Loading...
దేశ భక్తి గీతాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దేశ భక్తి గీతాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, అక్టోబర్ 2017, గురువారం

ధర్మంబియ్యది!

శార్దూలవిక్రీడితము

కర్మంబందునఁ దక్క నే ఫలములన్ కాంక్షించలేదెన్న, డే
దుర్మార్గంబుల క్రుంగుటల్ కనద, వే దుర్వ్యూహముల్ తోచినన్
మర్మంబుల్ సడలంగ జీరు తన సమ్మానంబు వర్ధిల్లగా.
ధర్మంబియ్యది నిల్చియున్నది సదా దైవాంశ కన్పట్టగా
తీర్మానమ్ముగ నెల్ల వారి శుభముల్ దృక్కోణమందుండగా. 
అలాగే ఈ ప్రసంగం కూడా వినదగ్గది.
https://www.blogger.com/blogger.g?blogID=4174482763145446746#editor/target=post;postID=924532607569542971

21, ఫిబ్రవరి 2016, ఆదివారం

బాగు కొఱకై శ్రమించు, భారమయిపోబోకురా!

వీరసేనల ఊపిరాగెను నీకు ఊపిరులూదగా
దేశభక్తుల గుండెలాగెను నీదు ఆయువుపెంచగా|
ప్రజలసేమము కోరుధీరులుసాగిరసువులుబాయగా
ధ్వజము నిలుపుట పరమ ధర్మమ్మను నిజము నీవెఱుగగా| వీర|
తాత తండ్రులు అమ్మలక్కలు రూపుదిద్దిన స్వేచ్ఛకే
మాట దెచ్చెడు పనులు మూర్ఖపు చేష్ఠలేవో ఎఱుగరా!
జాతి పతనముఁ జేయు చేతలు ఏలరా? నీకేలరా?|వీర|
జయపతాకము నిలుచు వరకే కుశలమనునది నీకురా
భయమరాచకమన్నవెల్లను చొరకయుండును ఎఱుగరా
బాగు కొఱకై శ్రమించు, భారమయిపోబోకురా|వీర|
----లక్ష్మీదేవి.

19, నవంబర్ 2014, బుధవారం

ఆనాటి జాతీయ రచనలు

       వందేమాతరం పలుకునే నిషేధించి కఠినంగా అప్పటి దురాక్రమణదార్లు ప్రవర్తిస్తున్నప్పటికీ, మొక్కవోని ఆత్మస్థైర్యంతో వెనుదీయని గుండెబలంతో మన జాతీయస్ఫూర్తిని పెంపొందించే విధంగా జనచైత్యన్యం కదం తొక్కే విధంగా కవులు ఎందరో ఎన్నో జాతీయ రచనలు చేసినారు.
    గురజాడ అప్పారావు గారి దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా అటువంటిదే. రాయప్రోలు వారి సిరులు పొంగిన జీవగడ్డయి పాలుబారిన భాగ్యసీమై అటువంటిదే.
  ఇప్పుడు మరి కొన్ని చూద్దాము.
****************
బలిజేపల్లి లక్ష్మీకాంతమ్మ గారి స్వరాజ్యసమస్య అన్న పద్యగ్రంథము లోని పద్యము.

సకల రత్న ప్రభా చటులాంబరంబైన హిమనగం బాత పత్రముగ మెరయ
చేరి భాగీరథీ సింధునదీ తటుల్ విమల వీచీ చామరములు వీవ
ప్రాక్పశ్చిమాగ్ర భూముల గొల్చి గభీర వారిధీశ్వరులు కైవార మొసగ
ఆర్షసంతతి యుదాత్తాను దాత్తములైన  స్వరములు స్వస్తి వాచనములిడగ
ముప్పదియు మూడుకోటుల ముద్దు సతులు
సమత తన యాజ్ఞ శిరసావహింప
సింహళద్వీప పీఠికాసీన యగుచు
కరుణ జగమేలుగాత మాభరతమాత.

