Loading...
దేశ భక్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దేశ భక్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, అక్టోబర్ 2017, గురువారం

ధర్మంబియ్యది!

శార్దూలవిక్రీడితము

కర్మంబందునఁ దక్క నే ఫలములన్ కాంక్షించలేదెన్న, డే
దుర్మార్గంబుల క్రుంగుటల్ కనద, వే దుర్వ్యూహముల్ తోచినన్
మర్మంబుల్ సడలంగ జీరు తన సమ్మానంబు వర్ధిల్లగా.
ధర్మంబియ్యది నిల్చియున్నది సదా దైవాంశ కన్పట్టగా
తీర్మానమ్ముగ నెల్ల వారి శుభముల్ దృక్కోణమందుండగా. 
అలాగే ఈ ప్రసంగం కూడా వినదగ్గది.
https://www.blogger.com/blogger.g?blogID=4174482763145446746#editor/target=post;postID=924532607569542971

31, అక్టోబర్ 2016, సోమవారం

భారతదేశం విడిపోయిందెప్పుడెప్పుడు?

భారతదేశం ఎప్పుడెప్పుడు ముక్కలయిందో చూస్తే ఆశ్చర్యమౌతుంది. మొన్నటి శతాబ్దం అంటే 1800 నుంచే ఇలా ముక్కలైంది.
మొత్తం ఒకటిగా ఉన్నప్పుడు సింహరూపంలో కనిపిస్తోంది . కదా!

21, ఫిబ్రవరి 2016, ఆదివారం

బాగు కొఱకై శ్రమించు, భారమయిపోబోకురా!

వీరసేనల ఊపిరాగెను నీకు ఊపిరులూదగా
దేశభక్తుల గుండెలాగెను నీదు ఆయువుపెంచగా|
ప్రజలసేమము కోరుధీరులుసాగిరసువులుబాయగా
ధ్వజము నిలుపుట పరమ ధర్మమ్మను నిజము నీవెఱుగగా| వీర|
తాత తండ్రులు అమ్మలక్కలు రూపుదిద్దిన స్వేచ్ఛకే
మాట దెచ్చెడు పనులు మూర్ఖపు చేష్ఠలేవో ఎఱుగరా!
జాతి పతనముఁ జేయు చేతలు ఏలరా? నీకేలరా?|వీర|
జయపతాకము నిలుచు వరకే కుశలమనునది నీకురా
భయమరాచకమన్నవెల్లను చొరకయుండును ఎఱుగరా
బాగు కొఱకై శ్రమించు, భారమయిపోబోకురా|వీర|
----లక్ష్మీదేవి.

30, జనవరి 2015, శుక్రవారం

సైనికబలం

      విశాలమైన భారత సరిహద్దులను సర్వదా, సర్వథా కనిపెట్టి యుండి కాపాడేందుకు ఒకప్పటి భారత ప్రధాని శ్రీ లాల్ బహద్దూర్ శాస్త్రి గారు ఏర్పాటు చేసిన సరిహద్దు భద్రతా దళం సేవల్ని ఎన్ని నోళ్ళ కొనియాడినా చాలదు.
 
       మన సరిహద్దులను సైనికులు భద్రంగా కాపాడడం వల్లనే సరిహద్దుల మధ్యలో ఉన్న భారతంలో ప్రజలందరూ ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. బహిశ్శత్రువులనుంచి వారు కాపాడుతున్నా, అంతశ్శత్రువులైన రకరకాల విప్లవవాదులు, తీవ్రవాదులు, అరాచకవాదుల వల్ల, అరాచకశక్తుల వల్ల జరిగే ప్రమాదములనుంచి మనల్ని మనం కాపాడుకోలేక పోతున్నాం.
       
          మన సరిహద్దులు విభిన్న ప్రకృతులు గలవి.
           
                 ఒక ప్రక్క రాజస్థాన్ ఎడారుల్లో విశాలమైన నిర్జనభూములు, కంచెలు , ఒంటెల మీద ప్రయాణాలు , ఇసుకతుఫాన్ల మధ్యలో విపరీత పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్న కొలది ఆయుధ సామాగ్రి, ఆహార సామాగ్రి తో సర్దుకుంటూ అనుక్షణం అప్రమత్తంగా కాపలా కాస్తూ, మధ్యమధ్యలో ప్రక్క దేశం బాధ్యతా రహితంగా కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ యుద్ధంలేని సమయాల్లో కూడా ప్రాణఘాతకపు పనులకు పాల్పడుతూ ఉంటే కర్తవ్యదీక్ష నేనాడూ కల్లో కూడా మరువకుండా  పనిచేస్తూ ఉంటారు మన సైనికులు.

       ఇంకోప్రక్క ఈశాన్య రాష్ట్రాల్లో చీకటిలో, చిట్టడవుల్లో, చినుకుల నిరంతర రాపిడిలో , మెల్లగా జారిపోయి దూరిపోయే దురాలోచనాపరులైన ఆగంతకులతో తెముల్చుకోడంలో మునిగి తేలుతున్న సైనికులకు అనుక్షణం దోమల స్వైరవిహారంతో ఎడతెగని ఇబ్బందులు. ముఖానికి కూడా దోమతెర వంటిది పూర్తిగా మూయబడినట్టి వస్త్రధారణతో కర్తవ్యదీక్షా పరాయణులై ఆరుగంటల మాపటి  పొద్దుకే అర్థరాత్రి కూడా మనం చూడని చిమ్మ చీకటి, వాహనపు ఫ్లడ్ లైట్ పడినంత మేరా తప్ప చుట్టూ కన్నులు పొడుచుకొని చూసినా కానరాని కారుచీకట్లు. రాత్రీ పగలూ కాపలా కాస్తూ ప్రక్కదేశంలో కలిసిపోయినట్టున్న సరిహద్దు రేఖల పైని గ్రామాల్లో నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తూ ఉంటారు మన సైనికులు.
     ఇంకోప్రక్క వేల కిలోమీటర్ల ఎత్తులో చలికొండల్లో తాగే నీళ్ళు కూడా గడ్డ కట్టుకొని పోయే మంచుప్రదేశాల్లో, బలమైన ప్రక్కదేశం పైకి నవ్వుతూ, కాళ్ళక్రింద గోతులు, సొరంగాలు తవ్వుతూంటే అనుక్షణం మళ్ళీ అప్రమత్తంగా ఉంటూ, ఎటువంటి అలసత్వం లేకుండా అంతర్జాతీయ శాంతి సూత్రాలకూ, స్వంతదేశపు నీతిసూక్తులకూ ఎప్పుడూ ఎటువంటి ద్రోహమూ చేయకుండా, ఉన్నట్టుండి మోసపూరిత శత్రుదేశాల తూటాలకు బలిఅవుతున్న తోటి సైనికులను చూస్తూ కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా నిలిచి కాపాడుతుంటారు మనల్ని మన సైనికులు.
    ఇంకోప్రక్క నీళ్ళల్లో గాలుల్లో కూడా మనపై దాడులు జరగకుండా అనుక్షణం జాగ్రత్త గా దేశాన్ని రక్షిస్తున్నవారి
సేవలూ ఏనాటికీ మనం మరువలేనివి. మరువరానివి. ఏమాత్రమూ మిగతా ఉద్యోగాలతో పోల్చరానివి.
ఆ త్యాగధనులకూ , వారి కుటుంబాలకు ఇవే నా నమోవాకాలు.
       తొంభైశాతం మంది సైనికులు చేసిన సేవలను ఏనాడూ తలచక పోయినా, వారిలో కొద్దిమంది చేసే అఘాయిత్యాలకు బలి అయిన వారి పై సానుభూతి చూపుతూ వీరసైనికులను వేలెత్తి చూపడం సరికాదు. అదీ చేయాల్సిందే ఇదీ చేయాల్సిందే. తప్పునెత్తి చూపేవారు, వారు చేసే సేవలనూ గుర్తించాలన్నది అత్యాశకాదు.
      ప్రభుత్వం కూడా వారి వేతనాలు, కనీస అవసరాలు , చలిలో ఎండలో వారికి కావలసిన ఆత్మరక్షణ పరికరాలు, ఆహారసామాగ్రి , ఆయుధ సామాగ్రి ఏ ఆలస్యం లేకుండా పంపించాలని మనందరం కోరుకోవాలని నా అభిప్రాయం.

