Loading...

8, డిసెంబర్ 2010, బుధవారం

రూపం, రంగు లేనిది...

అందరిలో ఉండే ఆత్మ ఒకటే అంటుంటారు. అది ఎలా ? మంచివాళ్ళు, చెడ్డవాళ్లు; స్వార్థపరులు, పరోపకారులు; మొత్తానికి ఉన్నత గుణాలున్నవారు, లేనివారు అందరిలో ఒకే ఆత్మ ఎలా ఉంటుంది?

మనిషి తయారుచేసే కరెంట్ ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుందా,పెద్దగా ఉంటుందా; బరువుగా ఉంటుందా, తేలిగ్గా ఉంటుందా; వెలుగునిస్తుందా, మనిషిని కాల్చేస్తుందా? వీటికి జవాబులు చిన్నా, పెద్దా అందరికీ తెలుసు. అలాగే ఆత్మ- రూపం, రంగు లేనిది. ఇంకే వికారమూ లేనిది.ఆత్మ శక్తిస్వరూపము. పరమాత్మగా ఉన్నపుడు అది భగవంతునితో సమానమైనది.

లోకంలోని మనుష్యుల, పశువుల ,పక్షుల శరీరాలు ధరించినపుడు అది జీవాత్మ అవుతుంది. పాంచభౌతికమైన ఈ శరీరాలవలన అది అంటే ఆత్మ అన్ని రకాల వికారాలకు లోనవుతుంది. పాంచభౌతికమైన అంటే భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు వీటితో రూపొందిన ఈ దేహాలు. ఈ దేహధర్మమే తన ధర్మమనుకుంటూ ఆత్మ తన అసలు స్వరూపాన్ని, స్వభావాన్ని వదిలేస్తుంది. ఈ దేహాన్ని వదిలినపుడే తిరిగి పరమాత్మలో కలిసిపోతుంది. అపుడు ఇక ఏ వికారాలూ ఉండవు.

ఎలాగంటే కరెంట్ ని బల్బ్ లో ప్రవేశపెట్టినపుడు కొద్ది వెలుగునిస్తుంది. ట్యూబ్ లో ఎక్కువ వెలుగు నిస్తుంది. కొందరు పుణ్యాత్ములు మనకు తమకున్న ఇంత వివేచనా శక్తిని మనకు పంచి పెట్టారుకదా, అంత మనలో లేదు కదా! ఇలాంటి భేదమే అన్నమాట.

మిక్సీలో కరెంట్ ప్రవహించినపుడు శబ్దం వస్తుంది. లైట్ లో శబ్దం ఉండదు. హీటర్ లో వేడి, ఏసి లో చల్లదనం ఇలా పరస్పర విరుద్ధమైన విషయాలలో ఒకే కరెంట్ పని చేస్తుంది. వైద్య విధానాల్లో కూడా పరస్పర విరుద్ధ పనులకు కరెంట్ ని వాడతారనుకుంటాను. నాకు ఆ విషయాలు తెలీవు. మనుష్యులు తయారు చేసిన కరెంట్ ఇలా ఉంటే, సాక్షాత్తూ ఆ దేవదేవుని సృష్టి లో ఎందుకు మంచి ,చెడు ఉన్నాయి. ఆ భగవంతుడు తలచుకుంటే అన్నీ మంచిగా ఉంచలేడా అనే ప్రశ్న లేదు . ఎందుకంటే ఏది మంచి, చెడు అనేది మనం నిర్ణయించలేనిది. అన్నీ భగవంతుని సృష్టి అయినపుడు అన్నీ మంచివే అయి ఉంటాయి.

ప్రతి వస్తువుకూ ఒక విలువ ఉండే ఉంటుంది. చిన్నప్పుడు బళ్ళో మంచి ఉపాధ్యాయులు కూడా ఒకసారి పక్షపాతం వహిస్తున్నారని విద్యార్థులు పొరబడతారు. నిలకడ మీద ఒక్కోసారి నిజం తెలుస్తుంది. అదే విధంగా భగవంతుని లీలావిలాసాలను గ్రహించి అర్థం చేసుకొనేంత జ్ఞానం మనకు ఉండాలి, ఆ స్థాయి రావాలికదా!
అందుకే అందరిలో పరమాత్మను దర్శించమని చెపుతూ ఉంటారు. తరచి తరచి చూస్తే అంతా ఒక్కటే, అన్నింటిలోనూ ఒకే కరెంట్ ఉన్నట్టే అందరిలోనూ ఉండేది ఒకే జీవాత్మ, అదే పరమాత్మ . ఇది అర్థం చేసుకుని, కొందరు యోగులయ్యారు. వాళ్ళు రుచి గురించి ఆలోచించరు. వెన్నని, మన్నుని ఒకే రకంగా చూసే కన్నయ్య వారికి ఆదర్శం. శరీర పోషణ, పరిరక్షణ గురించి లెక్క చేయరు. చలి, ఎండల వలన; ఆకలి,దాహం వలన; నొప్పినీ , సంతోషాన్నీ ఒకే లా భరించగల యోగులయ్యారు.