గౌతమీ కృష్ణవేణి తుంగభద్రాది పావనోదక ముగ్గుబాలు త్రావి
నన్నపార్యాది మాన్య కవిత్రయము చేత నల్లనల్లన మాటలాడనేర్చి
ఆంధ్రరాష్ట్ర స్థాపనాచార్య వర్యుడౌ విష్ణువర్ధను భుజాపీఠి నెక్కి
ఆంధ్రసేవాపరాయణ కృష్ణ రాయాది పతులచే సకల సంపదల బొదవి
కడుపు చల్లగ గాంచి పెక్కండ్ర సుతుల
బహువిక్రమతేజః ప్రభావధనుల
నిస్సమాన మహోన్నతి నెగడినట్టి
ఆంధ్రమాతా నమస్కారమమ్మ నీకు.
*********************
జాషువా గారి ప్రసిద్ధ పద్యము

సగరమాంధాత్రాది షట్చక్రవర్తుల యంకసీమల నిల్చినట్టి సాధ్వి
బుద్ధాది ముని జనంబుల తపంబున మోద బాష్పము ల్విడిచిన భక్తురాలు
కాళిదాసాది సత్కవి కుమారుల గాంచి కీర్తినందిన పెద్ద గేస్తురాలు
కమల నాభుని వేణుగాన సుధాంభోది మునిగిదేలిన పరిపూతదేహ
సింధు గంగానదీ జల క్షీరములను
కురిసి బిడ్డల బోషించుకొనుచున్న
పచ్చి బాలింతరాలు మా భరతమాత
మాతలకు మాత  సకలసంపత్సమేత
****************

మన రాజపుత్రవీరుల శౌర్యచరిత్రలు దాస్యములో మగ్గి ఎలా కాంతి సమసినాయో చెపుతూ
ఓలేటి నారాయణమూర్తి గారు
సూత్రయుగముల శుద్ధవాసన
క్షాత్రయుగముల చండశౌర్యము
చిత్ర దాస్యముచే చరిత్రల
చెరిగిపోయెర తమ్ముడా!!

జనపదుల గీతాలూ ఎంత ఉత్తేజపూరితంగా ఉన్నాయో చూడండి.

అచ్చరాలొచ్చీ అచ్చన గాయలాడుకుండే రాజ్యములో రయ్యో కొయ్యోడ!
కిన్నరులొచ్చీ కీర్తనపాడే కీర్తివంత రాజ్యములో రయ్యో కొయ్యోడ!

కొయ్యోడ= కోయవాడా!

************
గరిమె ళ్ళ సత్యనారాయణ గారి

నూరు మంది మలబారు వాసులానూ
 కూరినాడొక పెట్టె లోన (!!!అమ్మో, పాపం కదా!!)
గాలి దూరనీయడు ఇంచుకైన
నోట నీరు పోయడు దేవునాన

పరపాలకులదౌర్జన్యాలు చూడండి. గుండెలవిసిపోతాయి.

******************

చారిత్రక క్షేత్రాలూ పుణ్యక్షేత్రాలూ శిథిలమైనాయని చూపి చెప్పడము దేశము వన్నె తరిగి కృశిస్తున్నదనీ, అన్యాపదేశంగా దేశాన్ని నీవు పునర్నిర్మించవలెననియు చెప్పడమే.

శేషాద్రి రమణకవుల పలుకులు
అది తటాకము కాదాంధ్ర కుమార అరివీర దుస్సాధ్యమైనట్టి పరిఘ
అద్ది కుంకుమము గాదాంధ్ర కుమార తెలుగు నెత్తుటి గడ్డ దెరలిన దుమ్ము
****************

ఓరుగల్లు కోట దుస్థితి గురించి వానమామలై వరదాచార్యులు
కుక్కలు చింపు విస్తరిగ కూలిన యోర్గలు కోటకంటివే?
మక్కువ ఊపిరుండియును మూతికి మీసము గల్గు నాథుడా
*********************

కొడాలి సుబ్బారావు
శిలలు ద్రవించి యేడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలోపల
గుడి గోపురమ్ములు సభాస్థలులైనవి కొండముచ్చు గుంపులకు
************

పురిపండా (అప్పలస్వామి)
భయద దాస్య విశృంఖలా బంధితుడవు ఓయి! జీవచ్ఛవాంధ్రుడా!
ఒక్కమారు ఒలుక నిమ్మిట నింత కవోష్ణ బాష్ప మలినధార స్వాతంత్ర్య సంప్రాప్తి కొఱకు
 *************