19, నవంబర్ 2014, బుధవారం

ఆనాటి జాతీయ రచనలు

       వందేమాతరం పలుకునే నిషేధించి కఠినంగా అప్పటి దురాక్రమణదార్లు ప్రవర్తిస్తున్నప్పటికీ, మొక్కవోని ఆత్మస్థైర్యంతో వెనుదీయని గుండెబలంతో మన జాతీయస్ఫూర్తిని పెంపొందించే విధంగా జనచైత్యన్యం కదం తొక్కే విధంగా కవులు ఎందరో ఎన్నో జాతీయ రచనలు చేసినారు.
    గురజాడ అప్పారావు గారి దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా అటువంటిదే. రాయప్రోలు వారి సిరులు పొంగిన జీవగడ్డయి పాలుబారిన భాగ్యసీమై అటువంటిదే.
  ఇప్పుడు మరి కొన్ని చూద్దాము.
****************
బలిజేపల్లి లక్ష్మీకాంతమ్మ గారి స్వరాజ్యసమస్య అన్న పద్యగ్రంథము లోని పద్యము.

సకల రత్న ప్రభా చటులాంబరంబైన హిమనగం బాత పత్రముగ మెరయ
చేరి భాగీరథీ సింధునదీ తటుల్ విమల వీచీ చామరములు వీవ
ప్రాక్పశ్చిమాగ్ర భూముల గొల్చి గభీర వారిధీశ్వరులు కైవార మొసగ
ఆర్షసంతతి యుదాత్తాను దాత్తములైన  స్వరములు స్వస్తి వాచనములిడగ
ముప్పదియు మూడుకోటుల ముద్దు సతులు
సమత తన యాజ్ఞ శిరసావహింప
సింహళద్వీప పీఠికాసీన యగుచు
కరుణ జగమేలుగాత మాభరతమాత.

గౌతమీ కృష్ణవేణి తుంగభద్రాది పావనోదక ముగ్గుబాలు త్రావి
నన్నపార్యాది మాన్య కవిత్రయము చేత నల్లనల్లన మాటలాడనేర్చి
ఆంధ్రరాష్ట్ర స్థాపనాచార్య వర్యుడౌ విష్ణువర్ధను భుజాపీఠి నెక్కి
ఆంధ్రసేవాపరాయణ కృష్ణ రాయాది పతులచే సకల సంపదల బొదవి
కడుపు చల్లగ గాంచి పెక్కండ్ర సుతుల
బహువిక్రమతేజః ప్రభావధనుల
నిస్సమాన మహోన్నతి నెగడినట్టి
ఆంధ్రమాతా నమస్కారమమ్మ నీకు.
*********************
జాషువా గారి ప్రసిద్ధ పద్యము

సగరమాంధాత్రాది షట్చక్రవర్తుల యంకసీమల నిల్చినట్టి సాధ్వి
బుద్ధాది ముని జనంబుల తపంబున మోద బాష్పము ల్విడిచిన భక్తురాలు
కాళిదాసాది సత్కవి కుమారుల గాంచి కీర్తినందిన పెద్ద గేస్తురాలు
కమల నాభుని వేణుగాన సుధాంభోది మునిగిదేలిన పరిపూతదేహ
సింధు గంగానదీ జల క్షీరములను
కురిసి బిడ్డల బోషించుకొనుచున్న
పచ్చి బాలింతరాలు మా భరతమాత
మాతలకు మాత  సకలసంపత్సమేత
****************

మన రాజపుత్రవీరుల శౌర్యచరిత్రలు దాస్యములో మగ్గి ఎలా కాంతి సమసినాయో చెపుతూ
ఓలేటి నారాయణమూర్తి గారు
సూత్రయుగముల శుద్ధవాసన
క్షాత్రయుగముల చండశౌర్యము
చిత్ర దాస్యముచే చరిత్రల
చెరిగిపోయెర తమ్ముడా!!

జనపదుల గీతాలూ ఎంత ఉత్తేజపూరితంగా ఉన్నాయో చూడండి.

అచ్చరాలొచ్చీ అచ్చన గాయలాడుకుండే రాజ్యములో రయ్యో కొయ్యోడ!
కిన్నరులొచ్చీ కీర్తనపాడే కీర్తివంత రాజ్యములో రయ్యో కొయ్యోడ!

కొయ్యోడ= కోయవాడా!

************
గరిమె ళ్ళ సత్యనారాయణ గారి

నూరు మంది మలబారు వాసులానూ
 కూరినాడొక పెట్టె లోన (!!!అమ్మో, పాపం కదా!!)
గాలి దూరనీయడు ఇంచుకైన
నోట నీరు పోయడు దేవునాన

పరపాలకులదౌర్జన్యాలు చూడండి. గుండెలవిసిపోతాయి.

******************

చారిత్రక క్షేత్రాలూ పుణ్యక్షేత్రాలూ శిథిలమైనాయని చూపి చెప్పడము దేశము వన్నె తరిగి కృశిస్తున్నదనీ, అన్యాపదేశంగా దేశాన్ని నీవు పునర్నిర్మించవలెననియు చెప్పడమే.

