Loading...

16, ఏప్రిల్ 2019, మంగళవారం

ఏమి చేతునో!

నితము నంతరంగముననీకముఁ జేయుచు వేగుచున్న, దే
రుణము నెట్టులౌనొ యని తాళగ జాలని యుత్సుకమ్ము నే
యని కొత్త యూహల, నల్పముగా జనియింపజేయగా
గునఁ జేరు కల్పనల ల్లను యుల్లము నేమి చేతునో!

15, ఏప్రిల్ 2019, సోమవారం

వ్యక్తి పూజలేల?

గుణములఁ జూచుచు గొప్పగా మెచ్చుచు
                    వ్యక్తి పూజలు సేయ వ్యర్థమగును 
 గుణములఁ బాటింప గొప్పదనము గాని
              పొగడుచు నుండిన పొల్లు సమము
నాటి కావ్య పురాణ నాయకులనుఁ గాని
              నేటి వారలఁ గాని నిక్కమిదియె
మాటల మూటల ర్మంపు కథలందు
                   కోటలు దాటింప గొప్పకాదు

యుగము దాటి మరల యుగములు గడచిన
నింత యేని యెఱుగ కేమి ఫలము?
చెప్పు వారు చెప్పి చెప్పి యూరకనుండ
డుసుఁ ద్రొక్కి చూడ నాశ లేల? 

16, ఫిబ్రవరి 2019, శనివారం

స్వయంకృతాపరాధమే

                         ఆత్మాహుతి జీహాదీ , మళ్ళీ పెద్ద సంఖ్య (ఈమధ్య కాలం) లో సైనికుల దుర్మరణం, మళ్ళీ అన్ని మీడియాల్లో నిప్పులు గ్రక్కడం, మళ్ళీ ఎమ్ ఎఫ్ ఎన్ స్టేటస్ తీసేయడం, మళ్ళీ  (నేరస్తులకు తగిన శిక్షల) అవే ప్రకటనలు, మళ్ళీ రెండు రోజులకు అదే ఆక్రోశాల వీధికి ఇంకొక ఘటన అతిథిగా వస్తే దీన్ని వదిలేసి మరిచిపోవడం. ఎన్నిమార్లిలా?
                ఎందుకు ఆవేశాలిలా అనేది ఇప్పటి నా సందేహం. అందాల కాశ్మీరు అఘాయిత్యాల ప్రదేశం గా మారి ఎన్నేళ్ళయింది? రోడ్ల మీద జవాన్ల దారిలో ఎన్ని సార్లు బాంబులు నాటారు? ఎన్ని సార్లు సూయిసైడ్ అటాకర్లు వచ్చారు? ఈ నాటి సమాచారయుగంలో ఇది ముందుగా కనిపెట్టడం , నివారించడం, కనీసం ఎదుర్కొనే సంసిద్ధత లేకపోవడం ఎలా? (రెండు రోజుల ముందు ట్విట్టర్ లో ఈ వార్త తిరిగిందని వదంతి)పైగా వెహికిల్ వేస్కుని వందలకేజీల విస్ఫోటకాలు పట్టుకొస్తూంటే అంత పెద్ద డెబ్భైఎనిమిది వాహనాల కాన్వాయ్ దగ్గరికి చేరుతుంటే ఎలా ఆపలేకపోయారు? ఆకాశం నుంచైతే ప్రత్యక్షం కాలేదు గా?మనకు చేతగాలేదు ఇక ఈ ఆర్భాటపు పలుకులెందుకు?

            యుద్ధం చేయాలని, బుద్ధి చెప్పాలని ఈసారి లెఫ్ట్ రైట్ లన్నీ రెచ్చిపోతున్నాయి. అసలు కనిపించని శత్రువుతో ఎవరు ఎలా యుద్ధం చేయగలరు? ఆర్మీకి ఫ్రీ హేండ్ ఇచ్చారట. ఇస్తే?? ఏమవుతుంది?

             యుద్ధానికి సిద్ధమవ్వాలంటే ఆయుధాలు, ఆత్మవిశ్వాసాలు మాత్రమే కాదు. ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. కార్గిల్ లోనో ఆత్మరక్షణ లాగా, బంగ్లాదేశ్ ను లిబరేట్ చేయడం లాగా, ఇంకా మిగతా వాటిలాగా ఒక లక్ష్యం ఉండాలి. (plan of action, strategy) శత్రువు ఎవరు అని ఒక స్పష్టత ఉండాలి. ఉన్నా ఉపర్యుక్త విషయాలలో జరిగిందేమిటి , ఎవరు ఎలా గెలిచారు, ఓడారు అన్నది వేరే మాట. అసలు అయితే లక్ష్యం ఉంది. ప్రత్యర్థి ఉన్నారు.