కాళోజీ
ఇల పుట్టిననాటి నుండి ఇలవేల్పుగ నిల్చి మనల ఇరుగుపొరుగు
దుండగాల కొరగాకుండగ కాచిన హిమవంతునికాపద యట
పదపదపద ఆదుకొనగ ఆంధ్రావళి అండదండ అస్సాముకు అందింపగ
నయ్యర్లకు తోడ్తోడుగ నాయర్లను నిలిపి ఉంచ
బదరీనాధుని రక్షకు మధురను కంచిని కదుపగ
కాశ్మీరమునకు జంటగ కన్యాకుమారిని నిలుపగ
బిహారీల రణభేరిగ మహా రాష్ట్రము హుంకరింప
గురుగోవిందుని గర్జన ఘార్జరులను కదలింపగ
కర్ణాటక చాముండియే కలకత్తా కాళికాగా
కైలాసము పిలుపును విని కాకతి చిందులు త్రొక్కగ
ఏడుకొండలెలుగెత్తుచు హిమవంతుని పురిగొల్పగ
నగరము చేయూతకు రంగము ఎగిరి దుముక
శైలము గంతులిడుచు శీత నగరము నాదుకొనగ
కలము కుంచె కదలింపుము
సరిహద్దును కాపాడే జై సేనా జైహింద్
లద్దాకును కాపాడే లచ్చన్నా జై హింద్
ఈశాన్యము రక్షించే ఎంకన్నా జైహింద్
ప్రాణాలకు లెక్కించని పంజాబీ జైహింద్
అరచేతిలో తల ఉన్న అస్సామీ జై హింద్
సాదోబా జై హింద్ మదోజీ జైహింద్
మల్హారూ జైహింద్
******************

విశ్వనాథ సత్యనారాయణ
పాడినగీతమే మరల బాడెదం గూడిన భావమే మరి గూడెద వేమి పేయవలె గుండియ శోషలి దుఃఖ వేదనల్ గాడిన
నా హృదంతర ముఖంబున మా తొలినాటికీర్తి రాపాడిన నాదు వాక్కులెగబారదు నూత్నపథాల వెంబడిన్.

నా జాతి పూర్వ ప్రథాజీవరహితమై శక్తి నాడుల యందు చచ్చిపోయి
నా మాతృభూమి తేజో మహాశ్యుతుని బ్రహ్మ క్షత్రతేజంబు మంటగలిపి
నా మాతృభాష నానా దుష్ట భాషల యౌద్ధత్యమును తల నవధరించి
నా తల్లినేల నేనాటి వాచారముల్ పై మెరుగులు చూచి భ్రమసిపోయి
ఏమి మిగిలినదీనాటికిట్లు
పొంగులొలయు వర్షానదీ గభీరోదకముల
దైన్యగర్భచారిత్రముల్ దక్క భిన్నగిరి
శిఖర దుర్గ పరిదీన గీతి దక్క
***************


తుమ్మల సీతారామమూర్తి
నీ రమణమూర్తి కమనీయ వచస్స్ఫురణంబు దాతృతాగౌరవ  మద్వితీయ రసికత్వ విభూతి విశిష్ట శౌర్య విద్యా రుచిరత్వ మంతకొని యాడినా మత్కవితా పిపాస చల్లారదదేమి తల్లి! ఇది యారక మారక ఇట్లె నిల్చుతన్.
అన్నారు.
" తథాస్తు" అని దీవించును గాక తెలుగుతల్లికి తల్లి.


డా శ్రీపాద గోపాల కృష్ణమూర్తి గారిచే రచింపబడిన అర్థశతాబ్దపు ఆంధ్రకవిత్వం పుస్తకం నుంచి  తీసుకోబడిన వివరాలివి.

 _/\_        _/\_       _/\_         _/\_       _/\_      26, జనవరి 2014, ఆదివారం

విద్వేషాలు పెంచుకోవద్దండి ప్రజలారా!