శేషాద్రి రమణకవుల పలుకులు
అది తటాకము కాదాంధ్ర కుమార అరివీర దుస్సాధ్యమైనట్టి పరిఘ
అద్ది కుంకుమము గాదాంధ్ర కుమార తెలుగు నెత్తుటి గడ్డ దెరలిన దుమ్ము
****************

ఓరుగల్లు కోట దుస్థితి గురించి వానమామలై వరదాచార్యులు
కుక్కలు చింపు విస్తరిగ కూలిన యోర్గలు కోటకంటివే?
మక్కువ ఊపిరుండియును మూతికి మీసము గల్గు నాథుడా
*********************

కొడాలి సుబ్బారావు
శిలలు ద్రవించి యేడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలోపల
గుడి గోపురమ్ములు సభాస్థలులైనవి కొండముచ్చు గుంపులకు
************

పురిపండా (అప్పలస్వామి)
భయద దాస్య విశృంఖలా బంధితుడవు ఓయి! జీవచ్ఛవాంధ్రుడా!
ఒక్కమారు ఒలుక నిమ్మిట నింత కవోష్ణ బాష్ప మలినధార స్వాతంత్ర్య సంప్రాప్తి కొఱకు
 *************

కాళోజీ
ఇల పుట్టిననాటి నుండి ఇలవేల్పుగ నిల్చి మనల ఇరుగుపొరుగు
దుండగాల కొరగాకుండగ కాచిన హిమవంతునికాపద యట
పదపదపద ఆదుకొనగ ఆంధ్రావళి అండదండ అస్సాముకు అందింపగ
నయ్యర్లకు తోడ్తోడుగ నాయర్లను నిలిపి ఉంచ
బదరీనాధుని రక్షకు మధురను కంచిని కదుపగ
కాశ్మీరమునకు జంటగ కన్యాకుమారిని నిలుపగ
బిహారీల రణభేరిగ మహా రాష్ట్రము హుంకరింప
గురుగోవిందుని గర్జన ఘార్జరులను కదలింపగ
కర్ణాటక చాముండియే కలకత్తా కాళికాగా
కైలాసము పిలుపును విని కాకతి చిందులు త్రొక్కగ
ఏడుకొండలెలుగెత్తుచు హిమవంతుని పురిగొల్పగ
నగరము చేయూతకు రంగము ఎగిరి దుముక
శైలము గంతులిడుచు శీత నగరము నాదుకొనగ
కలము కుంచె కదలింపుము
సరిహద్దును కాపాడే జై సేనా జైహింద్
లద్దాకును కాపాడే లచ్చన్నా జై హింద్
ఈశాన్యము రక్షించే ఎంకన్నా జైహింద్
ప్రాణాలకు లెక్కించని పంజాబీ జైహింద్
అరచేతిలో తల ఉన్న అస్సామీ జై హింద్
సాదోబా జై హింద్ మదోజీ జైహింద్
మల్హారూ జైహింద్
******************

విశ్వనాథ సత్యనారాయణ
పాడినగీతమే మరల బాడెదం గూడిన భావమే మరి గూడెద వేమి పేయవలె గుండియ శోషలి దుఃఖ వేదనల్ గాడిన
నా హృదంతర ముఖంబున మా తొలినాటికీర్తి రాపాడిన నాదు వాక్కులెగబారదు నూత్నపథాల వెంబడిన్.

నా జాతి పూర్వ ప్రథాజీవరహితమై శక్తి నాడుల యందు చచ్చిపోయి
నా మాతృభూమి తేజో మహాశ్యుతుని బ్రహ్మ క్షత్రతేజంబు మంటగలిపి
నా మాతృభాష నానా దుష్ట భాషల యౌద్ధత్యమును తల నవధరించి
నా తల్లినేల నేనాటి వాచారముల్ పై మెరుగులు చూచి భ్రమసిపోయి
ఏమి మిగిలినదీనాటికిట్లు
పొంగులొలయు వర్షానదీ గభీరోదకముల
దైన్యగర్భచారిత్రముల్ దక్క భిన్నగిరి
శిఖర దుర్గ పరిదీన గీతి దక్క
***************


తుమ్మల సీతారామమూర్తి
నీ రమణమూర్తి కమనీయ వచస్స్ఫురణంబు దాతృతాగౌరవ  మద్వితీయ రసికత్వ విభూతి విశిష్ట శౌర్య విద్యా రుచిరత్వ మంతకొని యాడినా మత్కవితా పిపాస చల్లారదదేమి తల్లి! ఇది యారక మారక ఇట్లె నిల్చుతన్.
అన్నారు.
" తథాస్తు" అని దీవించును గాక తెలుగుతల్లికి తల్లి.


డా శ్రీపాద గోపాల కృష్ణమూర్తి గారిచే రచింపబడిన అర్థశతాబ్దపు ఆంధ్రకవిత్వం పుస్తకం నుంచి  తీసుకోబడిన వివరాలివి.

 _/\_        _/\_       _/\_         _/\_       _/\_      13, నవంబర్ 2014, గురువారం

అందరికీ తెలియవలసిన నిజాలు.

పూర్తి వివరాలకు ఈ వ్యాసం చదవండి.

http://tetageeti.wordpress.com/2014/11/13/nehru_the_great/#comment-2695

24, సెప్టెంబర్ 2014, బుధవారం

మనవిజయం --ఘనవిజయం

               ఈరోజు ప్రపంచంలో ఎవరూ ఇంతవరకూ సాధించని ఘనత సాధించిన మన భారతీయశాస్త్రవేత్తలందరికీ అభినందనలు వేల కోట్లుగా మన వందకోట్లమందీ ఇయ్యాల్సిన రోజు.

           స్వపరిజ్ఞానంతో ఎన్నో ఘనమైన విజయాలు సాధించిన మన శాస్త్రవేత్తల బృందం పదినెల్ల క్రిందట శ్రీహరికోటలో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ కోట్ల మైళ్ళ దూరం ప్రయాణించి  అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. నిరంతరం పర్యవేక్షిస్తూ దిశానిర్దేశం చేసిన మన శాస్త్రవేత్తలు, వారికి జ్ఞానాన్ని పంచిన వారి పెద్దలు, వారి జ్ఞానాన్ని పంచుకోబోయే వారి శిష్యులు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, అభినందనలు.

       మొదటి ప్రయత్నంలోనే సఫల ప్రయోగం జరిపిన భారతదేశం ఇతోధికంగా పొరుగుదేశాలకు తన జ్ఞానసంపదద్వారా లభించిన ఫలాల్ని పంచుకోవాలనుకోవడం దేశ గౌరవ చరిత్రకే గర్వకారణం.

   పొరుగు వారికి తోడ్పడే గుణమే కానీ కయ్యానికి కాలుదువ్వే అలవాటు ఎన్నడూ లేని సత్ప్రవర్తన మన చరిత్రది. మన వర్తమానం కూడా అదే అనుసరించాలంటే యువతరం జ్ఞాన పరిశోధనలో, కార్యసాధనలోనూ, పని నైపుణ్యంలోనూ దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలువగలిగే రోజు తొందర్లోనే రావాలని , వస్తుందని ఆశిస్తూ.....


                  జయ సైన్యం ! జయ వ్యవసాయం ! జయ విజ్ఞానం !