                పాకిస్తాన్ బేస్డ్ అనే అన్ని సమూహాల గురించీ పత్రికలు వ్రాయగలవు తప్ప పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందనడానికి మనం ఆధారం సంపాదించలేకపోయాం. ముంబయిదాడిలో అన్ని ఆధారాలు వగైరాలు పంపించినా పాకిస్తాన్ ని ఒప్పించలేకపోయినాం. పెద్ద నాయకులంతా నోటి వరకూ , ప్రసంగాల వరకూ తిట్టిపోయగలరే కాని వాస్తవమైన , క్షేత్రపరమైన, వస్తుపరమైన ఆధారాల గురించి రైటింగ్ లో పెట్టలేరు. చప్పున పోయి పాకిస్తాన్ శత్రుదేశమని యుద్ధం ప్రకటించడం కుదిరే పని కాదు. అంతర్జాతీయ సమాజమూ కట్టుబాట్లు కొన్ని ఉంటాయి.

         పైపెచ్చు ఒకటి రెండు నెలల్లో ఎన్నికలు ఇంత పెద్ద ప్రాంతంలో నిర్వహించే పెద్ద పెళ్ళి పని ముందుండగా , ఇప్పటి ప్రభుత్వం పెద్ద నిర్ణయాలు తీసుకుంటే ఎక్కడ పార్టీ పరంగా నష్టపోతామో అని పైపై మాటలు చెప్తుందే గానీ ఏ రిస్కూ తీసుకోదనేది బహిరంగ రహస్యమే.

      ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే ఏమీ జరగబోయేది లేదు. లేని పోని ఆవేశాలెందుకు వ్యక్తిగత , సంస్థాగత మీడియాల్లో? దండగ.

           పైగా ఇది మొదటిది కానట్టే చివరిదీ కాదు. అశుభం పలకాలని కాదు కానీ ఇదంతా మన స్వయంకృతాపరాధమే కాబట్టి ముందు వచ్చే పరిణామాలు ఇంతకన్నా గొప్పగా ఉంటాయని ఆశించలేము.
కాశ్మీరు రాజు హరిసింగ్ కలవాలనుకోలేదు కొన్నాళ్ళు  , ఏదో అవసరంకొద్దీ పాకిస్తాన్ దాడి చేస్తే సాయం అని వచ్చినప్పుడు కలిసిపోతేనే వస్తాం అని సంతకాలు పెట్టించుకున్నామన్నది మరిచిపోరాని చరిత్ర. తర్వాత నచ్చని వాళ్ళు కుట్రతో మాయోపాయాలతో (ప్రజల అభిప్రాయం అంటున్నారని) ప్రజలనే రిప్లేస్ చేసి అభిప్రాయాలను తిరగరాసేశారు, కుట్రో మరోటో. మనము వాళ్ళు కలిసి సృష్టించుకున్న ఈ మారణహోమం ఇప్పట్లో చల్లారే ఆశ కనిపించట్లేదు. మనము పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరని, వాళ్ళు ఇండియా ఆక్రమిత/పాలిత కాశ్మీరని కొట్టుకుంటూ ఉంటాము. ఉన్నట్టుండి ఏదో చమత్కారం జరిగి అంతా బాగై పోయే ఆశ పెట్టుకొని కూర్చోవడం తో సహా ఇప్పుడు జరిగే knee-jerk  reactions అన్నీ హాస్యాస్పదాలే.

23, డిసెంబర్ 2018, ఆదివారం

తప్పే కదా!

                     భారతదేశం పక్కదేశాలపైన దండెత్తదంటూ మన భుజం మనమే చరచుకోవడం గొప్పలకు బానే ఉంటుంది, అది నిజంగా ఎంతవరకు నిజం? అవతలి దేశపు బలహీనతలను దురుపయోగం చేసుకోకుండా ఉండగల స్వభావం, సత్ప్రవర్తన మనకు ఎంతవరకు ఉన్నాయో, ఆకాలం విషయాలు పక్కన బెట్టి సమకాలీన పరిస్థితులలో మనం ఏం చేస్తున్నామో చూద్దాం.
https://www.forbes.com/sites/saritharai/2013/10/30/indian-outsourcing-firm-infosys-to-pay-record-u-s-visa-fine/#3c923548806f

             అమెరికా  లో ప్రతిభకు గుర్తింపు, మంచి సంపాదన, లివింగ్ కండీషన్స్ అంటూ ఆలోచించే వ్యక్తిగత వలసల విషయం సరే. ఆ మధ్య కాలంలో అమెరికా వీసా నిబంధనల సడలింపు జరిగాక ఐటీ కంపెనీలు తమ ఉద్యోగస్తులను హెచ్ ఒన్ బీ వీసాల ముసుగులో మిగతా వీసాల వాళ్ళను కూడా అక్కడికి తరలించి, వాళ్ళు వాళ్ళ స్పౌసులను, క్రమేపీ ఇన్ లాసు ను ఇలా గుంపులు గుంపులుగా అక్కడ సెటిలైపోయి, కంపెనీలలో ఇలా వెళ్ళిన వాళ్ళు పాలెగాళ్ళుగా ఆధిపత్యం చెలాయిస్తూ, అక్కడి అమెరికనులను, అమెరికను పౌరసత్వం పొందిన ఇతర భారతీయులను కూడా వివక్షకు గురి చేస్తున్నారని స్వయంగా భారతీయకంపెనీల ఐటీ సేవలను పొందిన ఒక ఎన్ ఆర్ ఐ వ్రాసిన వ్యాసం ఒకటి  ఉదయకాల అనే కన్నడ పత్రికలో రెండు భాగాలుగా ప్రచురింపబడింది.
      
            ఇవేవీ వ్యక్తిగతంగా ఒకరో ఇద్దరో చేయగలిగిన పనులు కాదు, కంపెనీలు వెనుక ఉండి చేయిస్తున్న పనులు. దీనిద్వారా వీళ్ళంతా ఒకదేశాన్నేదో నాశనం చేస్తారని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కానీ వీసా నిబంధనల లో ఉన్న లొసుగులను ఇక్కడ చట్టాలకు మల్లేనే దురుపయోగం చేయడానికి కొన్ని కంపెనీలు వెనుకాడలేదు. ఎక్స్ పర్ట్ లన్న పేరుతో సాఫ్ట్ వేరు కు సంబంధంలేని వాళ్ళు కూడా తక్కువ రాళ్ళకే దొరుకుతారంటూ క్లయింట్లను మభ్యపెట్టి, క్రమంగా ఒకరికి నలుగురిని పంపుతూ ఇలా వెళ్ళిన గుంపులంతా అక్కడ భారతీయసంస్కృతిపేరుతో నానా రచ్చా చేస్తూ ఒక సంఘం మీద ఇంకొక సంఘం దుమ్మెత్తిపోసుకుంటూ చాలా కాలమే గడిచింది.
                  ఇప్పుడు అమెరికా మేలుకొని వీసా నిబంధనల పై వారికి ఉపయుక్తమైనట్టుగా ఆంక్షలు విధించేసరికి కంపెనీలెన్నో అమెరికాకు ఫైనులు కడుతున్నాయట. మేమేమీ నిబంధనలను అతిక్రమించలేదని వారంటున్నా, దురుపయోగాలంటూ జరిగాయి. green pastures ను వెదుక్కుంటూ పోవడం వేరు. వ్యాపారపరంగా ఒకనాడు ఈ దేశానికి వలసలు జరిగాయి. ఈనాడు మేధోపరంగా మనదేశం చేస్తున్నదాంట్లో ఏ సమస్యా లేదనీ, రాదనీ చెప్పగలమా? భావిప్రశ్నలు అలా ఉండనీ నేడు జరుగుతున్నది చూస్తుంటే ఈ వ్యాసం మొదట్లో చెప్పుకున్న గొప్పలకు మనం అర్హులమేనా అన్న ప్రశ్నకు పూర్వపు ఆధారాలవరకూ అక్కర్లేదు, ఈ నాటి ఈ ఆధారాలే చాలు కాదనడానికి అని తెలుస్తోంది కదా.

27, నవంబర్ 2018, మంగళవారం

గీతం

ఈ పాట నేను వ్రాయగా 26-11-18 న ఆకాశవాణిలో ప్రసారమైంది.
గానం- డి వి మోహనకృష్ణ మరియు బృందం.
 సంగీతం - కే సూర్యనారాయణ దీక్షితులు
 ఆకాశవాణికి కృతజ్ఞతలు.

