Loading...

7, ఫిబ్రవరి 2018, బుధవారం

బోన్ 'సాయమా?' గాయమా?

          అప్పుడెప్పుడో అస్సామీ కవితను  అనువదించి పంపితే ఆంధ్రభూమి లో 2016 నవంబరు 13 నాడు ప్రచురింపబడింది.

ఈ పాత కవితను గుర్తు తెచ్చినవారికి కృతజ్ఞతలు.

     వృక్షాన్ని దైవసమానంగా పూజించడం ఒకటైతే, మనలాగే ప్రాణమున్న దానిగా భావించడం నాకు ఎక్కువ ఇష్టం. మొక్కలు, చెట్లు తమ ఆకులు, కొమ్మలతో పలకరిస్తాయి నీళ్ళు పట్టేటపుడు.
       అటువంటి కొమ్మలను త్రుంచడానికో ఇలా వంచడానికో ఆలోచించి బోన్ సాయ్ అంటూ కావాల్సినంత భూమి ఉన్న దేశాల్లో కూడా మానుగా పెరగవలసినదాన్ని పొట్టిగా కుండీల్లో పెంచే వారి పై అస్సామీ కవి దేవ్ ప్రసాద్ తాలూక్ దార్ గారు ఈ కవితాస్త్రాన్ని సంధించారు.
         నా అనువాద కథ ప్రచురింపబడిన సాహిత్య అకాడమీ వారి మాసపత్రిక 'సమకాలీన భారతీయ సాహిత్య' లోనే ఈ కవిత యొక్క హిందీ అనువాదం చూసి, నా భావాలకు దగ్గరగా ఉండడం చూసి తెలుగులోకి అనువదించాను.
లింక్ ఇదీ.

http://www.andhrabhoomi.net/content/sahiti-263

వేర్లు

వేళ్లను కాళ్లు చాచుకోనీ హాయిగా
బోన్‌‘సాయ’మా? అది గాయమా?
చిగురుటాకులు, చిట్టిరెమ్మలు
చేతులు చాస్తూ
గగన శ్రేణులనెక్కుతుంటే
మురిసిపోనీ
కళ్లతో చూడలేకపోతే పోనీ
నీళ్ల బాసలాడనీ!
చిగురుటాకులు చిట్టి రెమ్మలు
గాలి వాటుల పాటపాడగా
తాము చూడని వేళ్ల మేళ్లను వేనోళ్ళ పొగడగా
మనసు తీరగా పెరగనీ
మట్టి లోతులను అందుకోనీ!
రంగురంగుల పళ్లు పువ్వుల
నిండు జగతిది కానరానిది
తాము చూడగా లేకపోయినా
జనుల కనులకు వేడ్క గూర్చుచూ
సంతసించనీ!
అస్సామీ మూలం: దేవ్ ప్రసాద్ తాలుక్ దార్ తెలుగు అనువాదం: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి

******
వేర్ల వైపు నుంచి వ్రాసినట్టుగా - చిగురుటాకులు రెమ్మలు ఆకాశంవైపు పెరుగుతుంటే కళ్ళారా చూళ్ళేకపోయినా నీళ్ళందించి వేళ్ళు తృప్తి పడనీ, తాము అసలే చూడని వేర్లు  చేసే మేలును కొనియాడుతూ అవి పెరగనీ, తమ కు జన్మ ఇచ్చిన మట్టిని వేళ్ళద్వారా అందుకోనీ  అని అర్థం.

4 వ్యాఖ్యలు:

 1. కవిత బాగుందండి. “బోన్సాయ్” ఒక దారుణమైన ప్రక్రియ. నిషేధించదగిన సోకాల్డ్ కళ అని నా అభిప్రాయం కూడా.

  ఇదే అంశం మీద మా ఆఖరి తమ్ముడు విన్నకోట రవిశంకర్ “కుండీలో మర్రిచెట్టు” అనే కవిత 1983 లో వ్రాశాడు. తన కవితల సంకలనానికి కూడా ఇదే పేరు పెట్టాడు. తరవాత ఈ కవిత “ఈమాట” వెబ్ పత్రికలో కూడా వచ్చింది. ఆ లింక్ ఈ క్రింద ఇస్తున్నాను. వీలయితే చూడండి.

  http://eemaata.com/em/library/kumdilo/311.html

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ధన్యవాదాలండి. అదే బాధతో అనువదించాను.
  మీరిచ్చిన లింకు తప్పకుండా చూస్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఆర్ద్రమైన కవిత. చెట్ల స్వత్వాన్ని అంతంచేసే క్రియను కళ అనడానికి మనసొప్పదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. బాగా చెప్పారు, ఈ క్రియను కళ అనలేం.
  కవిత చదివినందుకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు