయి.

5, సెప్టెంబర్ 2011, సోమవారం

నేర్చుకోవాల్సి ఉంది.

                               అక్షరానికి ప్రపంచాన్ని జయించే శక్తి ఉంటుందా? అక్షరం - క్షరం కానిది, నేర్చుకున్నాక ఎప్పటికీ పోనిది అక్షరం- అలాంటి అక్షరాన్ని తొలిసారి పరిచయం చేసేది గురువు. నా విషయంలో మా అమ్మ బడికి చేర్చకముందే నాకు అక్షరాలు నేర్పిన తొలి గురువు.

                         ఆ మాటకొస్తే అక్షరాలే కాదు, ఏ విషయాన్నైనా, పనినయినా, గుణమయినా ఏదైనా నేర్పే వారంతా మనకు గురువులే. అలా చూస్తే ఎంతమంది గురువులో మనకు ఉంటారనేది సత్యము. ప్రపంచంలో మనకు ఎదురుపడే ప్రతి ఒక్కరి వల్లా మనం ఎంతో కొంత నేర్చుకుంటాం. మననించీ ఎంతో మంది ఎన్నో విషయాలు నేర్చుకుంటాం.


ఎన్ని నేర్చుకున్నా కొన్ని విలువైనవి ఉంటాయి.
అవి మనమంతా తప్పకుండా నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి.

  • పసిపాప ల నుంచి ఏ కల్మషమూ లేని అందమైన నవ్వులు.
  • అతి చిన్న జీవితమైనా, కాళ్ళక్రిందో , రాళ్ళక్రిందో పడి నలగి పోయే మరణమైనా సువాసనలు వెదజల్లుతూ, ఎవరి మనసునైనా ఉల్లాసంగా మార్చే రంగురంగుల పువ్వులు
  • స్వేచ్ఛ అంటే ఏమిటో అనుక్షణం నిరూపిస్తూ కూడా బాధ్యత తెలిసి పిల్లలను పెంచి, వాళ్ళు తమను చూడలేదని నిందించే అలవాటు ఆశ కూడా లేని రివ్వున ఎగిరే గువ్వలు
  • ఎన్ని అడ్డంకులెదురైనా, అడ్డుకట్టలు కట్టినా చివరంటా అలుగకుండా,ఆగకుండా ప్రవహించే నదీలలామలు.
  • బడబాగ్నులను దాచుకున్నా అతి ప్రశాంతంగా,        ప్రపంచాన్ని ముంచేసేంత జలమున్నా గంభీరంగా ఉన్నచోటనే ఉండే సముద్రుడు.                                                                                                                                                                                                                                                    వీళ్ళతో మనం నేర్చుకోవాల్సి ఉంది. ఈ గుణాలు ఉంటే జీవితం ఎంతో శోభిస్తుంది. చుట్టూ ఉన్న ఎవరికీ ఏ కష్టం కలిగించకుండా అందరూ ప్రేమనే పంచుకోగలరు.

29, ఆగస్టు 2011, సోమవారం

మా తెలుగు తల్లికి మల్లె పూదండ !


మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక

నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!
--------శంకరంబాడి సుందరాచారి.

తెలుగువారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు !

13, ఆగస్టు 2011, శనివారం

జో శహీద్ హువే హై ఉన్ కీ జరా యాద్ కరో కుర్బానీ(కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.)తెలుగులో , హిందీ లో చదవండి. వినడానికి ఇక్కడ నొక్కండి.
తెలుగు భావం చదవండి

 యె మేరే వతన్ కే లోగోం!
తుమ్ ఖూబ్ లగా లో నారా
యే శుభ్ దిన్ హై హమ్ సబ్ కా
లహరా లో తిరంగా ప్యారా
పర్ మత్ భూలో సీమా పర్
వీరోంనె హై ప్రాణ్ గంవాయె
 కుఛ్ యాద్ ఉన్హే భీ కర్ లో - 2
జో లౌట్ కె ఘర్ నా ఆయె-2

 యె మేరే వతన్ కే లోగోం!
జరా ఆంఖ్ మే భర్ లో పానీ
జో  శహీద్ హువే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ

జబ్ ఘాయల్ హువా హిమాలయ్
ఖత్ రే మే పడీ ఆజాదీ
జబ్ తక్ థీ సాంస్ లడే వో
ఫిర్ అప్ నీ లాశ్ బిఛాదీ
సంగీన్ పే ధర్ కర్ మాథా
సో గయే అమర్ బలిదానీ
 జో శహీద్ హుయే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ

జబ్ దేశ్ మే థీ దివాలీ
వో ఖేల్ రహే థే హోలీ
 జబ్ హమ్ బైఠే థే ఘరోం మే
వో ఝేల్ రహే థే గోలీ
 థే ధన్య జవాన్ వో అప్ నే
 థీ ధన్య వో ఉన్ కీ జవానీ
జో శహీద్ హుయే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ

కోయీ సిఖ్ కోయీ జాఠ్ మరాఠా
కోయీ గురఖా కోయీ మదరాసీ
సరహద్ పె మర్ నేవాలా
హర్ వీర్ థా భారత్ వాసీ
జో ఖూన్ గిరా పర్వత్ పర్
వో ఖూన్ థా హిందూస్థానీ
జో శహీద్ హుయే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ

థీ ఖోన్ సె లథ్ పథ్ కాయా
ఫిర్ భీ బందూక్ ఉఠాకే
దస్ దస్ కో ఏక్ నే మారా
ఫిర్ గిర్ గయే హోష్ గంవా కే
జబ్ అంత్ సమయ్ ఆయా తో
కహ్ గయే కి అబ్ మర్ తే హై
ఖుష్ రహ్ నా దేశ్ కే ప్యారోం
అబ్ హమ్ తో సఫర్ కర్ తే  హై
క్యా లోగ్ థే వో దీవానే
క్యా లోగ్ థే వో అభిమానీ
జో శహీద్ హుయే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ

తుమ్ భూల్ న జావో ఉన్ కో
ఇస్ లియే కహీ యే కహానీ
జో శహీద్ హుయే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ
జయ హింద్ జయహింద్ కీ సేనా
జయ హింద్ జయ హింద్ జయ హింద్!!!

భావం ---------

నా దేశ ప్రజలారా!
నినదించండి, ఈవేళ  మనందరికీ శుభదినం. మువ్వన్నె ల జెండా ఎగరేయండి
కానీ హద్దుల్ని కాపాడుతూ ప్రాణాలను బలి ఇచ్చిన వీరులను కూడా స్మరించండి. వారిక ఎప్పటికీ ఇంటికి తిరిగి రాలేదని మరువకండి.

నా దేశ ప్రజలారా!
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.
హిమాలయాలు గాయపడినపుడు, మన వాళ్ళ స్వేచ్ఛకు ఆటంకం కలిగినపుడు ఊపిరున్నంతవరకూ పోరాడారు వాళ్ళు. ఆ తరువాత తాము శవాలయ్యారు. తమ శిరస్సుమీద తుపాకీ మొన గురి పెట్టబడి ఉందని తెలిసి పోరాడి అమరులయ్యారు.
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.

నా దేశ ప్రజలారా!
దేశమంతా దివాలీ జరుపుకుంటుంటే వారు రక్తపు హోలీ ఆడారు.
మనమంతా దేశం లోపల భద్రంగా ఉంటే వాళ్ళు తుపాకీ గుండ్లతో ఆడారు.
మన సేనలు,వారి సమర్థత ధన్యం చెందాయి.
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.
సిఖ్ఖులు, జాట్ లు, మరాఠీలు, గుర్ఖాలు, మదరాసీలు, సరిహద్దుల్లో ప్రాణాలు వదిలినవారంతా ఎవరైతేనేం---భారతీయులు. ఆ కొండల మీద చిందిన రక్తం భారతీయులది.
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.
దేహం మొత్తం  తుపాకీ గుండ్లతో రక్తసిక్తమైనా సరే తుపాకీలు గురి పెట్టి ఒక్కొక్కరు పది మంది  శత్రువులనైనా చంపే అసువులు బాశారు.
మేం లోకం వదిలేస్తున్నాం, నా ప్రియమైన దేశవాసులారా! సంతోషంగా జీవించండి అని చెప్పి మనకు వీడ్కోలిచ్చారు.
ఎంత ఆత్మాభిమానం, ఎంత పట్టుదల !!!
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.
వారిని మనం మరవకూడదనే ఈ కథ!
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.
జయ జయ హిందూదేశం! జయ జయ హిందూ దేశం!!!
5, ఆగస్టు 2011, శుక్రవారం

