Loading...

18, జనవరి 2012, బుధవారం

సూర్యుని వర్ణన _ రంగుల జానపదం(వీడియో లంకె)

సూర్య దేవుని అనునిత్యం స్మరించి కృతజ్ఞతలు చెప్పుకోవటంఅదీ సూర్యస్తుతికి ఉత్కృష్టమైన ఈ ఉత్తరాయణ ఆరంభంలో.... సర్వ జీవరాశి కి ప్రథమ కర్తవ్యము. సూర్య దేవుని తెల్లని కిరణములో నుంచి అన్ని రంగులు ఉద్భవించినాయంటారు. అలాంటి సూర్యుడు ఆకాశంలో పొద్దున్నుంచీ సాయంత్రం వరకు ఎన్ని రంగులు చూపిస్తాడో , ఎన్నెన్ని పువ్వులతో వర్ణించారో ఈ పాటలో చూడండి. ఇన్ని రంగుల పూలు ఈ లోకంలో పూస్తున్నాయంటే కారణం ఆ పొద్దు పొడుపు వాడే కదూ!
శ్రీ సాయి పదము వారు పంపించిన మెయిల్ లో వచ్చింది. వారికి , పాడిన లక్ష్మి గారికి ధన్యవాదాలు.

"ఉదయ భానునితో మేలుకొలుపు గా ప్రారంభమైన వర్ణన అస్తమాన బాలునివరకూ  -
ఒక్కొక్క స్థితి లో స్వామి వర్ణాన్ని చెప్పడానికి వాడిన ఉపమానాలు
అద్భుతం.   మాఘ మాసమంతా ఆ సూర్యదేవుని స్తుతి స్తోత్ర మాలికలో  ఇది కూడ
పఠించి సర్వ శుభాలు పొందెదరు  గాక." ఈ జానపదానికి వీడియో క్రింది లింకులో
చూడండి.
http://www.youtube.com/watch?v=4hWpHpwHU3U

శ్రీ సూర్యనారాయణ స్వామి - మేలుకొలుపు పాట

శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ || 2 ||

పొడుస్తూ భానుడూ పొన్న పువ్వు ఛాయ
పొన్నపువ్వు మీద పొగడపువ్వు ఛాయ ||శ్రీ సూర్య ||

ఉదయిస్తూ భానుడు ఉల్లిపువ్వు ఛాయ
ఉల్లిపువ్వుమీద ఉగ్రంపు పొడిఛాయ ||శ్రీ సూర్య ||

గడియెక్కి భానుడు కంబపువ్వు ఛాయ
కంబపువ్వు మీద కాకారీ పూఛాయ||శ్రీ సూర్య||

జామెక్కి భానుడు జాజిపువ్వు ఛాయ
జాజిపువ్వుమీద సంపంగీ పూఛాయ||శ్రీ సూర్య||

మధ్యాహ్న భానుడు మల్లెపువ్వు ఛాయ
మల్లెపువ్వుమీద మంకెన్న పూఛాయ||శ్రీ సూర్య||

మూడుఝాముల భానుడు ములగపువ్వు ఛాయ
ములగపువ్వుమీద ముత్యంపు పొడిఛాయ||శ్రీ సూర్య||

అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయ
ఆవపువ్వుమీద అద్దంపు పొడిఛాయ||శ్రీ సూర్య||

వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయ
వంగపువ్వుమీద వజ్రంపు పొడిఛాయ||శ్రీ సూర్య||

గుంకుతూ భానుడు గుమ్మడిపూఛాయ
గుమ్మడిపువ్వుమీద కుంకంపు పొడిఛాయ||శ్రీ సూర్య||
7, జనవరి 2012, శనివారం

తెలిసినా "తెలుసు" కోలేక.......


లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబుల్ 
ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే దప్ప యితఃపరంబెఱుగ మన్నింపందగున్ దీనునిన్
రావే యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

            గజేంద్రమోక్షం అనే ఘట్టం భాగవతం లో పరమ పావనమైనది. అందునా మహానుభావులు, పూజ్యులు శ్రీ పోతన గారు తెనిగించిన విధానం ప్రత్యక్ష ప్రసారం వింటూ మనం ఊహల్లో దృశ్యాలన్నిటినీ చూస్తున్నట్టుగా ఉంటుంది. భాగవత పద్యాలన్నీ తేనెలు చిందే మాధుర్యంతో పోతనగారు వ్రాశారు. అంతటి మహా భక్తులు వ్రాసిన పద్యాలను మన గురువు గారు పూజనీయులు, ప్రాతఃస్మరణీయులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగాలలో వింటే జన్మ ధన్యమౌతుంది. ప్రవచనాల్లో విన్నాక గజేంద్రమోక్షంలోని ముఖ్యమైన పద్యాలను నేను రోజూ మననం చేసుకుంటూ ఉంటాను.పెద్దల సలహా మేరకు మిత్రులందరితో ఈ విషయం పంచుకోవటానికి సంతోషిస్తున్నాను.

