Loading...

14, ఆగస్టు 2012, మంగళవారం

శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై ....

శ్రీలు పొంగిన జీవగడ్డయి   పాలు పారిన భాగ్యసీమయి  
వరలినది ఈ భరత ఖండము,  భక్తి పాడర తమ్ముడా !(2)

వేద శాఖలు వెలసెనిచ్చట  ఆదికావ్యం బలరె నిచ్చట |
బాదరాయణ పరమఋషులకు పాదు సుమ్మిది తమ్ముడా ||శ్రీలు పొంగిన||

విపిన బంధుర వృక్ష వాటిక  ఉపనిషన్మధువొలికెనిచ్చట |
విపుల తత్వము విస్తరించిన  విమల తలమిది తమ్ముడా || శ్రీలు పొంగిన||

సూత్ర యుగముల శుద్ధ వాసన క్షాత్ర యుగముల శౌర్య చండిమ
చిత్ర దాస్యము చే చరిత్రల చెరిగిపోయెర తమ్ముడా || శ్రీలు పొంగిన||

మేలి కిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమెత్తి
పాలతీయని బాలభారత పథము పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||

దేశగర్వము దీప్తి చెందగ దేశచరితము తేజరిల్లగ |
దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా || (శ్రీలు పొంగిన)||

పాండవేయుల పదునుకత్తులు మండి మెరిసిన మహితరణ కధ |
కండగల చిక్కని పదంబుల కలిపి పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||

                                                 ---రాయప్రోలు సుబ్బారావు.

ఈ పాట ఇక్కడ వినండి.

8, ఆగస్టు 2012, బుధవారం

శివవిష్ణు తత్త్వం

పోతన అమితమైన భక్తిభావముతో వ్రాసిన భాగవతములో దశమస్కంధములో చిన్నికృష్ణుడు పెరిగి పెద్దవుతూ ఉన్నప్పుడు ఆటపాటల గురించి, లీలా విలాసాల గురించి చదివేటపుడు మైమఱిచిపోతాము.

            అందులో కూడా శివవిష్ణు తత్త్వం ఒక్కటే, శివునికీ , తనకూ అభేదమన్న మాట చిన్ని కృష్ణుడు ఆయనకు నయనానందకరంగా దర్శనమిచ్చి ఈ విధంగా తెలియజేశారన్న విషయం ఎంత అందంగా ఆయన చెప్పారు
అంటే ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతితో ద్వాపర యుగానికి వెళ్ళిపోయి మనకు వ్యాఖ్యానం చెపుతున్న రీతిలో ఆనందపరవశులను చేస్తూ మనలను ఆలోకాలకు తీసికొని వెళ్ళిపోయే రీతిలో కన్నులకు కట్టినట్టుగా వర్ణించారు.

            ఆ అద్భుతమైన పద్యం, కరుణశ్రీ గారి సంపాదకత్వ బాధ్యతలో, శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు మనకందించిన తాత్పర్యం చదివి తరిద్దాం.

సీసపద్యము:
తనువున నంటిన ధరణీ పరాగంబు
   పూసిన నెఱిభూతి పూఁత గాఁగ
ముందఱ వెలుఁగొందు ముక్తాలలామంబు
    తొగలసంగడికాని తునుక గాఁగ
ఫాలభాగంబుపైఁ బరఁగు కావిరిబొట్టు
    కాముని గెల్చిన కన్ను గాఁగఁ
గంఠమాలికలోని ఘననీలరత్నంబు
   కమనీయ మగు మెడకప్పుగాఁగఁగ

ఆటవెలది:
హారవల్లులురగహారవల్లు గాఁగ
బాలలీలఁబ్రౌఢ బాలకుండు
శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును
వేఱులేమిఁ దెల్ప వెలయునట్లు.

భావము:
ఆటపాటల సమయాలలో బాలకృష్ణుఁడు పరమశివునివలె కనిపించేవాడు. వాని దేహానికి అంటిన దుమ్ము విభూతి పూతవలె కనిపించేది.
ఉంగరాల జుట్టును పైకి ముడిచి ముత్యాలపేరుతో ముడివేసింది యశోదమ్మ. అది శివుని తలపై ఉండే చంద్రవంకలాగా కనపడుతున్నది.
నుదుట నిలువుగా పెట్టిన ఎఱ్ఱని తిలకం మన్మథుని గెలిచిని శివుని ఫాల నేత్రంలాగా కనబడసాగింది.
మెడలో వేసిన రత్నాలహారం మధ్యలో నాయకమణిగా ఉన్న పెద్ద నీలమణి, శివుని కంఠంలోని హాలాహలపు నల్లని మచ్చలాగా కనపడుతున్నది.
మెడలోని ముత్యాలహారాలు శివుని మెడలో సర్పహారాలుగా కనపడుతున్నాయి.
ఎదగకుండానే పెద్దవాడైన విష్ణువు బాలకృష్ణుని అవతారంలో ఈ విధంగా లీలలు చూపాడు. శివుడూ, తానూ ఒకటేసుమా అని హెచ్చరిస్తున్నాడా అన్నట్లు చిన్నికృష్ణుడు శివుని వలె కనిపించాడు.

5, ఆగస్టు 2012, ఆదివారం

బొట్టు పెట్టుకోండి.


నుదుటన ఎప్పుడూ బొట్టు ధరించడం మన ఆచారం.విదేశీ అలవాట్ల మోజులో పడి ఎన్నో వదిలేసిన మనం ఈ అలవాటును , ఆచారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము. దీనికంతటికీ ఆద్యులు మగవారే. ఈరోజు ఆధునిక, అనాగరిక, అసభ్య వస్త్రధారణను, పెద్దలను బాధపెట్టే ప్రవర్తనను, కుటుంబాన్ని లెక్కచేయకపోవడాన్ని, బాధ్యతలను నిర్లక్ష్యం చేయడాన్ని మొదట పోయినతరాల్లో మగవారే అత్యధికంగా చేశారుఅని నా అభిప్రాయం

.              ప్రతి పనీలో ఆలోచనే లేకుండా సమానత్వం పేరుతో మగవారిని అనుకరించే ఆడవారు ఇప్పుడు ఆ పని చేస్తున్నారు అని నా అభిప్రాయం

                  చాలామంది అమ్మాయిలకు చెప్తుంటారు, బొట్టు పెట్టుకోమని. కానీ మగవాళ్ళైనా సరే ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. అది కుంకుమ అయినా సరే, విభూతి అయినా, చందనమైనా ఏదైనా నుదురు ఖాళీగా ఉంచకూడదు. ఖాళీగా ఉంచుకుంటే ఎదుటి మనిషి ఆధిక్యతకు లోబడడం జరుగుతుంది.

              చాలా ఆధునికమని చెప్పుకునే బడులలో బొట్టు పెట్టుకుంటే అనాగరీకమని మౌన ప్రచారం జరుగుతున్నది. ఒకరిని చూసి మరొకరు ప్రభావితులౌతున్నారు. ఈ విధంగా బొట్టు పెట్టుకుని తీరాలన్న నియమం పై పట్టు లేకపోవడంతో ఇంట్లో, బయట కూడా అలాగే తిరుగుతుంటారు. సినిమాల్లో , సీరియల్లో నూ కూడా విలనీ చూపించే వాళ్ళనంతా అత్యాధునికులు గా (నా దృష్టిలో అనాగరీకులుగా) చూపిస్తారు. మొత్తం కథంతా వారి ఆధిక్యతే ఉంటుంది. చివరలో వాళ్ళు మారినట్టు చూపించినపుడు సాంప్రదాయికంగా చూపిస్తారు. చాలామంది మీద ఏ ప్రభావం పడుతుంది చెప్పండి.

                    దైవంపై నమ్మకం ఉంటే ఖచ్చితంగా బొట్టు ధరించండి. బొట్టు ధరించడం వలన మీ అందం ఏమీ తక్కువ కాదు. ప్రత్యేకమైన అందం వస్తుంది. ముఖంలో ఎంతో మార్పు కనిపిస్తుంది.