23, ఏప్రిల్ 2014, బుధవారం

భారత పునర్నిర్మాణం

దేశ సమగ్రతకు, సమైక్యతకు తగినట్టుగా ఆలోచించడం, నడచుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత. తమతమ జీవన పోరాటం లో వ్యస్తులైన వారు ఈ బాధ్యత కోసం ప్రత్యేకంగా ఏమీ చేయకపోయినా నష్టం లేదు గానీ పూనుకొని సమైక్యతకు భంగం కలిగించే పని చేయకూడదు. చేసినచో శిక్షార్హులు.
            కానీ ఈరోజు సమాజంలో జరుగుతున్నదేమి? జీవనపోరాటం కాక జగత్తంతటిపైనా ఆధిపత్యం సాధించాలనే తృష్ణతో స్వార్థపూరితమైన ఆలోచనలతో కనిపించిందంతా దోచుకొని తినే ప్రమాదకరమైన వ్యక్తులు అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. ధనదాహం , అధికారదాహం అనే రోగానికి గ్రస్తులై ఎంతకైనా తెగించి స్వంత దేశస్థులనే అధోగతి పాల్జేస్తున్నారు. పరాయి వాళ్ళ మీద కూడా తలపెట్టని, కూడని విధ్వంసమంతా స్వంత వాళ్ళమీదనే చేస్తున్నారు. విదేశీయులు మనమీద దాడి చేసినపుడు గాని, దొంగదారుల్లో అధికారపీఠాలు ఎక్కినపుడు గానీ భారతీయులు ఎంతో ధీరత్వం, శూరత్వం ప్రదర్శించి జయించినారు.
        స్వదేశీయులే మాటలగారడీతో నమ్మబలికి చిత్రవిచిత్రమన పథక రచన చేసి సర్వనాశనం చేస్తుంటే సహనం వహించినారు కొంతకాలం. ఇంకెంతకాలం సహిస్తారు? దేవుని దయవలన ఎన్నోదేశాల్లో లేని ప్రకృతివనరులు, మానవ వనరులు , అద్భుతాల్ని సృష్టించ గల మేధావులు మన దేశం లో ఉన్నా అభివృద్ధి ఏదీ?
 అసలు మన దేశం అనే భావన ఉంటే కదా ముందుకు ఆలోచనలు చేయగలిగేది?
అభివృద్ధి అంటే తెలిస్తేనే కదా అమలు చేయగలిగేది?
అభివృద్ధి అంటే రైళ్ళు, రోడ్లు, పలు అంతస్తుల మేడలు, సబ్సిడీల లంచాలు కాదు. పథకాల పేరుతో మోసాలు కాదు. అధునాతనమైన పరికరాలు కాదు.
అభివృద్ధి అంటే స్వయం సమృద్ధి.
అభివృద్ధి అంటే అందరి అన్ని అవసరాలూ తీరడం. సౌకర్యాలు కలిగించడం కాదు.
అభివృద్ధి అంటే మనదగ్గర ఉన్న దాన్ని పెంచి పోషించుకోగలగడం అంతే కానీ కొండలున్నా కరిగించి తినేయడం కాదు.
ఇంట్లో పిల్లలకు నచ్చుతాయని ఎప్పుడూ బేకరీ తిండ్లు, తీపి పదార్థాలతో కడుపు నింపుతూ, ఇరవైనాలుగు గంటలూ టీవీ ఇంటర్నెట్టు ఇతర దుర్వ్యసనాలతో పొద్దు పుచ్చనిస్తే వాడి అభివృద్ధి జరిగినట్టేనా? కాదు. వాడి శరీరం రోగభరితం అవుతుంది. వాడిమనసు క్రూరమైతుండి. వాడి తెలివి మసక బారుతుంది.
పెద్దవాడై అష్టకష్టాలూ పడతాడు.
అలాక్కాక వాడికి తగినంత వినోదము కల్పిస్తూ మంచిచెడులు బోధిస్తూ లోక జ్ఞానమూ తెలిసేలా చేస్తూ, ప్రేమను అందిస్తూ తెలివికి పదును పెడుతూ ఉంటే, పెద్దవాడై వాడు సుఖపడతాడు. నలుగురి కి ఉపయోగపడతాడు. మంచి పేరు తెచ్చిన సంతోషంతో శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా నిలిచి అందరికీ ఆదర్శప్రాయుడైతాడు.
పై రెండు దారుల్లో ఏదారిలో పెంచాలన్నా పెంచేవాళ్ళకు కష్టపడవలసే వస్తుంది. కానీ ఫలితం ఏది మంచిది అని ఆలోచించాల.
మొదటిది మంచిది అనుకొనేవాళ్ళకు కొడుకు మీద ప్రేమకన్నా తమ ప్రేమ కొడుకు, ప్రపంచానికి తెలియాలన్నదే ముఖ్యంగా ఆ ప్రేమ ప్రదర్శనపు ఆరాటంలో పడి అసలు ప్రేమను ఎక్కడో విడిచి పెడతారు.
రెండవదే మంచిది అని నిర్ణయించుకోవాలంటే వాడిమీద నిజమైన ప్రేమ ఉండాల. నా స్వంత కొడుకనే భావన ఉండాల. వాడి అభివృద్ధిని మనసారా కాంక్షించాల.
ఇక్కడ ప్రేమ ప్రదర్శన ముఖ్యం కాదు. ఆప్రేమ కొడుకు విజయంలో వాడికి అన్ని విధాలా తోడ్పడాలన్నదే ముఖ్యం. అపుడు ప్రదర్శన మీద మోజు పోయి నిజమైన తోడ్పాటు ను అందించగలరు.
ఇదే దేశానికీ వర్తిస్తుంది. ఎప్పుడైతే ఈ దేశం  మనది, ఈ దేశం నాది అనుకుంటామో అప్పుడే  ఈ దేశం సమైక్యతను గురించీ, అభివృద్ధి గురించీ ఆలోచించగలము, మాట్లాడగలము.
దేశమంతా ఒక్కటే అందరు దేశవాసులు నా వాళ్ళే అనుకున్నపుడు బుజ్జగింపు ధోరణులు, మసిపూసి మారేడుకాయలు చేయడాలూ ఉండవు. దేశంలోని సహజ వనరులైన ప్రకృతి వనరులు, మానవవనరులు దుర్వినియోగం కాకుండా ఆపగలిగే సంకల్పం ఉండాల.
అంటే భూమిపైన ఉన్న భాగాన్ని, లోపల ఉన్న గనులను అక్రమంగా అమ్ముకొనే వాళ్ళను కట్టడి చేయాల. అపుడే దేశానికంతా భూమి పైభాగమూ, లోపలిభాగమూ ఉపయోగపడుతుంది. నల్లధనాన్ని కన్వర్ట్ చేయడానికి పరిశ్రమల పేరుతో భూములను అక్రమంగా కొని వృథాగా పెట్టడమూ, లేదా లోపలి వరకూ గనులు త్రవ్వి ఖనిజాలను అంటే అత్యంత విలువైన ముడిసరుకును  విదేశాలకు అమ్మడం ఆపాల.
ముడిసరుకు అమ్మకుండా భూమిపైన పరిశ్రమలు పెట్టి వాటిని ప్రాసెస్ చేయగలిగితే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. తయారైన సరుకును విదేశాలకు చట్టపరంగా అమ్మితే మరింత లాభమూ, ప్రపంచ వ్యాపారరంగంలో పేరూ నిలుస్తాయి.
నీటివనరులను ఎక్కువైన చోటినుంచి తక్కువైన చోటికి కాలువలుగా పారించి, అన్ని వైపులా సస్యశ్యామలం చేయగలిగే విధానాలెన్నో శ్రీ స్వామినాథన్ వంటి వారు చెప్పినా పట్టించుకోకపోతే అభివృద్ధి ఎట్ల సాధ్యమైతుంది?
ఏ ఆనకట్టనైనా సంకల్పం వరకే అటు తర్వాత వచ్చే నిధులన్నీ మింగే వాళ్ళ నోళ్ళలోనికే పోతున్నాయి.
పెద్ద రాజకీయ నాయకులు, శ్రీమంతులు, ప్రభుత్వ భవనాలో వృథా గా పోయే విద్యుత్తుని ఆదా చేస్తే సామాన్యుడికి విద్యుత్కోత బాధలేకుండా చేయగలిగే మేధావులు మనకున్నారు. వారిమాట ఒప్పుకొనే నేతలే లేరని పుస్తకాలకు పుస్తకాలు అవినీతి కుంభకోణాల గురింఛి వ్రాసి ప్రచురిస్తున్న ప్రభుత్వ ఉన్నతోద్యోగులను చూస్తే తెలియడ లేదా?
ఈ విధంగా భూమి , నీరు , నిప్పులను అన్యాయంగా వ్యర్థం చేస్తున్న వ్యవస్థ పోవాల.
యువతరం లో ఉత్తేజం కలిగించాల. దేశభక్తి భావనను రగుల్కొల్పాల. మనదేశం బాగుపడాలని మది నిండా ఆకాంక్షించే వారే నిజమైన మార్పు తేగలరు.