విద్వేషాలు పెంచుకోవద్దండి ప్రజలారా!
  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే నేతలు అన్నిభాగాల్లో ప్రజలు విడిపోవడానికి కారణమవుతున్నారు. తరతరాలు కలిసి ఉండవలసిన ప్రజల్లో అపోహలు ఉండకూడదు. మనసు వికలమయ్యే ఈ రోజులు ఎప్పుడు పోతాయో అందరూ అందర్నీ మనవాళ్ళని ఎప్పుడు అనుకుంటారో అప్పటి వరకూ ప్రశాంతతకు ఆస్కారం లేదు. అభివృద్ధి జరుగదు. ఇవి రెండూ ప్రసాదించమని భగవంతుని వేడుకుంటూ, మన పెద్దలు ఆనాడు ఎన్నో ఆశలతో  పాడుకున్న ఈ  పాట విందాము.

14, ఆగస్టు 2012, మంగళవారం

శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై ....

శ్రీలు పొంగిన జీవగడ్డయి   పాలు పారిన భాగ్యసీమయి  
వరలినది ఈ భరత ఖండము,  భక్తి పాడర తమ్ముడా !(2)

వేద శాఖలు వెలసెనిచ్చట  ఆదికావ్యం బలరె నిచ్చట |
బాదరాయణ పరమఋషులకు పాదు సుమ్మిది తమ్ముడా ||శ్రీలు పొంగిన||

విపిన బంధుర వృక్ష వాటిక  ఉపనిషన్మధువొలికెనిచ్చట |
విపుల తత్వము విస్తరించిన  విమల తలమిది తమ్ముడా || శ్రీలు పొంగిన||

సూత్ర యుగముల శుద్ధ వాసన క్షాత్ర యుగముల శౌర్య చండిమ
చిత్ర దాస్యము చే చరిత్రల చెరిగిపోయెర తమ్ముడా || శ్రీలు పొంగిన||

మేలి కిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమెత్తి
పాలతీయని బాలభారత పథము పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||

దేశగర్వము దీప్తి చెందగ దేశచరితము తేజరిల్లగ |
దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా || (శ్రీలు పొంగిన)||

పాండవేయుల పదునుకత్తులు మండి మెరిసిన మహితరణ కధ |
కండగల చిక్కని పదంబుల కలిపి పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||

                                                 ---రాయప్రోలు సుబ్బారావు.

ఈ పాట ఇక్కడ వినండి.

4, అక్టోబర్ 2011, మంగళవారం

భువనేశ్వరీ !

భువనేశ్వరీ !
అఖిల లోకములఁ గన్న తల్లివీ,
ఆశీస్సులనే కోరివచ్చితిని........... భువనేశ్వరీ!

రాగము ద్వేషము లేని దానవు
లోకములన్నిటి నేలెదవూ..
ద్వేషము పెరుగగఁ బంతముఁ బూనిన
దేశము నిపుడు కావగరావా... భువనేశ్వరీ!

ఎల్లరమూ నీ పిల్లలమమ్మా
చల్లటి నీ ఒడి నుండగ నిమ్మా..
కల్లల,కపటాలన్నిటినీ..
చెల్లగబోవని చూపగదమ్మా.....భువనేశ్వరీ!
                -----లక్ష్మీదేవి

4, సెప్టెంబర్ 2011, ఆదివారం

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ........

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ........

ఈ మాట మొట్ట మొదట శ్రీరాముడు అన్నాడుట. లంకావిజయానంతరం అక్కడే ఉండి పోవచ్చు కదా అని అన్నప్పుడు అన్నమాట.
కన్నతల్లి, సొంతఊరు  స్వర్గం కన్నా మించిన ఆనందం కలిగిస్తాయి. అని.
ఈ మాట ని బాగా అందరికీ తెలిసేలా చేసింది బహుశా నందమూరి తారక రామారావు గారే అనుకుంటాను. ఈ
 పాట ని ఇప్పుడు విందామా! జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ........ నీ తల్లి మోసేది నవమాసాలేరా,      ఈ తల్లి మోయాలి కడ వరకురా....................కట్టె కాలేవరకురా...

29, ఆగస్టు 2011, సోమవారం

మా తెలుగు తల్లికి మల్లె పూదండ !


మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక

నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!
--------శంకరంబాడి సుందరాచారి.

తెలుగువారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు !

13, ఆగస్టు 2011, శనివారం

జో శహీద్ హువే హై ఉన్ కీ జరా యాద్ కరో కుర్బానీ(కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.)తెలుగులో , హిందీ లో చదవండి. వినడానికి ఇక్కడ నొక్కండి.
తెలుగు భావం చదవండి

 యె మేరే వతన్ కే లోగోం!
తుమ్ ఖూబ్ లగా లో నారా
యే శుభ్ దిన్ హై హమ్ సబ్ కా
లహరా లో తిరంగా ప్యారా
పర్ మత్ భూలో సీమా పర్
వీరోంనె హై ప్రాణ్ గంవాయె
 కుఛ్ యాద్ ఉన్హే భీ కర్ లో - 2
జో లౌట్ కె ఘర్ నా ఆయె-2

 యె మేరే వతన్ కే లోగోం!
జరా ఆంఖ్ మే భర్ లో పానీ
జో  శహీద్ హువే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ

జబ్ ఘాయల్ హువా హిమాలయ్
ఖత్ రే మే పడీ ఆజాదీ
జబ్ తక్ థీ సాంస్ లడే వో
ఫిర్ అప్ నీ లాశ్ బిఛాదీ
సంగీన్ పే ధర్ కర్ మాథా
సో గయే అమర్ బలిదానీ
 జో శహీద్ హుయే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ

జబ్ దేశ్ మే థీ దివాలీ
వో ఖేల్ రహే థే హోలీ
 జబ్ హమ్ బైఠే థే ఘరోం మే
వో ఝేల్ రహే థే గోలీ
 థే ధన్య జవాన్ వో అప్ నే
 థీ ధన్య వో ఉన్ కీ జవానీ
జో శహీద్ హుయే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ

కోయీ సిఖ్ కోయీ జాఠ్ మరాఠా
కోయీ గురఖా కోయీ మదరాసీ
సరహద్ పె మర్ నేవాలా
హర్ వీర్ థా భారత్ వాసీ
జో ఖూన్ గిరా పర్వత్ పర్
వో ఖూన్ థా హిందూస్థానీ
జో శహీద్ హుయే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ

థీ ఖోన్ సె లథ్ పథ్ కాయా
ఫిర్ భీ బందూక్ ఉఠాకే
దస్ దస్ కో ఏక్ నే మారా
ఫిర్ గిర్ గయే హోష్ గంవా కే
జబ్ అంత్ సమయ్ ఆయా తో
కహ్ గయే కి అబ్ మర్ తే హై
ఖుష్ రహ్ నా దేశ్ కే ప్యారోం
అబ్ హమ్ తో సఫర్ కర్ తే  హై
క్యా లోగ్ థే వో దీవానే
క్యా లోగ్ థే వో అభిమానీ
జో శహీద్ హుయే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ

తుమ్ భూల్ న జావో ఉన్ కో
ఇస్ లియే కహీ యే కహానీ
జో శహీద్ హుయే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ
జయ హింద్ జయహింద్ కీ సేనా
జయ హింద్ జయ హింద్ జయ హింద్!!!

భావం ---------

నా దేశ ప్రజలారా!
నినదించండి, ఈవేళ  మనందరికీ శుభదినం. మువ్వన్నె ల జెండా ఎగరేయండి
కానీ హద్దుల్ని కాపాడుతూ ప్రాణాలను బలి ఇచ్చిన వీరులను కూడా స్మరించండి. వారిక ఎప్పటికీ ఇంటికి తిరిగి రాలేదని మరువకండి.

నా దేశ ప్రజలారా!
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.
హిమాలయాలు గాయపడినపుడు, మన వాళ్ళ స్వేచ్ఛకు ఆటంకం కలిగినపుడు ఊపిరున్నంతవరకూ పోరాడారు వాళ్ళు. ఆ తరువాత తాము శవాలయ్యారు. తమ శిరస్సుమీద తుపాకీ మొన గురి పెట్టబడి ఉందని తెలిసి పోరాడి అమరులయ్యారు.
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.