       ముఖ్యంగా మనకు తెలియవలసిందేమిటంటే భగవద్గీత, భాగవతాది పుణ్యగ్రంథాలు చదివేటపుడు " ఆఁ ఇప్పట్నించీ ఎందుకు? ముసలివాళ్ళయ్యాక చదువు/ చదువుతాను" అనే మాటలు తప్పు అని తెలియటం.

       ఇప్పుడే మనం చదవలేకపోతున్నామంటే ఇంక ముసలితనము వచ్చాక ఎన్ని దేహ బాధలో ! కాసేపు కూర్చోలేము, కళ్ళు  పెద్ద అక్షరాలైతేనే చదవగలవు, చదవగానే అర్థం చేసుకునే మెదడు వేగం తగ్గిపోతుంది,
    ఎవరితోనైనా చదివించుకుందామంటే అందరూ బిజీ, చెవులు వినబడవు ఇంకా ఎన్నో ఉంటాయని విన్నాము. అనుభవానికొస్తే ఇంకా ఎన్ని తెలుస్తాయో!


     చిన్నప్పటి నుంచీ నేర్చుకుంటే ఈత వస్తుంది కానీ, ప్రాణాపాయం వచ్చినపుడు ఈత వచ్చేస్తుందా?
ఇప్పుడు సమాజంలో కొందరు పుణ్యాత్ములు తప్ప అందరం లౌకిక కార్యక్రమాల్లో అంటే ప్రాపంచిక కార్యక్రమాల్లో మునిగి తేలుతుంటాం. అలాగే ఒక ఏనుగు వనవిహారం, జలవిహారం ఇష్టానుసారంగా చేస్తూ, ఒక కొలను లో ఉండగా ఒక మొసలి పట్టుకుంటుంది. విడిపించుకోవటానికి వెయ్యి సంవత్సరాలు పోరాడి ఇక చాతకాదని తెలిశాక ఏనుగు సర్వేశ్వరుని ప్రార్థిస్తుంది. ఎంత భక్తి తో శరణాగతి చేసి ప్రార్థిస్తుందో పై పద్యంలో చూడండి.

       బలము కొద్దిగానైనా లేదు, మనోధైర్యము  దెబ్బతిన్నది , ఎప్పుడు పడిపోతానో తెలియదు, శరీరం అలసిపోయింది, కుప్పకూలటానికి సిద్ధంగా ఉన్నది, నీవు తప్ప నన్ను రక్షించేవారెవరయ్యా అని ఆర్తితో ప్రార్థిస్తున్నది.

       (సహస్రము)వెయ్యి అనగా అనంతము. అలాగే జీవుడు అనంతమైన కాలవాహినిలో జనన మరణాలనే సుడిగుండంలో పడి తిరుగుతూనే ఉంటాడు. అంటే ఇప్పటికి మనము ఎన్ని జన్మలెత్తామో, ఎన్ని సార్లు మరణించామో, ఇంకా ఎన్ని సార్లు జన్మిస్తామో కానీ ఇక్కడి మంచిచెడులను గుర్తించగలుగుతున్నామా ? లేదు. ఏ వస్తువు/ విషయం/ ప్రాణి ఆనందాన్ని కలిగిస్తున్నాయో వాటి వల్లనే ఒక్కో సమయంలో దుఃఖాన్నీ పొందుతున్నాము. ఇక్కడ కనిపించేదేదీ శాశ్వతం కాదనీ ఆనందం, దు:ఖం వచ్చి వెళ్తూనే ఉంటాయనీ తెలిసినా "తెలుసు" కోలేక చిక్కుకుపోతూనే ఉన్నాం.

       ఈ జీవి పైన పద్యంలో చెప్పిన విధం గా అలసిపోయాడు, శాశ్వతమైన స్థితి అయిన పరమేశ్వర సాయుజ్యాన్ని అన్ని భావాలకూ అతీతమైన పరమపదాన్ని చేరుటకు నీవే వచ్చి నన్ను తీసుకెళ్ళవయ్యా, నేను నిమిత్తమాత్రుడినని జీవుడు దేవుడికి చెప్పుకున్న మాటలుగా తీసుకోవచ్చు. కాబట్టి నాకత్యంత ఇష్టమైన పద్యమిది.

     పాఠంలో ఏమైనా తప్పులుంటే మన్నించి సూచించగలరు.అర్థ తాత్పర్యాలు ఇప్పుడు ఎన్నో చోట్ల పుస్తకాలలో లభిస్తున్నాయి కనుక భావం (నేను అర్థం చేసుకోగలిగినంత వరకూ) వ్రాశాను. 