నాగుల చవితి


శ్రావణమాసం శుద్ధ చవితి మేము నాగుల చవితి గా జరుపుకుంటాము. కొన్ని ప్రాంతాల్లో కార్తీకమాసంలో జరుపుకుంటారని తెలుసు.
నాగుల చవితికి మిగతా పండుగల్లాగా సున్నాలవీ పూయకూడదు.
ఇళ్ళల్లో కానీ, పొలాల్లో కానీ కన్నాలు ఉంటే పూడ్చకూడదు.
ఇల్లు తుడిచాక ముగ్గుపిండి తో ముగ్గు పెట్టకూడదు. సుద్దముక్కలు/చాక్ పీసులతో పెట్టాలి.
మొత్తానికి నాగులకు, ఏ కీటకానికీ ఏ హాని, పొరబాటుగానైనా, కనీసం ఆ వేళనైనా జరగకూడదు.
ఇదీ సంప్రదాయం. అన్ని గుమ్మాలకీ/తలుపులకీ ఆస్తీక అని వ్రాయాలి.
ఆస్తీకుడు ఎవరంటే--------------
అర్జునుని కొడుకు అభిమన్యుడు
అభిమన్యుడు యుద్ధంలో వీరమరణం పొందినప్పుడు అతని భార్య ఉత్తర గర్భవతి
అభిమన్యుని కొడుకు పరీక్షిత్తు
పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు
అనాలోచితం గా చేసిన పాప ఫలితంగా, శాపఫలితంగా పరీక్షిత్తు పాము వలన మరణిస్తాడు
తండ్రి మరణానికి ఖేదం చెందిన జనమేజయుడు పాముజాతిని అంతటినీ మట్టుపెట్టే ఒక గొప్ప సర్పయాగాన్ని నిర్వహిస్తాడు.
యాగ మధ్యలో సర్పజాతిని రక్షించటానికి (వాతావరణ చక్రభ్రమణానికి అన్ని ప్రాణుల అవసరమూ ఉంది) వస్తాడు
తన మాటలచాతుర్యంతో జనమేజయున్ని ఒప్పించి సర్పయాగం ఆపి జగత్కల్యాణకారకుడౌతాడు ఆస్తీకుడు
అందుకే నాగులచవితి నాడు ప్రతి వాకిలి దగ్గరా ఆస్తీక అని రాసి సర్పజాతిని కాపాడినవాడిని అభినందనాపూర్వకంగా తలచుకొనడం జరుగుతుంది.

ఇక ఆనాడు అందరూ తలస్నానం చేసి నాగదేవతకు పాలు పోస్తారు. పల్లెల్లో అయితే పొలాల్లో పుట్టలు ఉంటాయి.అక్కడికే వెళ్ళి పాలు పోస్తారు. పూజలు చేస్తారు. ఆ అవకాశం లేకపోతే ఇంట్లో చిన్న విగ్రహం పెట్టుకుని, పాలు పోసి, పూజచేసి, నూల ఉంటలు, చలిమిడి నైవేద్యం పెడతారు. కొందరు రోజంతా ఉపవాసం ఉండి పూజిస్తారు.

నూల ఉంటలు ఎలా చేయాలో ఇక్కడ చూడండి. 

చలిమిడి - బియ్యప్పిండి లో మెత్తటి బెల్లపు పొడి కలిపి ఉండలు కడతారు. నూల ఉంట రుచి ముందు అదేం పనికి రాదు. అయినా ప్రసాదం కదా , తీసుకోవాలి. ఆరోగ్యానికి మంచిది కూడా.
చిన్నప్పుడు నల్లగా ఉందని తినకపోయేదాన్ని. నీకు నల్లటి మొగుడు వస్తాడు చూడవే అని మా అవ్వ నవ్వుతుండేది.
ఇప్పుడు నూల ఉండలు చాలా ఇష్టం. పండుగ కాకపోయినా ఎప్పుడైనా చేస్తూ ఉంటాను.
నాగుల చవితి రోజు చెప్పుకోవాల్సిన కథ కూడా ఒకటుంది. అది ఇంకోరోజు రాస్తాను. :-)
                                                                          

3, జులై 2011, ఆదివారం

నీలమాధవా!


లోకాధిదైవతం దేవేశపూజితం జగన్నాథ నాయకం సదాఽహం స్మరామి!

ఈ వేళ పురుషోత్తమపురమైనటువంటి పూరీ పట్టణమునందు విరాజితమైన శ్రీ జగన్నాథుని రథయాత్రా మహోత్సవం ప్రారంభమైనది.

జగన్నాథుని నీలమాధవుడని కూడా పిలుస్తారు. గర్భగుడిలో ప్రధాన విగ్రహాలు దారు శిల్పాలు. అంటే చెక్కవిగ్రహాలు. ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి కొత్త చెక్కతో విగ్రహాలు తయారు చేస్తారు. అప్పటివరకూ ఉన్న పాత విగ్రహాలలో నుంచి ఒక దివ్యపదార్థం తీసి కొత్త విగ్రహాలలో పెట్టి తయారు చేస్తారు. అలా అది కొన్ని వందల ఏళ్ళ నుంచి వస్తూ ఉన్న ఆచారం. మతదురహంకారులైన కొందరు సుల్తానులు పాలించేటప్పుడు అన్ని గుళ్ళను ధ్వంసం చేసినట్లుగానే పురాతనమైన ఈ గుడి మీదా దండయాత్ర చేసేందుకు వచ్చారని, అప్పుడు అసలు విగ్రహాలు కొన్నేళ్ళపాటు ఎక్కడో దాచేసి, అదే రూపంతో వేరే విగ్రహాలు అప్పగించగా, వాటిని ఆ మూర్ఖులు బహిరంగంగా వ్రేలాడదీసి భస్మము చేసి సముద్రంలో పడవేశారని చెపుతారు.

జగన్నాథుని గుడి చాలా విశాలమైన పెద్ద గుడి. అంతేకాదు రథయాత్ర ప్రపంచంలోనే పెద్దరథయాత్ర అని చెప్తారు. లక్షలమంది పాల్గొంటారు. సాధారణంగా హిందువులని మాత్రమే దర్శనానికి అనుమతించినా, సర్వులకూ దర్శనం ప్రసాదించటానికి స్వామి గుడి బయటకు వస్తారు. మానవాళికే కాక తాను సృజించిన విశ్వం లోని ప్రతి జీవికీ దర్శనభాగ్యం కలిగించి మోక్షాన్ని ప్రసాదించే అవకాశం ఇవ్వటానికే స్వామి రథయాత్ర అని చెపుతారు. జగత్తుకే నాథుడు కదా మరి.

ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ నాడు ప్రారంభమయ్యే ఈ రథయాత్ర కు అవసరమైన రథాలను అంటే ౩ రథాలను (చక్రాలను, ఇరుసులను కూడా)వరసగా జగన్నాథునికి, బలభద్రునికి, సుభద్రకు ప్రతి సారి కొత్తగా తయారు చేస్తారు. రథయాత్ర పూర్తయ్యాక ఆ చెక్కను విక్రయిస్తారు. కొన్న జనాలు వాటిని తమ ఇంటికి సింహద్వారాలుగా బిగించుకొని శుభం జరుగుతుందని సంతోషంగా ఉంటారు.

పూరీ సముద్రతీరం చాలా అందమైనది. శుభ్రంగా ఉంటుంది కూడా. ప్రపంచవ్యాప్తం గా ఎంతోమంది పూరీని దైవదర్శనం కోసం, పురసందర్శనం కోసం కూడా వస్తారు.

11, ఏప్రిల్ 2011, సోమవారం

శ్రీరామ రక్ష!

పిల్లలు, పెద్దలం దరును వేడుక మీఱఁగఁ జూడఁగా, యదో!
విల్లును ఫెళ్ళనన్ విరిచె వీరుఁడు; పెండ్లికిఁ దండ్రియాన,నా
కిల్లిడఁ గావలెన్ యనెను, కీరఁపుఁబల్కుల జాణ,జానక
మ్మిల్లునుఁ జేరెఁగోసలము, మెచ్చఁగఁ మామయు సంతసంబునన్.విల్లును విరిచెను రాముఁడు
పిల్లల మగు మననుగాఁవ; వీరునిఁ గనిమిల్
మిల్లను మెరిసెడి బల్చె
క్కిళ్ల రమణి యా కిశోరు కిల్లా లయ్యెన్


అందరికీ శ్రీరామ రక్ష కలుగు గాక!

పిల్, విల్, కిల్, మిల్ అను దత్తపదికి ఇవి నా పూరణలు.