మనదేశానికి ప్రధానమంత్రి కాబోతున్న శ్రీ నరేంద్రమోడీలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. అతడు మాత్రమే కాక అతన్ని వెన్నంటి నడచే యువత కూడా మన దేశాన్ని అభివృద్ధి , స్వీయసమృద్ధి బాటలోకి నడిపించబోతున్నది.
భాజప ఆదర్శాలు, ఆచరణ వల్ల మొదటినుంచీ ప్రభావితురాలినైనా రాష్ట్రం విడగొట్టిన తీరులో వారి పాత్ర వలన ఆ పక్షం మీద ఆరాధన లేకపోయినా నరేంద్రమోడీ నాయకత్వం మీద నమ్మకముంది. అతడు చేసి చూపించిన అభివృద్ధి ఆశలు పెంచుతున్నది.
భారత పునర్నిర్మాణం మనందరి చేతుల్లో ఉంది. దేశభక్తుడై భారతీయులందర్నీ ఒక్కతాటిపై నడిపించగలిగే శక్తి సామర్థ్యాలున్న నరేంద్రుని చేయీ చేయీ కలిపి అనుసరించే తరుణం ఇది. దేశాన్ని సర్వతో ముఖాభి వృద్ధి చెందిన స్థితిలో నిలపాలంటే నరేంద్రమోడీ ని గెలిపించాలని మిత్రులందర్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.

20, మార్చి 2014, గురువారం

విద్వేష రాగాలు

     శుభాన్ని ఆశించడం, శుభాకాంక్షలతో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమూ, ఆచరణయోగ్యమూ అయినటువంటి స్వభావ లక్షణము అనిపించుకుంటాయి.
        సార్వజనీనమైన జీవనము గడిపేవారు, సమాజం గురించి ఆలోచించి, తపించి, సమాజాభివృద్ధి చేయాలనుకొనే వారు పై విధముగా తమను తాము మలచుకోవాల గానీ ఎంతసేపున్నా ద్వేషాలను రగిలిస్తూ అందరి దృష్టీ తమమీద పడాలని కోరుకొని తదనుగుణంగా ప్రవర్తించడం మంచిది కాదు. ఇన్నాళ్ళూ నోటికొచ్చిందల్లా హద్దూ అదుపూ లేకుండా మాట్లాడి, ఋజువులే లేని నిరాధార ఆరోపణలు, నిందలు మోపి తిట్టి తిట్టి పోసి  ప్రజల మనసులను భూభాగాలను ముక్కలు చేసినది చాల్లేదని ఇంకా ఎందుకీ ద్వేష రాగాలాపన? అంటే ఒక్కటే ఎన్నికల సమయములో ఈ విధంగా మాట్లాడితే స్వార్థ ప్రయోజనాలు దక్కుతాయి. ఏ పదవులు ఆశించి ఇవన్నీ చేసినారో అవి అందే సమయము. కాబట్టి ఇప్పుడు ఇవి ఆపడం కుదరదు.
      పదవులు దక్కినాక కూడా ఆపడం జరుగదు. ఎందుకంటే అప్పుడు ప్రజలు ఎదుర్కొనే కష్టనష్టాలకు కూడా గతంలో అవతలి వాళ్ళు చేసిన మోసాల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పుకుంటూ ఉంటారు.
ఇంకా ఎన్నేళ్ళో ఈ నీలాపనిందలు ప్రజలందరూ భరిస్తూనే ఉండాల. మా రాయలసీమ, మా తెలంగాణ, మా కోస్తా జిల్లాల వారెవరూ ఈ పరిణామాలతో ఆనందంగా లేరు. ప్రజలెవరూ బయటికొచ్చి ఏ సంబరాలూ జరుపుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. ఉద్యమాల్లో పాల్గొన్న సమూహాలు, కార్యాచరణ సమితులు సంబరాలు జరుపుకున్నారే కానీ సామాన్యులెవరూ సంతోషంగా లేరు.  పదవీలాభాలు తప్ప  ఇంకేమీ ఒరగని ఈ ప్రక్రియలో ఎన్ని లోపాలున్నాయో రాన్రాను బయటపడతాయి.
         రాజుల  రాజ్యాధికార విస్తరణకాంక్ష ను, వారి యుద్ధాలను తప్పుబట్టని వారే లేరు. ఇప్పుడు జరుగుతున్నది మాత్రం అదికాదా? వీలైనంత వరకూ పదవులు, అధికారాలు పొందాలనే కాంక్ష లేని నేతలెందరు? అది దక్కని వారు అసమ్మతులను, ద్వేషాలను పెంపొందించడం సర్వసాధారణము. ఆ ప్రక్రియలో ప్రజల ఐక్యతను దెబ్బదీసి లాభం పొందాలనుకొనే వారు ఆజ్యం పోయడం. ఇంకేముంది? కొత్త రాజ్యాలనేర్పాటు చేసికొని మరీ విస్తరణకాంక్షలను తీర్చుకుంటారు.
     ఇన్నాళ్ళూ ఏ పిల్లల అమాయకపు బలిదానాలనైతే మెట్లుగా చేసికొని పీఠాలెక్కినారో ఇప్పుడు వారినే తృణీకరించడం , కావాలంటే తెలంగాణా రత్న వంటి బిరుదులిస్తాము, ఉద్యోగాలిస్తాము, పరిహారాలిస్తాము కానీ పదవుల్లో భాగం మాత్రం పంచము అనే స్వార్థ పూరిత నిర్లజ్జాకరమైన వ్యాఖ్యానాల్ని వింటున్న సమాజము , కాలము నేర్పబోయే గుణపాఠం గురించి ఎదురుచూస్తూ ఉంది.

