Loading...

14, ఏప్రిల్ 2018, శనివారం

ఓర్వబోకుమా!

కర్కశమానసులకు, కటు
మర్కట బుద్ధులకు కఠిన మరణము విధిగా
నర్కుని యుదయము లోపల
తర్కములాడక విధింప తామసమేలా?

ధర్మపు మార్గమున్ విడచి తామసబుద్ధిఁ బ్రజాళినిట్టులే
మర్మమెఱుంగజాలరని, మాయల నుచ్చుల వ్రేల్చునట్టి దు
ష్కర్మలఁ జేయగాఁ దలచు క్రౌర్యముఁ జూపెడు వారికి, నదే
దుర్మతితోడఁ దోడ్పడెడు దుష్టులనెప్పుడు నోర్వబోకుమా!

కిలకిల నవ్వుతో, పలుకు కీరముఁ బోలెడు బాలలిద్ధరన్
పలువుర దీవనల్ బడసి భద్రమునుండగ కోరుకొందమీ
యిల గల తావులెల్లెడల నెక్కుడు క్షేమము నుండ పెద్ద వా
రలు కడు శ్రద్ధతో మసలి రక్షణఁ జేయగ శక్తి కావలెన్.
----

2 వ్యాఖ్యలు:

 1. మిత్రమా దీనర్థం మాకు తెలియటం లేదు. దయచేసి దీని తాత్పర్యం చెప్పగలరని మనవి చేసుకుంటున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మిత్రమా! వీటి తాత్పర్యం ఇది -

  కఠినమైన మనస్సు ఉన్నవారికి, చంచలమైన మనస్సు గల వారికి (వారు చేసిన నేరములకు) తెల్లవారేలోపల కఠిన శిక్షలు విధించక వాదనలలో (కోర్టులలో) సమయము వృథా చేయనేల?
  సరైన మార్గం విడచి దుర్బుద్ధితో అమాయకప్రజలను మాయచేసి ఉచ్చులో పడవేసేటటువంటి క్రూరులను , అదే బుద్ధితో వారికి సహాయపడేవారిని ఓర్పుతో మన్నించడం తగదు.
  కిలకిల నవ్వులతో చిలుకపలుకులతో బాలలు ఈ భూమిమీద అందరిదీవనలతో భద్రంగా ఉండాలని కోరుకుందాము. ఈ భూమిమీద ఎక్కడైనా సరే వారిని జాగ్రత్తగా కాపాడగలిగే శక్తి పెద్దలకు కావాలి.

  ప్రత్యుత్తరంతొలగించు