3, జనవరి 2012, మంగళవారం

క్షేత్ర దర్శనము             దేవదేవుని దయవలన,  అభిరుచి కారణంగానూ తఱచుగా క్షేత్రదర్శనం అబ్బుతూ ఉంటుంది. ఈ సారి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం, భద్రాచల సీతారామ లక్ష్మణుల దర్శనము చేసే అవకాశము కలిగినది. అదీ రెండు చోట్ల అంతరాలయ దర్శనం టికెట్ తీసుకోవటం వల్ల ఇంకా బాగుండింది.

          భద్రాచలం లో దర్శన సమయంలో పది పదిహైదు మందిని లోపలికి పంపిస్తారు. వారందరిని ఆ చిన్న ప్రదేశంలో కూర్చోబెడతారు. అందరి గోత్రనామాలు అడిగి పూజ చేస్తారు. ఈ లోపు ధర్మదర్శనం ఆగకుండా మా వెనుక వైపు నుంచి వెళుతూనే ఉండటం వల్ల మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే చాలామందిని ఆపి మనం ప్రత్యేకంగా దర్శించుకోవటం వలన మనం తప్పు చేసినవాళ్ళమవుతాం. ఈ పద్ధతి బాగుంది.

       ఆవరణలో ఆంజనేయుడు సుందరంగా కొలువై ఉన్నాడు. కొంత ఎత్తు మీద గుడి ఉన్నది. ఒక పదహైదు, ఇరవై మెట్ల మీద. మూడువైపుల మెట్లు ఎక్కవచ్చు. నాలుగోవైపు నిర్మాణ/పునరుద్ధరణ జరుగుతున్నది.
మేము వెళ్ళినపుడు వైకుంఠఏకాదశి ఉత్సవాలు ప్రారంభమయినాయి. జనవరి ఐదు అంటే పుష్యశుద్ధ ఏకాదశి కి ముందు వారం నుంచీ అన్నమాట.

  గుడికి ఎదురుగా పెద్దస్థలము ఖాళీ చేయించి వేదిక నిర్మించారు. వేదిక ముందు భక్తులకోసం కొంచెం ఎత్తైన ప్రదేశంలో పచ్చిక రంగున్న కార్పెట్ ను పఱిచి సిద్ధం చేశారు. మొదటి రోజులు కదా, జనం పల్చగానే ఉన్నారు. మొదటిరోజు విష్ణుసహస్రనామ పారాయణ, లక్ష్మీ అష్టోత్తరం తో సహా చేశారు ఒక బృందం. వాటితో పాటు మామాదిరి వచ్చినవాళ్ళు గొంతు కలిపాం. తర్వాత సీతా స్వయంవరఘట్టం (కవికల్పిత కీర్తన) కు నృత్యప్రదర్శన జరిగింది. తర్వాత ఒక సంగీత కచేరి జరిగింది. తర్వాత దశావతారము అనే విషయం మీద నృత్యప్రదర్శన జరిగింది.

    రెండవరోజు వేరొక బృందం హనుమాన్ చాలీసా ౧౧ సార్లు పారాయణ జరిగింది. యథావిధిగా మేమూ.... ఒక్కొక్క సారి రాగం మార్చి పాడుతూ వచ్చారు. ౧౧ వ సారి శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి అనేపాట ఉంది కదా పాత సినిమాలో ఆఁ... ఆ  ట్యూన్ లో పాడారు. తర్వాత ఒక చిన్న అమ్మాయి చక్కటి కీర్తన సంగీత కార్యక్రమపు అంశం. తర్వాత ఇద్దరు చిన్న అమ్మాయిలు గజేంద్రమోక్షం అనే కీర్తనతో పాటు ఇంకా కొన్ని అంశాలతో నృత్యప్రదర్శన ఇచ్చారు.

   అన్ని కార్యక్రమాలు బాగున్నాయి. ఎన్నో సార్లు క్షేత్రాలకు వెళ్ళాం కానీ ఈ సారి అదేపనిగా రెండురోజులు ఉండి రిలాక్సింగ్ గా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం వలన ప్రధాన ఉద్దేశ్యమయిన ప్రశాంతత అనేది మనసుకు దొరుకుతుంది. ప్రతీ క్షేత్రం లో ఇలా జరుగుతుంటే బాగుంటుంది.

తిరుపతిలో కూడా కోలాటం లాంటివి జరుగుతుంటాయి కానీ అక్కడ విపరీతమైన దోమలు కూడా కచేరీ పెట్టేస్తాయి కాబట్టి నిలువలేము.