నా దేశ ప్రజలారా!
దేశమంతా దివాలీ జరుపుకుంటుంటే వారు రక్తపు హోలీ ఆడారు.
మనమంతా దేశం లోపల భద్రంగా ఉంటే వాళ్ళు తుపాకీ గుండ్లతో ఆడారు.
మన సేనలు,వారి సమర్థత ధన్యం చెందాయి.
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.
సిఖ్ఖులు, జాట్ లు, మరాఠీలు, గుర్ఖాలు, మదరాసీలు, సరిహద్దుల్లో ప్రాణాలు వదిలినవారంతా ఎవరైతేనేం---భారతీయులు. ఆ కొండల మీద చిందిన రక్తం భారతీయులది.
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.
దేహం మొత్తం  తుపాకీ గుండ్లతో రక్తసిక్తమైనా సరే తుపాకీలు గురి పెట్టి ఒక్కొక్కరు పది మంది  శత్రువులనైనా చంపే అసువులు బాశారు.
మేం లోకం వదిలేస్తున్నాం, నా ప్రియమైన దేశవాసులారా! సంతోషంగా జీవించండి అని చెప్పి మనకు వీడ్కోలిచ్చారు.
ఎంత ఆత్మాభిమానం, ఎంత పట్టుదల !!!
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.
వారిని మనం మరవకూడదనే ఈ కథ!
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.
జయ జయ హిందూదేశం! జయ జయ హిందూ దేశం!!!
15, ఫిబ్రవరి 2011, మంగళవారం

జయము నీకు తెలుగుతల్లి!

జయము నీకు తెలుగుతల్లి! జయము జయము జయము!
అక్షరాల ఆకులతో శోభిల్లే పూలవల్లి జయము జయము!

సొంత భాషనెఱుగకుండ
పెఱుగుతున్న యువతరాన్ని
కొత్తరకపు బానిసలని
దరిఁజేర్చి కాపాడవే
తేనెలూరు పలుకు తల్లి!


మన పాటల మన మాటల
మన పద్యపు భావాలను
తెలియలేని మా తరాన్ని
మెఱుగుపఱిచి తీర్చిదిద్ది
మమ్మేలవే కల్పవల్లి!
-లక్ష్మీదేవి

13, ఏప్రిల్ 2010, మంగళవారం

వర్తమాన కాలంలో జీవించాలి అనే మాటలన్నీ ...

భూత కాలం, భవిష్యత్కాలం అవసరం లేదు. వర్తమాన కాలంలో జీవించాలి అనే మాటలన్నీ మంచివే. కానీ ఎవరికి? తన ప్రస్తుత పరిస్థితికి భూతకాలమే కారణమని చింతిస్తూ, వర్తమానాన్ని పాడుచేసుకునే వాళ్ళకు, భవిష్యత్కల్పనలో పడి వర్తమానాన్ని పట్టించుకోని వాళ్ళకూ! (ఆ ఒక్కటీ అడక్కు లో హీరో రాజునవుతానని....)

సాధారణంగా మానవులు తనకూ, సమాజానికీ ఉపయోగపడేలా తనపని చేసుకుంటూ, జీవనం సాగిస్తున్నప్పుడు భవిష్యత్ గురించి కలలు కనొచ్చు, గతంలోని తన మిత్రులనో సంఘటనలనో తలచుకొని సంతోషమో, దు:ఖమో వెలిబుచ్చనూ వచ్చు. అలా చేయటం వల్ల ఎవరి వర్తమానమూ బాధింప బడకూడదు. అంతే..

గతాన్ని మర్చిపోవాల్సిన విషయంగా పరిగణిస్తే, మనం జీవించటంలో అర్థం లేదు.
* మనల్ని పెంచి పెద్దచేసిన తల్లిదండ్రుల్ని, లోకఙ్ఞానాన్ని కలిగించే గురువుల్ని మనం మరిచిపోగలమా!
* మనతో ఆడిపాడిన స్నేహితుల్ని, పెద్దయ్యాక ఏదో ఒక అవసరానికి అండగా నిలిచిన స్నేహితుల్నీ మరిచిపోగలమా!
* ఎన్నో ఢక్కామొక్కీలు తిని నేర్చుకున్న జీవిత పాఠాల్ని మరిచిపోగలమా! (మరిచిపోతే మళ్ళీ అవే తినాల్సొస్తుంది కదా..!)