2, మార్చి 2014, ఆదివారం

సామాజిక ధర్మం

                             ఏది జయం? ఏది అపజయం? ఏదిఎన్నాళ్ళు? ఈరోజు వచ్చిన ఫోన్ రేపుండదు. ఈరోజున్న మనిషి రేపుండడు. అన్నీ చూస్తూ కూడా ఏదో ప్రపంచాన్ని జయించేస్తున్న భావనలో మనిషి ఎందుకుంటాడు?

                  నేను లేకపోతే ఇది ఆగిపోతుంది. నేను కాబట్టే ఇంత బాగా చేసినాను. ఇంకెవరైనా ఏమి చేస్తారనే అహంకారం ఎందుకు వస్తుంది? ఎగిరిపడుతున్న ఈ శరీరం ఒక దశలో కదలకుండా మంచం పట్టి ఉండబోతుందేమో, ఎవరికి తెలుసు? ఇప్పుడు అట్లున్న వారు కూడా ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలేస్తున్నామన్న భావనతో బ్రతకలేదూ?ఏమయింది చివరకు? మనకెమవుతుందో మనకు తెలుసా? ఎందుకీ మిడిసిపాటు? ఏమి చూసుకొని? ప్రతి నిముషమూ తనను మించిన వారు కనిపిస్తూనే ఉన్నా నాకీ ప్రత్యేకత ఉందని అనుకోకపోతే మనిషి ఎందుకు బ్రతకలేదు?

                        సాధించలేకపోతే , అనుకున్న స్థాయిలో ఏదైనా చేయలేకపోతే ఎందుకు క్రుంగిపోవడం? ఒక చిన్న ప్రశంస కనిపించినా ఎందుకు పొంగిపోవడం. నన్ను గుర్తు పెట్టుకున్నారనగానే , నాకోసం వీళ్ళిది చేస్తారు, చేసినారనగానే ఎందుకంత సంతోషం? ఏది నిజం , ఏదబద్ధం? కనిపించినదానికి ఆ పక్క ఏముంది? అది తెలిసేవరకూ తుళ్ళిపడడం, తెలిసింతర్వాత కుళ్ళుకోవడం ఏదైతే నాకోసం/నాది/ నావల్ల అనుకున్నామో అది కాదని మిగతా వారికోసమంటే తెలిసింతర్వాత  కుళ్ళుకుంటారు కదా!

                        రాజకీయాల్లో ఉన్న వాళ్ళని అనడం ఎందుకు? వాళ్ళు డబ్బు అధికారం కోసం చేసేది మిగతా అందరూ మంచితనమనుకున్నదానికోసం చేస్తున్నా ఏది ఉంటుంది? ఎన్నాళ్ళు అనే ప్రశ్న అన్నిటికన్నా పెద్దది. ఏది మంచి ఏది చెడు అనేది ఎవరు నిర్ణయిస్తారు? ఏ ప్రాతిపదిక మీద? మంచి కి చెడుకు మధ్య ఒక చిన్న నూలుపోగంత తెర ఉన్నసందర్భాల్లో ఆ జవాబు ఇచ్చేదెవరు? అన్ని దేశకాల మాన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ, ప్రతి ప్రాంతానికీ, ప్రతి కాలానికి మారే ధర్మం యొక్క రూపురేఖలేమవి? అందరికీ వర్తించే సామాజిక ధర్మమేది?

                     సామాజిక ధర్మాన్ని అనుక్షణం కాపాడే వ్యవస్థ కాలం చెల్లిపోయింది. ఎక్కడో అక్కడా అక్కడా ఉన్నా మొత్తంగా అందరూ అంగీకరించే ఒక వ్యవస్థ ఇంక లేదా? అటువంటిదే సమాజాన్ని రక్షణ కవచంగా తన కర్తవ్యాన్ని నిర్వహించి సమాజాన్ని కాపాడుతుంది. హెల్మెట్ ధరించడం ఇబ్బందిగా ఉందనో, అందం కనిపించదనే ఒక మాయలోనో పడి విడిచిపెడితే,పడితే.. ఏమవుతుంది? అదే మనము సామాజిక ధర్మాన్ని విడిచి పెట్టడం వలన వచ్చిన నష్టము. ఆచారవ్యవహారాలు పాటిస్తూ సాటిమనిషి కష్టసుఖాల్లో భాగం పంచుకుంటూ, మంచి చెడు ల విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించే మంచి అలవాటున్న సమాజాన్ని స్వంత సుఖము, విశృంఖలత్వం, వ్యాపారదృష్టి తో నిరంతరమూ నాకెమి వస్తుందనే ధొరణి పెంచుకున్నాక సామాజిక ధర్మం అనేది నశించిపోయింది. ఇప్పుడు అన్యాయాలు జరుగుతున్నాయో అంటూ గోలపెట్ట్డడం కన్నా, కవచం వంటిది, జనబాహుళ్యానికి ముఖ్యమైనదీ అయిన హెల్మెట్ వంటి సామాజిక ధర్మాన్ని అవతలపెట్టి వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయం.తప్పునితప్పు అని చెప్పేవాళ్ళెవరూ ఇక్కడ లేరు.ప్రతి తప్పుకీ మూలకారణాన్ని అన్వేషించి సమర్థించుకో దలిస్తే మంచి నుంచి చెడుని వేరుగా తీసి పెట్టగల నైపుణ్యం కొరవడుతుంది. సమాజం యొక్క అస్తిత్వం రూపురేఖలు లేకుండా మాసిపోతుంది.
అటువంటి పరిస్థితిని తెచ్చుకోక ముందుగా మేలు కుంటే బయటి సమాజానికి , లోపలి యజమానికి ఋణం తీర్చినవాళ్ళమవుతాం.