హరినారాయణ యని మనసారగా అననీయరా
కరివరదా నిను శరణాగతిగా కననీయరా ॥ హరి॥

సుఖసౌఖ్యమ్ముల సంతోషమ్ముల
నంతో ఇంతో గాంచితినయ్యా
కష్టమునోర్చి ఇష్టము విడచి
నిష్టూరమ్ముల నొచ్చితినయ్యా
 నీకడ నాకిక నిలకడ నొసగుము నమ్మకముంచేనురా ॥హరి॥

విసిగితినయ్యా భవ బంధమ్ముల
వేసారితినీ యారు గుణమ్ముల
రోసితినయ్యా ఇహలోకమ్మున
నలిగితి నేనూ ఆశనిరాశల
నీ కడ నాకిక నిలకడ నొసగుము నమ్మకముంచేనురా ॥ హరి॥

----
సంవత్సరం క్రితం (ఋషిపీఠం పత్రికకు) వ్రాసిన పద్యాలు -
ఇందులో భావం గురించిన అజ్ఞానం మీద గురుకృప వలన కొంత కాంతి ప్రసరించింది. పద్యాల నడక గురించిన ఇష్టంతో ఇక్కడ పెడుతున్నాను.  (సంస్కృతం లోని నయనపథగామీ అష్టకానికి స్వేచ్ఛాను వాదము)
మత్తకోకిల ఛందోరూపము-
1. నాదమా యమునానదీ తటి నల్లనల్లన మ్రోగగా,
నాదిలక్ష్మి, గణేశ, బ్రహ్మ, మహా శివాదులు మ్రొక్కగా,
స్వాదుమాధురి గోపిమోమున సాజరీతులఁ గ్రోలుచున్,
నాదు దృక్కుల నిల్చియుండుము నాథ! నీలపు మాధవా!

2. వంశి, పింఛము, పట్టుదట్టియు, పాలనవ్వుల తోడుగా,
నంశుమంతులు వేలు కూడిన నబ్బురంపు ప్రకాశమున్,
సంశయమ్ములఁ దీర్చుచుండెడి చల్లనైన కటాక్ష మే
యంశమైనను నాకుఁజూపుమటందు, నీలపు మాధవా!

3. నీలపర్వత శ్రేణులందున, నీలి సంద్రపుతీరమున్,
చాల ప్రీతిని యన్నతోడ, నిజానుజాత సుభద్రతోన్,
మేలుకొల్పులు వేల్పులందరు మించు భక్తినిఁ బాడగా,
నేలుచుంటివి. దర్శనమ్మిడు నేడు, నీలపుమాధవా!

4. ఆ కృపార్ణవు, మేఘవర్ణుని నా సతీ కమలాక్షియున్,
నాకనాథుఁడు, శారదాసతి నమ్మి కీర్తనఁ జేయగా,
లోకబంధుగ నా శృతీస్మృతులొక్కటై నినుఁ గొల్వగా,
నాకు దిక్కుగ నిల్చియుండుము నాథ! నీలపు మాధవా!

5. భూతలమ్మను స్యందనమ్మున పుణ్యవంతుల పంటగా
గీతనాట్యపు సంభ్రమమ్ముల కృష్ణభక్తుల వేడుకై
జోతలందుచు నేగుచుండెడి శోభఁ గాంచగ వేడుదున్,
నా తమింగని కానుపింపుము, నాథ! నీలపు మాధవా!

6.నీరజాక్షుఁడు, దివ్యతేజుఁడు, నీలికొండకు నేలికై,
కోరుకున్న లలామ రాధకు కొంగుబంగరు పోలికై,
కూరిమిన్ తననాదిశేషుఁడు కోరి మోయుచునుండగా,
దారి చూపెడి స్వామివందురు, దారు నీలపుమాధవా!

7.హాటకమ్ములు, సంపదల్ మరి యాధిపత్యముఁ బెండ్లియున్
మాటకైనను కోరనెప్పుడు. మా మహాశివుడర్చనల్
మాటిమాటికి చేయు స్వామివి, మాదు డెందము నిండ, నే
నాటికిన్ స్థిరవాసముండుము నాథ! నీలపుమాధవా!

8.సారహీనపు బంధనమ్ములు, చాల పాపపు మూటలున్
భారమైనవి. మోయజాలను పాపనాశ! భవాబ్ధినిన్
తారకమ్మయి కావరాగదె, దానవాంతక వేగమే!
జారకుండెడి భక్తినీయవె చాలు, నీలపుమాధవా!

ఈ సంబోధన ల వంటి నామరూపలింగభేదాలు వర్జ్యాలు.
ఈ విషయంలో దారిచూపగలిగిన వారు సూచనలివ్వగలరని ఆశిస్తాను.