ఇవన్నీ మరిచిపోతే, ఇబ్బందులు ఎదురయ్యేది మనకే!
ఎందుకంటే, గడచిన కాలంలోని మన జీవితాన్ని, పరిస్థితుల ఆధారంగా మనం చేసిన పనులనీ, తీసుకున్న నిర్ణయాలనీ ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటేనే, జీవితంలో మళ్లీ జరిగిన తప్పు జరక్కుండా, సంతృప్తికరంగా జీవించేట్టు చూసుకోగలం. కనీసం ప్రయత్నించగలం.

చాలామంది ప్రతిరోజు డైరీ ఎందుకు రాస్తారు?

ఆవేళ జరిగిన విషయాల్ని తలచుకుంటూ డైరీ రాస్తారు. ఎందుకని మరిచిపోయి వదిలేయరు? జరిగిన సంఘటన మనసుని బాధపెట్టిందా లేదా సంతోష పెట్టిందా అనిన్నీ, వాటి విషయంలో తమ తాత్కాలిక మరియూ శాశ్వత ప్రతిక్రియనీ నిదానంగా ఆలోచించి నమోదు చేసుకుంటారు.

డైరీ రాసేవాళ్ళూ, రాయని వాళ్ళూ కూడా అప్పటి తమ భావోద్వేగాలు రేకెత్తించే ప్రతికియనే గాక రోజులు గడిచే కొద్దీ మారే తమ ప్రతిక్రియనీ ఎవరితోనైనా పంచుకుంటారు. అది కొన్ని విషయాల్లో చెప్పుకోవడంతో ఆగిపోవచ్చు. కొన్ని విషయాల్లో తరతరాల జీవనాన్ని ప్రభావితం చేసే విషయాల్లో అయితే సన్నిహితులతో మాత్రమే కాక సమాజం అంతటితో పంచుకుంటారు. అవే పండుగలు, ఉత్సవాలు, ఉర్సులు, మొ||గునవి.

నిజమే.. ఉగాది, వినాయక చవితి, కృష్ణాష్టమి మొ||నవి ఒక ప్రత్యేక సందర్భం మానవాళికి కల్పించిన సంభ్రమానందాల్ని సమాజంతో కలిసి మరి మరి పంచుకోటానికి జరుపుకుంటారు. దీపావళి, దసరా మొ||నవి చెడు పై మంచి సాధించిన విజయాన్ని సమాజంతో కలిసి మరి మరి పంచుకోటానికి జరుపుకుంటారు. చెడుపై మంచి విజయం అంటే, అది వ్యక్తిగతమైనది కాదు. తన తండ్రి తద్దినాన్నో, తన పాప పుట్టిన రోజునో సమాజం జరుపుకోవాలని ఆశించం. అయితే మానవాళికి శుభం కూర్చే సందర్భాన్నే సమాజంతో కలిసి ఉత్సవాలు చేసుకునేది. ఉదాహరణకు శ్రీరామ చంద్రుడు రావణున్ని సంహరించటం అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని సంహరించటం కాదు. కౌరవుల్ని అంతం చేయటం కూడా అంతే. నీ స్వాతంత్ర్యం నీవు సుఖంగా సంతోషంగా ఉండటం కోసమే గానీ పరులకు హాని కలిగించరాదని లోకానికి తెలియచేయటం కోసమే!

అలా అయితే అందరూ మారిపోయారా, అంటే ఇంక చెడు లేదా అని కాదు.మంచి ఉన్నంత కాలమూ చెడు ఉంటుంది, చీకటి వెలుగులు ఎప్పుడూ ఉంటాయి. చీకటిలో ఉండకు వెలుగులోకి రమ్మని పిలివటమూ, వెలుగు ఇదీ అని చూపించటమూ, ఇలాంటి న్యాయ వ్యవస్థ అమలులో ఉండటం సమాజానికి హితవు అని చెప్పటమూ =====

ఈఉద్దేశ్యాలతోటే పండుగలూ, ఉత్సవాలూ జరుపుకుంటూ, ఆయా సందర్భాల్ని( గతంలోనివే మరి ) చెప్పుకుంటూ ఉంటారు. అందరూ మారరు. కొందరు చీకటినే ఇష్టపడతారు.
అంతేకానీ ఏదో శెలవు, తీపి వంటలు దక్కుతాయని కాదు.