19, నవంబర్ 2013, మంగళవారం

ప్రాచీన సాహిత్య శోధన మరియు నవీన సాహిత్య కల్పన

         ఆంగ్ల భాష మీది వ్యామోహమో లేక కూడు పెడుతుందనో ఒక తరం వాళ్ళంతా నేర్చుకోవడానికి/నేర్చుకోలేదని తపించి పోయినారు. తమ తరువాతి తరం వాళ్ళను ఎంతో శ్రద్ధగా తమ జీతాలను,జీవితాలను బలి పెట్టి మరీ ఆంగ్లాంధ్రులను/భారతీయామెరికనులను తయారు చేసి ఎంతో మురిసి పోయినారు. లాభపడి నారు. అంతా బానేఉంది కానీ, ఈ ప్రక్రియ లో భారతీయ ఆత్మను, స్వభాష లను తెలిసి కొంత తెలియక కొంత నిర్లక్ష్యము చేసినారు. ఇప్పుడు కూడా మేలుకోకపోతే చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడమే ఐతుంది.
           ఇప్పుడు కూడా మించి పోలేదు. చదువుకుంటున్న పిల్లలకు తమ భాష లో పట్టు ఉన్నా లేకపోయినా వద్దనే వ్యతిరేకత మాత్రం లేదు. (పోయిన తరాలలో ఉన్నంత వ్యతిరేకత  లేదు.) కాబట్టి  రాష్ట్రాలలో స్థానిక స్థాయిలో సాహిత్యాన్ని తద్వారా చరిత్రను రక్షించుకొనే ప్రయత్నం చేయాల. సాహిత్యం రూపురేఖలు , దృష్టికోణాలు , భావజాలాలు నచ్చినా, నచ్చకపోయినా కూడా కనీసం రక్షించుకోవాల.
      ఇప్పటికే జరిగిన ఆలస్యం వలన ప్రాచీనత కోసమే ఋజువులు చూపించుకోవాల్సి ఉంది. ఇప్పటికైనా ఒక విశ్వవిద్యాలయము కేవలం ప్రాచీన సాహిత్య శోధన మరియు నవీన సాహిత్య కల్పనల కోసమే ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో కళాశాల పనులు , వాటి పరిపాలనాంశాలు వీటికోసం సమయం వ్యర్థం చేయడం లేకుండా ముద్రణ నోచుకోని డిమాండ్ ఉన్న , నాణ్యత ఉన్న గొప్ప రచనలను ముద్రించడము, ముద్రణలో ఉన్న వానికి వ్యాఖ్యానాలు, విమర్శలు వ్రాసేవారిని ప్రోత్సహించడమో చేయాల. ఇప్పటికే ఉన్న ప్రముఖ పండితులతో శోధనా కార్యక్రమాలకు అవసరమైన సహాయాన్ని తీసుకోవడము, కాలయాపన జరిగి ఆ తరం వెళ్లి పోక ముందే విలువైన శాసనాదుల భాషను పరిష్కరించడము వంటి పనులను పూర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఇవన్నీ అమలులో ఉన్న ఇతర రాష్ట్రాల పనులను చూసి నేర్చుకోవాల్సి ఉంది. తంజావూరు సరస్వతీ మహల్ లో ఉన్న ఆనాటి గ్రంథాలను తెప్పించి జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాల.
ఆసక్తి అవకాశము ఉన్న పక్క రాష్ట్రాలలో కూడా తులనాత్మక పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. మండలి బుద్ధప్రసాద్ గారు, మరి ఇతర పెద్దలు భాషా విషయాలలో ఆసక్తి , భక్తీ శ్రద్ధ చూపగల వారు అధికారం లో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగక పోతే ఇంకెప్పుడు జరుగుతాయి?

10, ఫిబ్రవరి 2013, ఆదివారం

దేశం మీద ప్రేమ , బాధ్యత ఉండడం అంటే ఇదీ!

 
        ఢిల్లీలోని ఒక శ్రీరామ్ కళాశాల లో రాహుల్ కి బదులుగా శ్రీ నరేంద్రమోడీ గారిని విద్యార్థులు ప్రసంగించడానికి ఎంచుకున్నారంట.వారు ఏ సొల్లు కబుర్లు లేకుండా, యువతరాన్ని స్ఫూర్తితో నింపే విధంగా ప్రసంగించారు.

         శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రసంగం సారమున్న ప్రసంగం. ప్రతి మాట ఉపయోగకరమైనది.   పనిచేసే పనిచేసే,ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ముందుకు అడుగులేయించే ఇలాంటి నాయకులు ప్రతిచోటా ఉండాలి.
 సబ్సిడీల భిక్ష రెండు రోజులు వేసి మూడోరోజు చేతులెత్తేసేవాళ్ళు కాదు.


http://www.youtube.com/watch?v=0xTkKB3oNb4

         ఈరోజు అందరూ గుజరాత్ గురించి మాట్లాడుతున్నారంటే దాని వెనుక మా అందరి కృషి ఇది అని , మా ఆలోచన విధానం ఇట్లా ఉంది అని చెపుతూ వచ్చారు.
గుజరాత్ లో విశ్వవిద్యాలయాల సంఖ్య పెరిగింది. అది ఎట్లా అంటే.....ఊరికే సంఖ్య పెరగడం కాదు.

          రక్షకభటుల నియామకాల్లో పొడవు, వెడల్పు, ఇంకా కొన్ని పరీక్షల ద్వారా కాకుండా మొత్తం ఆటిట్యూడ్ పెంపొందించేటట్లు గా అభ్యర్థుల్లో ఉండాలని గుజరాత్ లోవిశ్వవిద్యాలయం ఉంది. పదో తరగతి అయినప్పుడే అక్కడ చేరి పూర్తి ఐదేళ్ళ కోర్స్ అక్కడ చేయవచ్చు. చట్టానికి సంబంధించిన విషయాలతో సహా పోలీస్ నియామకానికి సంబంధించిన చదువు చదవవచ్చు. ఎంతో గొప్ప విషయము.

       ఇంకా విద్యాబోధనకు సంబంధించి ఒక విశ్వవిద్యాలయము, ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడినపుడు ఎంత అథారిటీ తో మాట్లాడినారో, విజన్ తో మాట్లాడినారో విని తీరాల్సిందే.
 మనది బీద దేశం కాదు. మనకు ఉన్న వనరులు మనం సక్రమంగా వాడుకోవాలని, ప్రతి కార్యక్రమము ప్రో పబ్లిక్ గా ఎట్లా ఉండాలో, గుడ్ గవర్నెన్స్ విజన్ ఎట్ల ఉండాలో చెప్పినారు.

          ఒక ట్రైబల్ మనిషి ఆలోచన కూడా ఎంత వైవిధ్యంగా, నూతనంగా ఉండగలదో ఉదాహరణతో చూపించినారు.
  ఒక గ్రామంలోని ఒక నిరక్షరాస్యుడు ఎంత ఆత్మవిశ్వాసంతో తన గ్రామానికి అతిథిగా వచ్చిన  క్లింటన్ తో ఇంకా మా దేశాన్ని మీరు పాతకాలపు వెనుకబడ్డ దేశంగా భావిస్తున్నారా అని మాట్లాడిన విషయాన్ని
సంతోషంగా ఉదహరించారు.

         ఆఫ్ఘనిస్తాన్ లో టమాటాలు, మీ ఢిల్లీలోని చాయ్ తాగితే పాలు, ఢిల్లీ లోని మెట్రో ట్రైన్ లో కోచ్ లతో సహా గుజరాత్ నుంచి మేము పంపుతున్నామన్నారు.
మనం అభివృద్ధి చెందాలంటే స్కిల్, స్కేల్, స్పీడ్ మూడు విషయాలపై రాజీ పడకూడదన్నారు.
స్కిల్ లో జీరో డిఫెక్ట్, స్కేల్ లార్జ్ స్కేల్, స్పీడ్ అంటే సమయాన్ని వృథా చేయరాదు.

