Loading...

27, సెప్టెంబర్ 2011, మంగళవారం

శరన్నవరాత్రులు

           దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు ఏ పేరుతో పిలిచినా దేవీ పార్వతి ని కొలిచే శుభదినాలివి. అమ్మవారు పార్వతీ, సరస్వతీ, లక్ష్మీ రూపాలతో మనలను అనుగ్రహించమని వేడినవారికి వేడని వారికి అందరికీ శుభాలను ప్రసాదించి, ధైర్యాన్ని, తద్వారా విజయాన్ని, జ్ఞానాన్ని తద్వారా ముక్తిని, సంపత్తును తద్వారా పరోపకారం చేయగల శక్తిని ప్రసాదిస్తూ ఉండే కరుణాస్వరూపమైన అమ్మవారిని స్మరిద్దాం.

         ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకూ అమ్మవారిని వివిధ ఆలయాల్లో వివిధరూపాలుగా అలంకరింపచేసి, మనకు దర్శన భాగ్యం కలిగిస్తారు గుళ్ళో అర్చకులు. వారికి ముందుగా అభివందనాలు.

            భీకరస్వరూపస్వభావాలు గలిగిన రాక్షసులను వివిధ రకాలుగా అంతమొందించిన అమ్మవారి మహిషాసుర మర్దినీ రూపం, ఆ స్తోత్రం అందరినీ ప్రభావితం చేస్తాయి.

              కనకదుర్గ, కాళీ, మహిషాసుర మర్దిని రూపాల్లో దేవిని పూజించటం చాలా చోట్ల కనిపించినా కొన్ని చోట్ల విజయదశమి సందర్భంగా పిల్లలకు మొదటిసారి పాఠశాలా ప్రవేశం చేయించటం మంచిదని విజయదశమి రోజు చేస్తుంటారు.

         చదువుకుంటున్న పిల్లలకు శలవులు అయిపోయి విజయదశమి రోజు తప్పని సరిగా చదవాలని బళ్ళు తెరవటం కూడా జరుగుతుంటుంది.

            మరికొన్ని చోట్ల శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం చేసుకోవటానికి అనుకూలం కాకపోతే కూడా నవరాత్రుల్లో ఒక రోజు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు.

            ఏరూపంలో కొలిచినా సృష్టికి మూలకారకమయిన శక్తి స్వరూపం ఒక్కటేనని మనందరికీ తెలుసు.
చిట్టిగౌను వేసినా, పట్టులంగా ,రవిక వేసినా, పైట వేసినా, చీరకట్టినా కన్నకూతురి మీద ఒకే ప్రేమే ఎలాగో అలాగన్నమాట.

            ఆ దేవి సకల జనులకూ శాంతి సౌభాగ్యాలను కల్గించాలని కోరుతూ ఈ వేళ తల్లిని ప్రార్థిద్దాం.

5, సెప్టెంబర్ 2011, సోమవారం

నేర్చుకోవాల్సి ఉంది.

                               అక్షరానికి ప్రపంచాన్ని జయించే శక్తి ఉంటుందా? అక్షరం - క్షరం కానిది, నేర్చుకున్నాక ఎప్పటికీ పోనిది అక్షరం- అలాంటి అక్షరాన్ని తొలిసారి పరిచయం చేసేది గురువు. నా విషయంలో మా అమ్మ బడికి చేర్చకముందే నాకు అక్షరాలు నేర్పిన తొలి గురువు.

                         ఆ మాటకొస్తే అక్షరాలే కాదు, ఏ విషయాన్నైనా, పనినయినా, గుణమయినా ఏదైనా నేర్పే వారంతా మనకు గురువులే. అలా చూస్తే ఎంతమంది గురువులో మనకు ఉంటారనేది సత్యము. ప్రపంచంలో మనకు ఎదురుపడే ప్రతి ఒక్కరి వల్లా మనం ఎంతో కొంత నేర్చుకుంటాం. మననించీ ఎంతో మంది ఎన్నో విషయాలు నేర్చుకుంటాం.


ఎన్ని నేర్చుకున్నా కొన్ని విలువైనవి ఉంటాయి.
అవి మనమంతా తప్పకుండా నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి.

  • పసిపాప ల నుంచి ఏ కల్మషమూ లేని అందమైన నవ్వులు.
  • అతి చిన్న జీవితమైనా, కాళ్ళక్రిందో , రాళ్ళక్రిందో పడి నలగి పోయే మరణమైనా సువాసనలు వెదజల్లుతూ, ఎవరి మనసునైనా ఉల్లాసంగా మార్చే రంగురంగుల పువ్వులు
  • స్వేచ్ఛ అంటే ఏమిటో అనుక్షణం నిరూపిస్తూ కూడా బాధ్యత తెలిసి పిల్లలను పెంచి, వాళ్ళు తమను చూడలేదని నిందించే అలవాటు ఆశ కూడా లేని రివ్వున ఎగిరే గువ్వలు
  • ఎన్ని అడ్డంకులెదురైనా, అడ్డుకట్టలు కట్టినా చివరంటా అలుగకుండా,ఆగకుండా ప్రవహించే నదీలలామలు.
  • బడబాగ్నులను దాచుకున్నా అతి ప్రశాంతంగా,        ప్రపంచాన్ని ముంచేసేంత జలమున్నా గంభీరంగా ఉన్నచోటనే ఉండే సముద్రుడు.                                                                                                                                                                                                                                                    వీళ్ళతో మనం నేర్చుకోవాల్సి ఉంది. ఈ గుణాలు ఉంటే జీవితం ఎంతో శోభిస్తుంది. చుట్టూ ఉన్న ఎవరికీ ఏ కష్టం కలిగించకుండా అందరూ ప్రేమనే పంచుకోగలరు.

4, సెప్టెంబర్ 2011, ఆదివారం

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ........

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ........

ఈ మాట మొట్ట మొదట శ్రీరాముడు అన్నాడుట. లంకావిజయానంతరం అక్కడే ఉండి పోవచ్చు కదా అని అన్నప్పుడు అన్నమాట.
కన్నతల్లి, సొంతఊరు  స్వర్గం కన్నా మించిన ఆనందం కలిగిస్తాయి. అని.
ఈ మాట ని బాగా అందరికీ తెలిసేలా చేసింది బహుశా నందమూరి తారక రామారావు గారే అనుకుంటాను. ఈ
 పాట ని ఇప్పుడు విందామా! జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ........ నీ తల్లి మోసేది నవమాసాలేరా,      ఈ తల్లి మోయాలి కడ వరకురా....................కట్టె కాలేవరకురా...