ఇందులో ఉన్నా ఇది మనం కాదు అని గ్రహించగలుగుతున్నారు. మనకు చెప్పగలుగుతున్నారు. వాళ్లు ఎంత చెప్పినా మనం అర్థం చేసుకోవటం అంత సులభమేంకాదు. దేహాన్ని కాకుండా ఆత్మని పరమాత్మ స్వరూపంగా భావించి ప్రేమించగలిగటం అంత తేలిక కాదు. తననీ , తనకి హాని కలిగించేవారినీ మనం అంటే మనుష్యులు ఒకేలా చూడగలరా? చూడలేరు. చాలా కష్టం. అయితే అసాధ్యం కాదు. కష్టసాధ్యం .

కళ్ళెదురుగా ఎంతెత్తో కనిపిస్తున్నా , కొండని అందరూ ఎక్కలేరు. కొందరికి శరీరం సహకరించదు, ఇంకొందరికి మనసు సహకరించదు. ఒకరు మొదలుపెట్టి ఆపేస్తారు. మరొకరు అబ్బే , ఈ పని మాది కాదు అనుకుంటారు.
కానీ అనుకుంటే నెఱవేఱ్చలేనిది కాదు.అలాగే జీవాత్మలో పరమాత్మని చూడటం కూడా. ఇన్ని రకాల వైవిధ్యాలున్న ఈ లోకంలో ఎలా ఒకే పరమాత్మని సందర్శించగలం? మంచితనంలో , చెడ్డతనంలో ఎలా దైవత్వాన్ని చూడగలం అంటే..
ఎలా రాజు అయినా, పేద అయినా వాడూ మనిషే కదా అని అంటుంటాం కదా; పరమాన్నంలో , గంజిలో ఆకలి తీర్చే ఆహారాన్ని చూడగలుగుతున్నాం కదా;

సంపదలోనూ, పేదరికంలోనూ మనిషిని నడిపేది ఒక నమ్మకమే అని అంటున్నాం కదా; అలాగే అన్నివైరుధ్యాల్లోనూ పరమాత్ముడున్నాడు అనేది.

ఇది మనం గ్రహించగలగాలంటే శ్రమించాలి. డబ్బులున్నాయి, ఆశలున్నాయి అంటే కర్మాగారాల్లో వస్తువులు తయారవ్వవు కదా! శ్రమ కూడా ఉండాలి. అలాగే ఈ విషయాన్నీ మనం అధ్యయనం, అభ్యాసం చేసె శ్రమ తీసుకుంటేనే అర్థం అవుతుంది.

తెలుసుకోగలిగిన నాడు జ్ఞాని అవుతారు. అపుడు మీరు జ్ఞాని అయ్యారా అని ఎద్దేవా చేయబోకండి. తెలుసుకోవటం లో స్థాయీభేదాలు ఉంటాయి కదా! ఊరికే తెలుసుకోవటం కాకుండా అందరూ ఒక్కటే అని అనుభూతి చెందగలగాలి. ఒక విద్యార్థి ఒక జంతువు శరీరంలోని అన్ని భాగాలు తెలుసుకోవచ్చు. కానీ ఒకరి సందేహాలను తీర్చగలిగే స్థాయి అధ్యాపకునికే ఉంటుంది. ఆయా భాగాలు పని ఆపినపుడు ఎలా సరి చెయ్యాలి అని తెలుసుకున్నవాడు వైద్యుడు. సరిచేయటానికి కావలసిన ఔషధాన్ని తయారుచేసే వాడు పరిశోధకుడు. ఒక్కోస్థాయికీ సంకల్పం, శ్రమ ఆ స్థాయికి తగినట్టుగా చేయగలిగితేనే మనం గమ్యం చేరుకోగలం.

ఈవేళ్టికి నా ఆలోచనలు ఇలా సాగాయి. ఇదంతా నీవేమీ కనిపెట్టలేదు, ఎంతోమంది చెప్పారు అంటారా, అవును మరి.
నేనూ ఎంతో మంది చెప్పినవి విన్నాకే నా ఆలోచనలు ఇలా సాగుతున్నాయి. మళ్ళీ నేనెందుకు చెప్పటం అంటే ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకోవటం ఎలా అలాగే నేర్చుకోవాలోఇలాంటి విషయాలు ఆలోచించటం, నలుగురితో పంచుకోవటం కూడా అలాగే అని నేను భావిస్తున్నాను కాబట్టి. ఇందులో తప్పు దొర్ల్లిన యెడల పెద్దలు తెలియచేయగలరని ఆశిస్తున్నాను.