              పదహైదేళ్ళక్రింద తైవాన్ కి పోయినప్పుడు (ఇంకా ముఖ్యమంత్రికాకముందే) ఒక ద్విభాషి (ఇంటర్ప్రెటేటర్) మోడీ గారిని అడిగారట. ఇంకా భారతము పాములు పట్టే స్థాయిలోనే, (మూఢనమ్మకాల స్థాయిలోనే) ఉందా అని.
మోడీ గారి జవాబు

         "అబ్బే ఇప్పుడు అంత స్థాయి కూడా మాకు లేదు. మేము ఇప్పుడు ఎలుకలు పట్టే స్థాయిలోనే ఉన్నాము.
అంటే మౌస్ లు పట్టే స్థాయి. మౌస్ లు పట్టి న మా యువజాతి ఇరవై ముప్ఫైల్లో ఉన్న మా భారతీయులు మౌస్ పట్టి ప్రపంచంలో భారతదేశమంటే ఏమిటన్నది నిరూపించారు. మీరు చేసినారా పని. ఏ రాజకీయనాయకుడూ భారతమాతకు తేని ఖ్యాతి మీ యువతరం తీసుకొచ్చింది. " అన్నారు.


             సగం నీటితోనూ , సగం గాలితోనూనిండి ఉంది  , కాబట్టి పూర్తి లోటా నిండి ఉన్నదని చెప్పిన శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రసంగం సారమున్న ప్రసంగం. ప్రతి మాట ఉపయోగకరమైనది. మాటల్లో చమత్కారాలకూ లోటు లేదు.  పనిచేసే,ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ముందుకు అడుగులేయించే  ఇలాంటి నాయకులు ప్రతిచోటా ఉండాలి.
 సబ్సిడీల భిక్ష రెండు రోజులు వేసి మూడోరోజు చేతులెత్తేసేవాళ్ళు కాదు.

               అంత నిమగ్నమై మాట్లాడుతూ కూడా అరగంటకే ఇచ్చిన సమయం ముగిసిందా అని చూసుకోవడం, సమగ్ర అభివృద్ధి గురించి, ఈ దేశపు వనరుల గురించి, మానవ వనరుల గురించి అంత నమ్మకంగా, గౌరవముంచి నిరూపించి మాట్లాడే రాజకీయనాయకులున్నారా? మామూలు మనుషులు కూడా ఇది ఇండియా అని తేలికగా మాట్లాడుతారు. మోడీ గారికి నమస్కారములు.

"గోదారి" అనే బ్లాగ్ లోనేనీ రోజు ఈ ప్రసంగం లంకె చూసి పూర్తి ప్రసంగం విన్నాను. వారికి నాకృతజ్ఞతలు.

10, అక్టోబర్ 2012, బుధవారం

మేరునగతప్పిదం -వరుస టపాలు

కడుపు నిండా వేళ తప్పకుండా భోజనం దొరుకుతుంటే ఆకలి అంటే తెలిసే వీలే లేదు.
నీడలో కూర్చున్న వారికి మాడ్చే ఎండ లో పని చేసే వాళ్ళ కష్టం తెలిసే వీలే లేదు.
ఇట్లా వ్రాసుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు.

               దేశం మనది, మన భారత దేశాన్ని మనమే పాలించుకోవాలని, మన ప్రజలను ఎక్కణ్నించో వచ్చి సంస్కృతి పరంగా పూర్తి అపరిచితుల చేతుల్లో మనము, ముందుతరాలు బాధలు పడకూడదని మన పూర్వీకులెంతగానో శ్రమించారు. వాళ్ళల్లో ఇద్దరి ముగ్గురి గురించైతే పాఠాల్లో చదువుకుంటూ ఉంటాము.

              కానీ మారిన పరిస్థితుల్లో అప్రకటిత యుద్ధాలు చేస్తున్న పొరుగు రాజ్యాల కుతంత్రాలకు బదులు చెప్తూ, బలి అవుతూ ఉన్న మన సైనిక సోదరుల గురించి మనకెంత తెలుసు? వారు రోజువారీ సమస్యలను ఎదుర్కొంటూ, శత్రువులను కూడా ఎదుర్కొంటూ దేశాన్ని రక్షించటానికి ఎట్లాంటి వాతావరణంలో ఉన్నారో మనకేమాత్రం తెలుసు?

                   హిమగిరి సొగసుల గురించి ఎంతచెప్పినా తనివి తీరదంటారు. మనకు పెట్టని కోట అంటారు. భరింపరాని చలిలో , విరిగిపడే కొండ చరియల మధ్యలో, బాగుపఱచని, కొండొకచో అసలు వేయని మార్గాల్లో ప్రయాణిస్తూ ఎన్ని సైనిక దళాలు సరిహద్దుల్ని చేరుకోటానికి ప్రయాస పడుతున్నాయి? యుద్ధం చేయడం మాత్రమే కాక , వారికి రోజూ కావలసిన వంట పదార్థాలు, సామగ్రి తీసుకొని పోవడానికి అదనపు మనుషులు లేక వాళ్ళే అన్నీ ఎట్లా చేసుకోగలుగుతున్నారు? హెలికాప్టర్ ల నించీ విసరడం ద్వారా అందే సామాగ్రి ఎంత వరకూ వాళ్ళని చేరుతున్నాయి?
                        ఈ బాధలన్నీ కాక సరిహద్దు ప్రాంతాల్ని మ్యాపుల్లో చూడడం తప్ప ఇంకెలాంటి పరిచయం లేని రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం నోటికి వచ్చిన ప్రతిపాదనలను, వాగ్దానాలను చేస్తున్నపుడు వాటిని పూర్తి చేయడానికి ఎటువంటి సదుపాయాలూ మాకు లేవు మొఱ్ఱో అని నివేదికలను పంపిస్తే వాటిని పట్టించుకునే అధికారులు, మంత్రులు , ప్రధానులు, రాష్ట్రపతులు మనకు లేరే?

ఎందుకీ అలసత్వం? ఎందుకు ఈ తరం పాలకులు ఇంత స్వార్థమతులయినారు?

             చైనాతో యుద్ధం వచ్చిన నాటి పరిస్థితులను వివరిస్తూ  బ్రిగేడియర్ జే.పీ. దాల్వి వ్రాసిన హిమాలయన్ బ్లండర్ అనే పుస్తకంలోని కొన్ని అంశాలను వివరిస్తూ మేరునగతప్పిదం అనేపేరుతో మన బ్లాగర్ సుబ్రహ్మణ్య చైతన్య గారు వ్రాస్తున్న వరుస టపాలను చదవండి.
వారికి నా ధన్యవాదాలు.