ఇక భవిష్యత్ ...
భవిష్యత్ అనేది అవసరమే లేదంటే ఇక ప్రణాళికలెందుకు?

డైరీ రాయటం గురించి...

ఆ రోజు చెయ్యాలనుకున్నవి చేశామా, లేదా అని ఒక ఉద్దేశ్యం. అంటే భవిష్యత్తు అని రేపటి కోసం వేసిన ప్రణాళిక అమలు చేశామా లేదా అనే కదా! రేపటి కోసంప్రణాళిక అనేది లేకపోతే వారసుల భవిష్యత్ ని తీర్చిదిద్దగలమా?
అనుకోని పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు సమాయత్తం కాగలమా?
గతం, భవిష్యత్ రెండూ వర్తమానానికి ముఖ్యమే. కాకపోతే వర్తమానాన్ని బలి పెట్టి గతంలోనో, భవిష్యత్ లోనో జీవించటం మాత్రం తప్పు.

శ్రీ కృష్ణదేవరాయలు, ఇంకా ఎంతోమంది కవులు, కవిపోషకులు ఉండబట్టే, భాష (ఏదైనా) ఇంకా నిలిచి ఉంది. ఈవేళ్టి తరంలో అలాంటి వాళ్ళు లేకపోతే భవిష్యత్ లో భాష మిగలదు.

అలాంటి భాషాభిమానాన్ని అలవర్చుకోటానికి మనం రాయల్ని తలుచుకోవాలి.

ప్రజలు సుఖశాంతులతో జీవించేలా పరిపాలించాడు.

అలాంటి పరిపాలనా దక్షతని (కుటుంబం రాజ్యానికి చిన్న యూనిట్ కదా) అలవర్చుకోటానికి మనం రాయల్ని తలుచుకోవాలి.

రాజ్యాన్ని, ప్రజా జీవనాన్ని ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న దుష్టులను ప్రతీసారీ జయించాడు.
అలాంటి విజయాలకు పట్టుగొమ్మలయిన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, సామర్థ్యాన్ని, దేశభక్తినీ, సమాజం పట్ల తన కర్తవ్యాన్ని విడిచిపెట్టని ధృడత్వాన్నీ అలవర్చుకోటానికి మనం రాయల్ని తలుచుకోవాలి.

(ఎప్పుడో జరిగిన కృష్ణదేవరాయల పట్టాభిషేకం ఇప్పుడు ఉత్సవం చేసుకోవడం ఎందుకు, నేను వర్తమానంలోనే జీవిస్తాను అన్న ఒక నేస్తానికి సమాధానంగా... ఈ ఉత్తరం)

21, ఫిబ్రవరి 2010, ఆదివారం

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా
గతమెంతో ఘన కీర్తి గలవోడా

వీర రక్తపు ధార వార వోసిన సీమ
పలనాడు నీదెరా వెలనాడు నీదెరా
బాల చంద్రుడు చూడ ఎవరోడోయ్
తాండ్ర పాపయ కూడ నీవోడోయ్ ||చెయ్యెత్తి ||

నాయకీ నాగమ్మ, మంగమాంబ, మొల్ల
మగువ మాంచాల నీ తోడ బుట్టిన వోళ్ళె
వీర వనితల గన్న తల్లేరా
ధీర మాతల జన్మ భూమేరా ||చెయ్యెత్తి ||

కల్లోల గౌతమి వెల్లువల క్రిష్ణమ్మ
తుంగభద్రా తల్లి పొంగిపొరలిన చాలు
ధాన్య రాశులు పండు దేశాన
కూడు గుడ్డకు కొదువ లేదోయి ||చెయ్యెత్తి ||

పెనుగాలి వీచింది అణగారి పోయింది
నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది
ముక్కోటి బలగమై ఒక్కటై మనముంటే
ఇరుగు పొరుగూలోన ఊరు పేరుంటాది
తల్లి ఒక్కటె నీకు తెలుగోడా
సవతి బిడ్డల పోరు మనకేలా? ||చెయ్యెత్తి ||
==వేములపల్లి శ్రి కృష్ణ