Loading...

30, డిసెంబర్ 2008, మంగళవారం

అష్టలక్ష్మీ స్వాగత గీతం

శుక్రవారపు లక్ష్మి రావమ్మా
వరములొసగే తల్లి మాయమ్మా
చక్రధరుడైనట్టి ఆ విష్ణు తోడ
ఆదిలక్ష్మీ నడచి రావమ్మా!!

ఆకలన్నది ఇలను లేకుండ చేసి
పాడిపంటల కొరత రాకుండ చూసి
లోకాల పాలించు శ్రీ ధాన్యలక్ష్మీ
స్థిరముగా నుండగా సుస్వాగతం!!


భవ సాగరమ్మున భయమన్నదే లేక
సాహసంబున భువిని సాగిపోవంగ
ఆశీస్సులందించ వేగ రావమ్మా
ధైర్య లక్ష్మీ నీకు ఘన స్వాగతం!!

శుభ రూపిణీవమ్మా మంగళదాయినీ
క్షీరాబ్ధికన్యవూ శ్రీదేవివీ
గజలక్ష్మినీవై మమ్మేలు దేవేరి
మా ఇంట కొలువుండ సుస్వాగతం !!

అభయహస్తము చూపి మమ్ము గావంగా
మనువాడినా హరిని ఒప్పించవమ్మా
సంతు నిచ్చే తల్లి సంతానలక్ష్మీ
దయచేయవే నీకు సుస్వాగతం!!

కార్యసాధనలో కలుగనీ విజయాలు
కరుణించి ఏలగా కదలి రావమ్మా
కలహంస నడకల్ల కమలాక్షివీ
విజయలక్ష్మీ నీకు ఘనస్వాగతం!!

వాణివై వీణవై గీర్వాణి నీవై
జ్ఞానమ్ము నొసగే కల్యాణివై
మా కల్పవల్లివై శ్రీ విద్యా లక్ష్మీ
దయచేయవే నీకు సుస్వాగతం!!

ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ
పావనంబయ్యేను మా మందిరం
సపదలనిచ్చేటి సౌభాగ్య లక్ష్మీ
జయజయా ధ్వనులతో సుస్వాగతం!!
లక్ష్మీదేవి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి